1 కొరింథీ 9 - తెలుగు సమకాలీన అనువాదముఅపొస్తలునిగా పౌలుకు గల హక్కులు 1 నేను స్వతంత్రున్ని కానా? నేను అపొస్తలుడను కానా? మన ప్రభువైన యేసును నేను చూడలేదా? ప్రభువులో నేను చేసిన పనికి ఫలితం మీరు కారా? 2 ఇతరులకు నేను అపొస్తలుడను కాకపోయినా, మీకు మాత్రం తప్పక నేను అపొస్తలుడనే! కాబట్టి ప్రభువులో నా అపొస్తలత్వానికి మీరు ముద్రగా ఉన్నారు. 3 నాపై నిందారోపణ చేసేవారికి నేను చెప్పే సమాధానమిదే. 4 తినడానికి త్రాగడానికి మాకు హక్కు లేదా? 5 మిగతా అపొస్తలుల్లా, ప్రభువు యొక్క సహోదరుల్లా, కేఫాలా విశ్వాసురాలైన భార్యను మాతో పాటు తీసుకువెళ్ళడానికి మాకు హక్కు లేదా? 6 లేదా జీవనోపాధి కొరకు పని చేయకుండ ఉండడానికి నాకు బర్నబా మాత్రమే హక్కు లేదా? 7 ఎవరైనా తన సొంత ఖర్చులు పెట్టుకొని సైన్యంలో సేవ చేస్తారా? ద్రాక్షతోట వేసి దాని పండ్లు తిననివారు ఎవరు? మందను పోషిస్తూ వాటి పాలు త్రాగనివారు ఎవరు? 8 ఈ మాటలు కేవలం మానవ అధికారంతో చెప్తున్నానా? ధర్మశాస్త్రం కూడా ఇదే చెప్తున్నది కదా! 9 మోషే ధర్మశాస్త్రంలో ఇలా వ్రాయబడి వుంది: “ఎద్దు ధాన్యాన్ని తొక్కుతున్నప్పుడు మూతి కట్టివేయవద్దు” అని దేవుడు ఎద్దులను గురించి చెప్తున్నాడా? 10 ఖచ్చితంగా ఆయన మన కొరకే ఈ మాట చెప్పలేదా? అవును, ఇది ఖచ్చితంగా మన కొరకే వ్రాయబడింది, ఎందుకంటే పొలాన్ని దున్నేవాడు, త్రొక్కేవాడు పంటలో భాగం పొందాలనే ఆశతో పని చేయాలి. 11 మీ మధ్యలో ఆత్మ సంబంధమైన విత్తనాన్ని మేము నాటితే, మీ నుండి ఈ లోకసంబంధమైన పంటను మేము కోస్తే అది గొప్ప విషయమా? 12 మీ నుండి సహాయం పొందడానికి ఇతరులకు హక్కు ఉంటే, మాకు మరి ఎక్కువ ఉండదా? అయితే, ఈ హక్కును మేము ఉపయోగించుకోలేదు. క్రీస్తు సువార్తకు ఆటంకంగా ఉండకూడదని అన్ని ఇబ్బందులను మేము సహిస్తున్నాం. 13 దేవాలయంలో పని చేసేవారు దేవాలయం నుండే తమ ఆహారాన్ని పొందుతారని, బలిపీఠం దగ్గర సేవ చేసేవారు బలిపీఠంపైన అర్పించిన వాటిలో పాలిభాగస్థులని మీకు తెలియదా? 14 అలాగే, సువార్తను ప్రకటించేవారు సువార్త వల్లనే తమ జీవనోపాధి పొందుకోవాలని ప్రభువు ఆజ్ఞాపించారు. 15 కాని, నేనైతే వీటిలో దేన్ని ఉపయోగించుకోలేదు. నా పట్ల మీరు ఇలా చేయాలని ఈ సంగతులు వ్రాయడం లేదు. ఈ నా అతిశయాన్ని ఎవరైనా తీసివేయడం కంటె నాకు మరణమే మేలు. 16 సువార్త ప్రకటించడం నాకు తప్పనిసరి బాధ్యత కనుక నేను ప్రకటిస్తున్నాను అని నేను గొప్ప చెప్పుకోలేను. అయ్యో, నేను సువార్తను ప్రకటించకపోతే నాకు శ్రమ! 17 నేను ఇష్టపూర్వకంగా ప్రకటిస్తే నాకు బహుమానం దొరుకును. ఒకవేళ ఇష్టపూర్వకంగా చేయకపోతే, నేను కేవలం నాకు నమ్మకంతో అప్పగించబడిన పనిని మాత్రమే పూర్తి చేస్తున్నాను. 18 అప్పుడు నా బహుమానం ఏంటి? సువార్తను ప్రకటించేవానిగా నాకున్న అధికారాన్ని పూర్తిగా ఉపయోగించుకోకుండా సువార్తను ఉచితంగా ప్రకటించడమే నా బహుమానం. పౌలు తన స్వేచ్ఛను ఉపయోగించుకొనుట 19 నేను స్వతంత్రునిగా ఎవరికీ చెందినవాడిగా ఉన్నప్పటికి, సాధ్యమైనంత వరకు ఎక్కువమందిని దేవుని కొరకు సంపాదించడానికి నన్ను నేను ప్రతి ఒక్కరికి దాసునిగా చేసుకున్నాను. 20 యూదులను సంపాదించడానికి, యూదునిలా అయ్యాను. ధర్మశాస్త్రానికి లోబడిన వారిని సంపాదించడానికి నేను ధర్మశాస్త్రానికి లోబడిన వాడిని కాకపోయినా ధర్మశాస్త్రానికి లోబడిన వానిలా అయ్యాను. 21 ధర్మశాస్త్రం లేనివారిని సంపాదించడానికి, నేను ధర్మశాస్త్రం లేనివారిలో ఒక్కడిని అయ్యాను. దేవుని ధర్మశాస్త్రం నుండి విడుదల పొందకపోయిన, నేను క్రీస్తు ధర్మశాస్త్రం క్రింద ఉన్నాను. 22 బలహీనులను సంపాదించడానికి బలహీనులకు బలహీనుడనయ్యాను. అన్ని విధాలుగా కొందరినైనా రక్షించాలని అందరికి అన్ని విధాలుగా ఉన్నాను. 23 సువార్త వల్ల కలిగే ఆశీర్వాదాలలో నేను భాగస్థునిగా ఉండాలని నేను సువార్త కోసమే వీటన్నిటినీ చేశాను. స్వీయ క్రమశిక్షణ యొక్క ఆవశ్యకత 24 పరుగు పందెంలో పాల్గొనే వారందరు పరుగెడతారు కాని, ఒక్కరే బహుమానం పొందుకుంటారని మీకు తెలియదా? బహుమానాన్ని పొందుకొనేలా పరుగెత్తండి. 25 ఆటలలో పాల్గొనే ప్రతివారు కఠినమైన శిక్షణ తీసుకుంటారు. వారు నిత్యం ఉండని కిరీటాన్ని పొందడానికి అంత ప్రయాస పడుతారు, కానీ మనమైతే నిత్యం నిలిచే కిరీటం పొందడం కొరకు ప్రయాస పడుతున్నాము. 26 కాబట్టి, గమ్యంలేని వానిలా నేను పరుగెత్తడం లేదు; గాలిని కొట్టువానిలా నేను పోరాడడంలేదు. 27 అయితే, ఇతరులకు సువార్త ప్రకటించిన తరువాత, బహుమానం పొందే అర్హత నేను కోల్పోకుండా ఉండడానికి, నా శరీరాన్ని నలుగగొట్టి దానిని నాకు లోబరచుకొంటున్నాను. |
తెలుగు సమకాలీన అనువాదము™, క్రొత్త నిబంధన
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022 Biblica, Inc.
అనుమతితో ఉపయోగించబడినది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.
Telugu Contemporary Version™, New Testament
Copyright © 1976,1990, 2022 by Biblica, Inc.
Used with permission. All rights reserved worldwide.
Biblica, Inc.