Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

1 యోహాను 4 - తెలుగు సమకాలీన అనువాదము


మోసపరచు ఆత్మలను తిరస్కరించుట

1 ప్రియ మిత్రులారా, అబద్ధ ప్రవక్తలు చాలామంది లోకంలో బయలుదేరారు, కనుక ప్రతి ఆత్మను నమ్మకుండా, ఆ ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించండి.

2 దేవుని ఆత్మను మనం ఈ విధంగా గుర్తించవచ్చు: యేసు క్రీస్తు మానవ శరీరాన్ని ధరించి వచ్చారని ఒప్పుకొనే ప్రతి ఆత్మ దేవుని నుండి వచ్చిందే.

3 అయితే యేసు దేవుని నుండి వచ్చారని ఒప్పుకొనని ప్రతి ఆత్మ దేవుని నుండి వచ్చింది కాదు. అది క్రీస్తు విరోధి యొక్క ఆత్మ. అది వస్తున్నదని మీరు విన్నారు, కాని ఇప్పటికే అది లోకంలోనికి వచ్చివున్నది.

4 ప్రియ బిడ్డలారా, మీరు దేవునికి చెందినవారు; మీలో ఉన్న వాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు కనుక మీరు వారిని జయించారు.

5 వారు లోకానికి చెందినవారు కనుక లోకరీతిగా మాట్లాడతారు, లోకం వారి మాటలు వింటుంది.

6 కాని మనం దేవునికి చెందినవారము, దేవుని ఎరిగిన ప్రతి ఒకరు మన మాటలు వింటారు. దేవునికి చెందనివారు మన మాటలు వినరు. కనుక సత్యమైన ఆత్మను అబద్ధపు ఆత్మను దీనిని బట్టి మనం గుర్తిస్తాము.


దేవుని ప్రేమ మరియు మన ప్రేమ

7 ప్రియ మిత్రులారా, ప్రేమ దేవుని నుండి వస్తుంది కనుక మనం ఒకరిని ఒకరం ప్రేమించాలి. ప్రేమించేవారు దేవుని మూలంగా పుట్టారు కనుక వారు దేవుణ్ణి ఎరిగినవారు.

8 దేవుడే ప్రేమ, కనుక ప్రేమించనివారు దేవుని తెలుసుకోలేరు.

9 దేవుడు మన మధ్య తన ప్రేమను ఈ విధంగా చూపించారు: ఆయన ద్వారా మనం జీవించగలిగేలా, దేవుడు తన ఏకైక కుమారుని ఈ లోకానికి పంపించారు.

10 ఇదే ప్రేమ: మనం దేవుడిని ప్రేమించామని కాదు, కాని ఆయనే మనలను ప్రేమించి మన పాపాలకు ప్రాయశ్చిత్త బలిగా తన కుమారుని పంపారు.

11 ప్రియ మిత్రులారా, దేవుడు మనలను ఎంతో ప్రేమించారు కనుక మనం కూడా ఒకరిని ఒకరం ప్రేమించాలి.

12 దేవుడిని ఎవరూ ఎన్నడూ చూడలేదు; కాని మనం ఒకరిని ఒకరం ప్రేమిస్తే, దేవుడు మనలో జీవిస్తారు; ఆయన ప్రేమ మనలో పరిపూర్ణం అవుతుంది.

13 మనం ఆయనలో జీవిస్తున్నామని ఆయన మనలో ఉన్నారని మనం దీనిని బట్టి తెలుసుకోవచ్చు: ఆయన తన ఆత్మను మనకు ఇచ్చారు.

14 మరియు లోక రక్షకునిగా దేవుడు తన కుమారుని పంపడం మనం చూశాము సాక్ష్యమిచ్చాము.

15 యేసు దేవుని కుమారుడని ఎవరు ఒప్పుకుంటారో, వారిలో దేవుడు, వారు దేవునిలో జీవిస్తారు.

16 ప్రేమ మనకు తెలుసు మరియు మనం దానిపైన ఆధారపడుతున్నాం. దేవుడే ప్రేమ. ఎవరు ప్రేమ కలిగి జీవిస్తారో, వారు దేవునిలో, దేవుడు వారిలో జీవిస్తారు.

17 తీర్పు రోజున మనం ధైర్యంతో ఉండునట్లు దేవుని ప్రేమ మనలో ఈ విధంగా పరిపూర్ణం చేయబడింది: ఈ లోకంలో మనం యేసు వలె ఉన్నాము.

18 ప్రేమలో భయం ఉండదు. పరిపూర్ణమైన ప్రేమ భయాన్ని తరిమివేస్తుంది, ఎందుకంటే భయం అనేది శిక్షకు సంబంధించింది. కనుక భయపడేవారు ప్రేమలో పరిపూర్ణం కాలేరు.

19 ఆయనే మొదట మనల్ని ప్రేమించారు కనుక మనం ప్రేమిస్తున్నాము.

20 అయితే ఎవరైనా తాను దేవుని ప్రేమిస్తున్నానని చెప్తూ తన సహోదరుని లేదా సహోదరిని ద్వేషించేవారు అబద్ధికులు. తాము చూస్తున్న తన సహోదరుని లేదా సహోదరిని ప్రేమించలేనివారు తాము చూడని దేవుని కూడా ప్రేమించలేరు.

21 కనుక దేవుని ప్రేమించే ప్రతివారు తమ సహోదరుని సహోదరిని కూడ ప్రేమించాలి అనేదే క్రీస్తు మనకు ఇచ్చిన ఆజ్ఞ.

తెలుగు సమకాలీన అనువాదము™, క్రొత్త నిబంధన

ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022 Biblica, Inc.

అనుమతితో ఉపయోగించబడినది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.

Telugu Contemporary Version™, New Testament

Copyright © 1976,1990, 2022 by Biblica, Inc.

Used with permission. All rights reserved worldwide.

Biblica, Inc.
Lean sinn:



Sanasan