2 కొరింథీ 10 - తెలుగు సమకాలీన అనువాదముపౌలు పరిచర్యకు అతని రక్షణ 1 క్రీస్తు యొక్క వినయం సౌమ్యతను బట్టి నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. పౌలు అనే నేను, మీతో ముఖాముఖిగా ఉన్నపుడు “పిరికివాడిని” కాని మీకు దూరంగా ఉన్నపుడు “ధైర్యశాలిని.” 2 ఈ లోక పద్ధతులతో మేము జీవిస్తున్నామని భావించే కొందరితో ధైర్యంగా వ్యవహరించాలని అనుకుంటున్నాను, కాని నేను అక్కడికి వచ్చినప్పుడు అలా జరగకుండా ఆపాలని మిమ్మల్ని బతిమాలుతున్నాను. 3 మేము ఈ లోకంలో జీవించినా ఈ లోకంలా మేము పోరాటం చేయము. 4 మా పోరాటంలో మేము ఉపయోగించే ఆయుధాలు ఈ లోకసంబంధమైన ఆయుధాలు కావు, కాని కోటలను కూడ ధ్వంసం చేయగల దైవశక్తిగల ఆయుధాలు. 5 వితండ వాదాలను, దేవుని జ్ఞానానికి అడ్డునిలిచే ప్రతి ఆటంకాన్ని మేము ధ్వంసం చేస్తాం. ప్రతి ఆలోచనను చెరపట్టి క్రీస్తుకు లోబడేలా చేస్తాం. 6 మీ విధేయత సంపూర్ణమైన తరువాత, ప్రతి అవిధేయతను శిక్షించడానికి మేము సిద్ధంగా ఉన్నాము. 7 పైకి కనబడే వాటిని బట్టి మీరు తీర్పు తీరుస్తున్నారు. ఎవరైన తాము క్రీస్తుకు చెందిన వారమని నమ్మితే, వారిలా మేము కూడా క్రీస్తుకు చెందినవారమే అని మరల వారు ఎంచాలి. 8 పడగొట్టడానికి కాదు మిమ్మల్ని కట్టడానికే ప్రభువు మాకు ఇచ్చిన అధికారాన్ని గురించి ఒకవేళ నేను గొప్పలు చెప్పుకొన్నా దాని కొరకు నేను సిగ్గుపడను. 9 నేను నా పత్రికలతో మిమ్మల్ని భయపెట్టాలని అనుకోవడం లేదు. 10 “ఇతని పత్రికలు గొప్పగా శక్తివంతంగా ఉంటాయి కాని వ్యక్తిగా అతడు బలహీనుడు అతని మాటలు విలువలేనివి” అని కొందరు అన్నారు. 11 మేము లేనప్పుడు పత్రికల్లో ఏమి వ్రాసామో మేము అక్కడ ఉన్నప్పుడు మేము అదే చేస్తామని అలాంటివారు గ్రహించాలి. 12 తమను తామే పొగడుకునే వారితో మమ్మల్ని వర్గీకరించుకోడానికి గాని పోల్చుకోడానికి గాని మాకు ధైర్యం లేదు. ఎప్పుడైతే వారు తమను తామే కొలుచుకుంటారో తమతో తామే పోల్చుకుంటారో వారు తెలివిలేనివారని అర్థం. 13 మేమైతే పరిమితికి మించి పొగడుకోం, అయినా, దేవుడు మాకు కొలిచి ఇచ్చిన హద్దులలోనే ఉన్నాము, ఆ హద్దులో మీరు కూడా ఉన్నారు. 14 క్రీస్తు సువార్తతో మేము మీ దగ్గరకు వచ్చాము కనుక మీ దగ్గరకు మేము రానట్లుగానే మేము పొగడుకోవడంలో మా హద్దులు మీరడం లేదు. 15 ఇతరులు చేసిన పనుల గురించి మా హద్దులు దాటి మేము గొప్పలు చెప్పము. మీ విశ్వాసం అభివృద్ధి చెందుతూ, మీ మధ్యలో మేము పనిచేయాల్సిన ప్రాంతం విస్తరించాలని మా నిరీక్షణ. 16 అప్పుడు మీకు అవతల ఉన్న ప్రాంతాల్లో కూడా మేము ఈ సువార్తను బోధించగలం. కనుక వేరొకరి ప్రాంతంలో ఇంతకు ముందే జరిగిన పని గురించి మేము పొగడుకోవాలని కోరడంలేదు. 17 అయితే, “గర్వించేవారు ప్రభువులోనే గర్వించాలి.” 18 తనను తానే మెచ్చుకొనేవారు యోగ్యులు కారు గాని, ప్రభువు మెచ్చుకొనేవారే యోగ్యులు. |
తెలుగు సమకాలీన అనువాదము™, క్రొత్త నిబంధన
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022 Biblica, Inc.
అనుమతితో ఉపయోగించబడినది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.
Telugu Contemporary Version™, New Testament
Copyright © 1976,1990, 2022 by Biblica, Inc.
Used with permission. All rights reserved worldwide.
Biblica, Inc.