Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

1 తిమోతికి 1 - తెలుగు సమకాలీన అనువాదము

1 మన రక్షకుడైన దేవుని, మన నిరీక్షణయైన క్రీస్తు యేసు ఆజ్ఞ వలన క్రీస్తు యేసు యొక్క అపొస్తలుడైన పౌలు,

2 విశ్వాసంలో నాకు నిజ కుమారుడైన తిమోతికి వ్రాయునది: తండ్రియైన దేవుని నుండి మన ప్రభువైన క్రీస్తు యేసు నుండి నీకు కృప, కనికరం, సమాధానములు కలుగును గాక.


అబద్ధ బోధకులను వ్యతిరేకించడానికి నియమించబడిన తిమోతి

3 నేను మాసిదోనియా ప్రాంతానికి వెళ్తూ, నేను నిన్ను కోరిన విధంగా, నీవు ఎఫెసు పట్టణంలోనే ఉండి, అక్కడ సత్యానికి విరుద్ధమైన బోధలు చేస్తున్నవారిని అలా బోధించవద్దని,

4 కట్టుకథలపై అంతులేని వంశచరిత్రలపై శ్రద్ధ చూపవద్దని ఆజ్ఞాపించు. వీటన్నిటి వలన విశ్వాసంతో జరిగే దేవుని పని ముందుకు కొనసాగే బదులు వాగ్వివాదాలకు దారి తీస్తాయి.

5 ఈ ఆజ్ఞ యొక్క లక్ష్యం ప్రేమ; అది స్వచ్ఛమైన హృదయం నుండి, మంచి మనస్సాక్షి నుండి, యదార్థమైన విశ్వాసం నుండి కలుగుతుంది.

6 కొందరు వీటిని విడిచిపెట్టి, అర్థంలేని మాటల్లో పడ్డారు.

7 వారు దేవుని ధర్మశాస్త్ర ఉపదేశకులుగా వుండాలని అనుకుంటారు, కాని తాము మాట్లాడే వాటి గురించి లేదా తాము ఎంతో నమ్మకంగా నొక్కి చెప్పే వాటి గురించి వారికే తెలియదు.

8 ధర్మశాస్త్రాన్ని సరియైన రీతిలో ఉపయోగిస్తే అది మంచిదే అని మనందరికి తెలుసు.

9 అంతేకాక ధర్మశాస్త్రం నీతిమంతుల కొరకు కాదు గాని, చట్టానికి విరుద్ధంగా ఉన్నవారికి, తిరుగుబాటు చేసేవారికి, భక్తిహీనులకు, పాపులకు, అపవిత్రులకు, నాస్తికులకు, తమ తల్లిదండ్రులను చంపేవారి కొరకు, హంతకుల కొరకు

10 లైంగిక అనైతికత కలిగినవారి కొరకు, స్వలింగసంపర్కులకు, బానిస వ్యాపారం చేసేవారికి, అబద్ధాలు చెప్పేవారికి, దొంగ సాక్ష్యం చెప్పేవారికి, స్వచ్ఛమైన బోధకు వ్యతిరేకంగా ఉన్న వారి కొరకు నియమించబడిందని మనకు తెలుసు.

11 దేవుడు నాకు అప్పగించిన ఆయన మహిమను గురించిన సువార్తకు అనుగుణమైనదే, ఈ స్వచ్ఛమైన బోధ.


పౌలు పట్ల ప్రభువు కృప

12 నన్ను నమ్మకమైన వానిగా తలంచి బలపరచి తన సేవ కొరకు నన్ను నియమించిన, మన ప్రభువైన క్రీస్తు యేసుకు నేను కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను.

13 ఒకప్పుడు నేను క్రీస్తును తెలుసుకోక ముందు విశ్వాసంలో దృఢపడక ముందు దైవదూషణ చేసేవానిగా, హింసించేవానిగా దుర్మార్గునిగా ఉన్నాను అయినప్పటికి దేవుడు నన్ను కనికరించాడు.

14 మన ప్రభువు యొక్క కృప, యేసుక్రీస్తులోని ప్రేమ, విశ్వాసం నాపై విస్తారంగా క్రుమ్మరించబడింది.

15 క్రీస్తు యేసు పాపులను రక్షించడానికి ఈ లోకానికి వచ్చారనే మాట నమ్మదగింది పూర్తిగా అంగీకరించదగింది. అలాంటి పాపులలో నేను అతి దుష్టుడను.

16 అయితే ఆ కారణంగానే, నిత్యజీవాన్ని పొందడానికి ఆయనలో నమ్మకముంచబోయే వారికి మాదిరిగా ఉండడానికి, అతి దుష్టుడనైన నాలో క్రీస్తు యేసు తన యొక్క అపరిమితమైన దీర్ఘశాంతాన్ని చూపించారు.

17 కనుక నిత్య రాజుగా వున్న, అమరుడగు అదృశ్యుడైన ఒకే దేవునికి ఘనత మహిమలు నిరంతరం కలుగును గాక. ఆమేన్.


తిమోతికి తిరిగి బాధ్యతలను అప్పగించుట

18 తిమోతీ, నా కుమారుడా! నీ గురించి ఇదివరకే చెప్పబడిన ప్రవచనాలు నెరవేరడానికి నేను ఈ ఆజ్ఞ నీకు ఇస్తున్నాను. నీవు వాటిని జ్ఞాపకం చేసుకుంటూ మంచి పోరాటాన్ని పోరాడు.

19 మనం మంచి మనస్సాక్షిని విశ్వాసాన్ని కలిగివుంటేనే పోరాడగలం, అయితే కొందరు విశ్వాసాన్ని వదిలిపెట్టి తమ జీవితనావను నాశనం చేసుకున్నారు.

20 అలాంటివారిలో హుమెనేయు, అలెగ్జాండరు అనేవారు ఉన్నారు. వారిని నేను సాతానుకు వదిలేసాను, అప్పుడు వారు దేవుని దూషించకుండ ఉండడం నేర్చుకుంటారు.

తెలుగు సమకాలీన అనువాదము™, క్రొత్త నిబంధన

ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022 Biblica, Inc.

అనుమతితో ఉపయోగించబడినది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.

Telugu Contemporary Version™, New Testament

Copyright © 1976,1990, 2022 by Biblica, Inc.

Used with permission. All rights reserved worldwide.

Biblica, Inc.
Lean sinn:



Sanasan