Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

1 కొరింథీ 8 - తెలుగు సమకాలీన అనువాదము


విగ్రహాలకు అర్పించబడిన ఆహారం

1 విగ్రహాలకు అర్పించబడిన ఆహారాన్ని గురించి: “మనమందరం జ్ఞానం కలిగి ఉన్నాం” అని మనకు తెలుసు. అయితే జ్ఞానం అతిశయపడేలా చేస్తుంది కాని, ప్రేమ అభివృద్ధి కలుగజేస్తుంది.

2 ఒకరు తమకు ఏమైనా తెలుసు అనుకుంటే, వారు తెలుసుకోవలసినంతగా తెలుసుకోలేదు అని అర్థం.

3 అయితే దేవుని ప్రేమించేవారిని దేవుడు గుర్తిస్తాడు.

4 అందుకే, విగ్రహాలకు అర్పించిన వాటిని తినే విషయంలో: “లోకంలో ఒక విగ్రహం ఏ విలువ లేనిది” మరియు “ఒకే ఒక్క దేవుడు తప్ప వేరొక దేవుడు లేడు” అని మనకు తెలుసు.

5 ఆకాశంలో కాని భూమి మీద కాని దైవాలు ప్రభువులు అని పిలువబడే వారు అనేకమంది ఉన్నా,

6 కానీ మనకైతే ఒక్కడే తండ్రియైన దేవుడు ఉన్నాడు. ఆయన ద్వారానే అన్ని కలిగాయి, ఆయన కోసమే మనం జీవిస్తున్నాం; అలాగే మనకు యేసు క్రీస్తు ప్రభువు ఒక్కడే, ఆయన ద్వారానే అన్ని కలిగాయి, ఆయన ద్వారానే మనం జీవిస్తున్నాం.

7 అయితే ఈ జ్ఞానం అందరికీ లేదు. కొందరు ఇప్పటికీ విగ్రహాలను ఆరాధించే వారు బలి అర్పించిన ఆహారాన్ని తిన్నప్పుడు తాము ఒక దేవతకు అర్పించింది తింటున్నామని భావిస్తున్నారు. అలా వారి మనస్సాక్షి బలహీనంగా ఉన్నందుకు అది అపవిత్రమవుతుంది.

8 అయితే ఆహారం మనల్ని దేవునికి దగ్గరగా తీసుకురాదు; తినకపోతే మనకు నష్టంలేదు, తినడం వలన మనకు లాభం లేదు.

9 అయినాసరే మీ స్వాతంత్ర్యాన్ని ఉపయోగించుకోవడం బలహీనులకు ఆటంకంగా ఉండకుండా చూసుకోండి.

10 ఎందుకంటే మీకున్న జ్ఞానంతో విగ్రహ ఆలయంలో నీవు తినడం బలహీనమైన మనస్సాక్షిగలవారు చూస్తే, వారు విగ్రహాలను అర్పించిన వాటిని తినడానికి ధైర్యం తెచ్చుకొంటారు గదా?

11 అందువల్ల ఎవరి కొరకు క్రీస్తు చనిపోయెనో ఆ బలహీనులైన ఆ సహోదరీ సహోదరులు నీ జ్ఞానాన్ని బట్టి నశిస్తారు.

12 ఇలా వారికి విరోధంగా పాపం చేసి వారి బలహీనమైన మనస్సాక్షిని నొప్పించినందుకు మీరు క్రీస్తుకు వ్యతిరేకంగా పాపం చేస్తున్నారు.

13 కనుక నేను తిన్నదే నా సహోదరీ సహోదరులు పాపంలో పడడానికి ఒకవేళ కారణమైతే, వారు పాపంలో పడడానికి నేను కారణం కాకూడదని నేను మళ్ళీ ఎప్పుడు అలాంటి ఆహారాన్ని తినను.

తెలుగు సమకాలీన అనువాదము™, క్రొత్త నిబంధన

ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022 Biblica, Inc.

అనుమతితో ఉపయోగించబడినది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.

Telugu Contemporary Version™, New Testament

Copyright © 1976,1990, 2022 by Biblica, Inc.

Used with permission. All rights reserved worldwide.

Biblica, Inc.
Lean sinn:



Sanasan