Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

1 థెస్సలొనీకయులకు 2 - తెలుగు సమకాలీన అనువాదము


థెస్సలొనీకయలో పౌలు పరిచర్య

1 సహోదరీ సహోదరులారా! మేము మీ దగ్గరకు రావడం వృధా కాలేదని మీకు తెలుసు.

2 మీకు తెలిసినట్టే, మేము ఫిలిప్పీలో ముందు శ్రమపడి దౌర్జన్యాన్ని అనుభవించాము కాని మన దేవుని సహాయంతో తీవ్రమైన వ్యతిరేకత ఎదురవుతున్నా ధైర్యంతో ఆయన సువార్తను మీకు అందజేసాం

3 సువార్త విషయమై మిమ్మల్ని ప్రాధేయపడడంలో మాకేమీ తప్పుడు ఉద్దేశాలు లేవు లేదా మేము మిమ్మల్ని మోసం చేయడం లేదు.

4 దానికి బదులు, దేవుడు మాకు ఈ సువార్తను అప్పగించడానికి ఆయనచే యోగ్యులుగా ఎంచబడిన వారిలా మేము బోధిస్తున్నాము. కనుక మేము మనుష్యులను మెప్పించడానికి కాకుండా మన హృదయాలను పరిశీలించే దేవుని మెప్పించడానికి ప్రయత్నిస్తున్నాం.

5 మేము ఎన్నడు ముఖస్తుతి చేయలేదు, మేము అత్యాశను దాచిపెట్టే ముసుగును వేసుకోలేదని మీకు తెలుసు; దాని గురించి దేవుడే మాకు సాక్షి.

6 మేము ప్రజల నుండి లేదా మీ నుండి కానీ ఇతరుల నుండి వచ్చే పొగడ్తల కొరకు ఎదురుచూడడంలేదు, క్రీస్తు యొక్క అపొస్తలులుగా మేము మా అధికారాన్ని ప్రదర్శించి ఉండవచ్చు.

7 కాని, మీ మధ్యలో చిన్నబిడ్డల్లా మృదువుగా ఉన్నాము. పాలిచ్చు తల్లి తన పిల్లలను ప్రేమగా చూసుకొనేలా,

8 మేమైతే మిమ్మల్ని చూసుకున్నాము. మిమ్మల్ని ఎంతో ప్రేమించాము, కాబట్టి మీతో దేవుని సువార్తను పంచుకోవడమే కాకుండా మా జీవితాలను కూడా మీతో పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నాము.

9 సహోదరీ సహోదరులారా! మేము పడ్డ మా ప్రయాసాన్ని మా కష్టాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి, మేము ఎవరికి భారంగా ఉండకూడదని దేవుని సువార్తను మీ మధ్య ప్రకటించినప్పుడు, మేము రాత్రింబవళ్ళు పని చేసి మమ్మల్ని మేము పోషించుకున్నాము.

10 విశ్వాసులైన మీ మధ్య మేము ఎంత భక్తిగా, నీతిగా ఎలాంటి నిందలేనివారిగా ఉన్నామో దానికి మీరే సాక్షులు, అలాగే దేవుడు సాక్షి.

11 తండ్రి తన సొంత పిల్లల పట్ల ఉన్నట్లు మేము మీ పట్ల నడుచుకొన్నామని,

12 మిమ్మల్ని తన రాజ్యంలోనికి, మహిమలోనికి పిలిచే దేవునికి తగినట్లుగా మీరు జీవించాలని మిమ్మల్ని ప్రోత్సహిస్తూ, ఆదరిస్తూ వేడుకొంటున్నాను.

13 అంతేకాక, మేము ప్రకటించిన దేవుని వాక్యాన్ని మీరు గ్రహించినందుకు, మీరు వాటిని మనుష్యుల మాటలుగా కాకుండా అవి నిజంగా దేవుని మాటలు అని, విశ్వసించినవారిలో అవి కార్యరూపం దాల్చుతాయని మీరు అంగీకరించినందుకు మేము దేవునికి మానక కృతఙ్ఞతలు తెలుపుచున్నాం.

14 సహోదరీ సహోదరులారా, మీరు క్రీస్తు యేసులో ఉన్న యూదయలోని దేవుని సంఘాల్లాగా నడుచుకోవడం మొదలుపెట్టారు: యూదుల వలన ఆ సంఘాలు శ్రమపడిన విధంగానే మీరు కూడా మీ సొంత ప్రజల నుండి శ్రమపడ్డారు.

15 వారే ప్రభువైన యేసుక్రీస్తును, ప్రవక్తలను చంపారు మరియు మనల్ని బయటకు తరిమేసారు. వారు దేవునికి కోపం కలిగిస్తారు, అందరితో విరోధంగా ఉంటారు.

16 యూదేతరులకు రక్షణ కలిగించే బోధను మేము అందించకుండా వారు మమ్మల్ని అడ్డగించాలనే ప్రయత్నాలతో వారు తమ పాపాలను అంతులేకుండా పెంచుకుంటున్నారు. కాని దేవుని ఉగ్రత వారి మీదకు రానే వచ్చింది.


థెస్సలొనీయులను చూడాలని పౌలు కోరిక

17 సహోదరీ సహోదరులారా, మీ నుండి కొంత కాలం శరీరరీత్య దూరంగా ఉన్నా, ఆలోచనలో మీకు ఎప్పుడు దగ్గరగానే ఉన్న మాకు గల గొప్ప ఆశను బట్టి మిమ్మల్ని చూడాలని ప్రతి ప్రయత్నం చేసాము.

18 మేము మీ దగ్గరకు రావాలనుకున్నాము, నిజంగా పౌలును నేను అనేకసార్లు రావాలని ప్రయత్నించాను, కానీ సాతాను మమ్మల్ని ఆటంకపరచాడు.

19 మన ప్రభువైన యేసు క్రీస్తు తిరిగి వచ్చినప్పుడు ఆయన యెదుట మా నిరీక్షణ, ఆనందం, మా గౌరవ కిరీటం ఎవరు? అది మీరు కాదా?

20 నిజానికి, మీరే మా గౌరవ కిరీటం, ఆనందమై ఉన్నారు.

తెలుగు సమకాలీన అనువాదము™, క్రొత్త నిబంధన

ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022 Biblica, Inc.

అనుమతితో ఉపయోగించబడినది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.

Telugu Contemporary Version™, New Testament

Copyright © 1976,1990, 2022 by Biblica, Inc.

Used with permission. All rights reserved worldwide.

Biblica, Inc.
Lean sinn:



Sanasan