Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

1 కొరింథీ 6 - తెలుగు సమకాలీన అనువాదము


విశ్వాసుల మధ్యలోని తగాదాలు

1 మీలో ఒకరితో ఒకరికి తగాదాలు ఉన్నప్పుడు, ప్రభువును నమ్మిన ప్రజలముందుకు వెళ్లడానికి బదులు భక్తిహీనులైనవారి ముందుకు న్యాయం కొరకు దాన్ని తీసుకువెళ్తారా?

2 లేదా ప్రభువును నమ్మిన ప్రజలే ఈ లోకానికి న్యాయం తీర్చుతారని మీకు తెలియదా? మీరు లోకానికి తీర్పు తీర్చేవారైతే, మీలో ఉన్న అతి చిన్న తగాదాలను తీర్చుకోలేరా?

3 మనం దేవదూతలకు తీర్పు తీరుస్తామని మీకు తెలియదా? అలాంటప్పుడు ఈ లోకసంబంధమైన విషయాలను గురించి మరి బాగా తీర్పు తీర్చవచ్చు గదా!

4 కాబట్టి ఒకవేళ మీకు ఇలాంటి విషయాలలో తగాదాలు ఉంటే, సంఘంలో తిరస్కరించే జీవిత విధానాన్ని కలిగినవారిని వాటిని పరిష్కరించమని అడుగుతారా?

5 మీరు సిగ్గుపడాలని ఇలా చెప్తున్నాను. విశ్వాసుల మధ్య గల తగాదాలు తీర్చగల జ్ఞానవంతులు మీలో ఎవరు లేరా?

6 అలా కాకుండా, ఒక సోదరుడు మరొక సోదరున్ని న్యాయస్ధానానికి తీసుకువెళ్తున్నాడు, అది కూడా అవిశ్వాసుల ముందు!

7 నిజానికి, మీ మధ్యలో తగాదాలు ఉన్నాయంటే మీరు ముందే పూర్తిగా ఓడిపోయారు. కనుక, మీరు దోషులుగా లేదా మోసపోయిన వారిగానే ఉండవచ్చు కాదా?

8 దాని బదులు, మీరే మోసం చేస్తున్నారు, తప్పు చేస్తున్నారు, మీ సహోదర సహోదరీలకు కూడా అలాగే చేస్తున్నారు.

9 తప్పు చేసినవారు దేవుని రాజ్యానికి వారసులు కారని మీకు తెలియదా? మోసపోకండి: లైంగిక దుర్నీతైనా, విగ్రహారాధికులైనా, వ్యభిచారులైనా, పురుషులతో లైంగిక సంబంధాలు పెట్టుకొనే పురుషులైనా,

10 దొంగలైనా, అత్యాశపరులైనా, త్రాగుబోతులైనా, దూషకులైనా, మోసగించేవారైనా దేవుని రాజ్యానికి వారసులు కాలేరు.

11 మీరు విమోచింపబడక ముందు మీలో కొందరు అలాంటి వారిగా ఉన్నారు. అయితే ప్రభువైన యేసు క్రీస్తు నామంలో, మన దేవుని ఆత్మలో మీరు కడుగబడి పవిత్ర పరచబడి, నీతిమంతులుగా తీర్చబడ్డారు.


లైంగిక దుర్నీతి

12 “ఏది చేయడానికైనా నాకు స్వాతంత్ర్యం ఉందని” మీరు అనుకోవచ్చు కాని, అన్ని లాభకరమైనవి కావు. “ఏది చేయడానికైనా నాకు స్వాతంత్ర్యం ఉంది” కాని, నన్ను దేనిని లోపరచుకోనివ్వను.

13 “ఆహారం కడుపు కొరకు, కడుపు ఆహారం కొరకు నియమించబడ్డాయని మీరు చెప్తారు, కానీ దేవుడు రెండింటిని నాశనం చేస్తాడు.” మీ శరీరాన్ని లైంగిక దుర్నీతి కొరకు కాదు గాని ప్రభువు కొరకే, ప్రభువు శరీరం కొరకే.

14 దేవుడు తన శక్తి వలన ప్రభువును మరణం నుండి సజీవంగా లేపాడు. కనుక ఆయన మనల్ని కూడ అలాగే సజీవంగా లేపుతాడు.

15 మీ శరీరాలు క్రీస్తు అవయవాలై ఉన్నాయని మీకు తెలియదా? అయితే నేను క్రీస్తు అవయవాలను తీసికొని వేశ్య అవయవాలుగా చేస్తానా? అలా ఎన్నడు జరుగకూడదు.

16 వేశ్యతో తనను తాను ఐక్యపరచుకొనేవాడు ఆమెతో ఏక శరీరమై ఉన్నాడని మీకు తెలియదా? వాక్యంలో, “వారిద్దరు ఏక శరీరమై ఉంటారు” అని వ్రాయబడి ఉంది కదా!

17 అయితే ప్రభువుతో ఏకమైన వారు ఆత్మలో ఆయనతో ఒక్కటై ఉంటారు.

18 లైంగిక దుర్నీతి నుండి దూరంగా పారిపోండి. మానవుడు చేసే ఇతర పాపాలన్ని శరీరానికి బయట చేసేవే, కానీ లైంగిక పాపం చేసేవాడు తన సొంత శరీరానికి వ్యతిరేకంగా పాపం చేస్తున్నాడు.

19 మీ శరీరాన్ని దేవుడే ఇచ్చాడు. మీలో ఉన్న పరిశుద్ధాత్మకు శరీరం ఆలయమై ఉందని మీకు తెలియదా? మీరు మీ సొంతం కాదు,

20 మీరు వెలపెట్టి కొనబడ్డారు. కనుక మీ శరీరాలతో దేవుని మహిమపరచండి.

తెలుగు సమకాలీన అనువాదము™, క్రొత్త నిబంధన

ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022 Biblica, Inc.

అనుమతితో ఉపయోగించబడినది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.

Telugu Contemporary Version™, New Testament

Copyright © 1976,1990, 2022 by Biblica, Inc.

Used with permission. All rights reserved worldwide.

Biblica, Inc.
Lean sinn:



Sanasan