Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

1 కొరింథీ 3 - తెలుగు సమకాలీన అనువాదము


సంఘం మరియు దాని నాయకులు

1 సహోదరీ సహోదరులారా, ఆత్మ చేత నడిపించబడేవారితో మాట్లాడినట్లు మీతో నేను మాట్లాడలేను, ఎందుకంటే మీరు ఇంకా ఈ లోక సంబంధులుగానే జీవిస్తూ క్రీస్తులో పసిబిడ్డలుగానే ఉన్నారు.

2 మీరు బలమైన ఆహారాన్ని తినడానికి సిద్ధంగా లేరు, కనుక నేను మీకు పాలు ఇచ్చాను. ఇప్పుడు కూడా మీరు సిద్ధంగా లేరు.

3 మీరు ఇంకా లోకస్థులుగానే ఉన్నారు. మీలో అసూయ, కొట్లాటలు ఉన్నాయి కనుక మీరు శరీర స్వభావంతో సాధారణ మానవుల్లా జీవించడంలేదా?

4 మీలో ఒకడు, “నేను పౌలును అనుసరిస్తున్నాను” అని, ఇంకొకడు, “నేను అపొల్లోను అనుసరిస్తున్నాను” అని చెప్పుకొంటూ ఉన్నప్పుడు మీరు సాధారణ మానవుల్లా లేరా?

5 అపొల్లో ఎవరు? పౌలు ఎవరు? కేవలం సేవకులే! ఒక్కొక్కరికి ప్రభువు నియమించిన దాని ప్రకారం, వారి ద్వారా మీరు విశ్వాసంలోనికి వచ్చారు.

6 నేను విత్తనం నాటాను, అపొల్లో దానికి నీళ్ళు పోసాడు, అయితే వృద్ధి కలుగచేసింది దేవుడే.

7 కాబట్టి నాటేవారిలో కానీ, నీళ్ళు పోసేవారిలో కానీ గొప్పతనం ఏమి లేదు, కానీ దేవుడే దానిని వృద్ధి చేయగలరు.

8 నాటేవారు, నీళ్ళు పోసేవారు ఒకే ఉద్దేశం కలిగి ఉన్నారు. ప్రతి ఒక్కరు తాను చేసిన కష్టానికి తగిన ప్రతిఫలాన్ని పొందుతారు.

9 కనుక మేము దేవుని సేవలో జతపనివారము: మీరు దేవుని పొలంగా దేవుని కట్టడంలా ఉన్నారు.

10 దేవుడు నాకు అనుగ్రహించిన కృపను బట్టి నేను తెలివైన నిర్మాణకునిగా పునాది వేసాను, అలాగే మరొకరు దాని మీద కడుతున్నారు. అందుకే ప్రతీ ఒక్కరు జాగ్రత్తగా కట్టాలి.

11 ఎందుకంటే వేయబడిన పునాది యేసు క్రీస్తే, వేసిన పునాది కాకుండా మరొక పునాదిని ఎవరూ వేయలేరు.

12 ఎవరైనా ఈ పునాది మీద బంగారం, వెండి, వెలగల రాళ్ళు, చెక్క, ఎండుగడ్డి లేదా గడ్డి లాంటి వస్తువులతో కడితే,

13 ఆ న్యాయదినాన వారు చేసిన పని వెలుగులో స్పష్టం చేయబడుతుంది. అది అగ్ని చేత నిరూపించబడుతుంది, ప్రతి ఒక్కరి పనిలోని నాణ్యత అగ్ని చేత పరీక్షించబడుతుంది.

14 పునాది మీద కట్టిన పని ఎవరిది నిలుస్తుందో, వారు జీతాన్ని పొందుతారు.

15 అది కాల్చి వేయబడితే దానిని కట్టిన వారికి నష్టం కలుగుతుంది కానీ వారు తప్పించుకుంటారు. అయితే అది కేవలం మంటల్లో నుండి తప్పించుకొన్నట్లుగా ఉంటారు.

16 మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసిస్తుందని మీకు తెలియదా?

17 ఎవరైనా దేవుని ఆలయాన్ని పాడు చేస్తే, దేవుడు వారిని పాడు చేస్తాడు. ఎందుకంటే దేవుని ఆలయం పరిశుద్ధమైనది. మీరందరు కలిసి ఆ ఆలయమై ఉన్నారు.

18 మిమ్మల్ని మీరు మోసగించుకోకండి. ఈ లోకరీతిగా, మీలో ఎవరైనా నేను జ్ఞానినని అనుకొంటే, వారు జ్ఞాని అవ్వడానికి “బుద్ధిలేనివారిగా” కావాలి.

19 ఎందుకంటే ఈ లోక జ్ఞానం దేవుని దృష్టిలో వెర్రితనము. లేఖనాలలో: “జ్ఞానులను వారి కుయుక్తిలో ఆయన పట్టుకొంటాడు” అని వ్రాయబడి ఉంది.

20 లేఖనాలలో ఇంకొక చోట: “జ్ఞానుల ఆలోచనలు వ్యర్థమైనవని దేవునికి తెలుసు” అని వ్రాయబడి ఉంది.

21 కనుక ఎవరు మానవ నాయకులను బట్టి గర్వింప కూడదు. అన్ని మీకు చెందినవే,

22 పౌలు అయినా, అపొల్లో అయినా, కేఫా అయినా, లోకమైనా, జీవమైనా, మరణమైనా, ఇప్పుడు ఉన్న వాటిలోనైనా, రాబోయే వాటిలోనైనా అన్ని మీకు చెందినవే.

23 మీరు క్రీస్తుకు చెందినవారు, క్రీస్తు దేవునికి చెందినవారు.

తెలుగు సమకాలీన అనువాదము™, క్రొత్త నిబంధన

ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022 Biblica, Inc.

అనుమతితో ఉపయోగించబడినది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.

Telugu Contemporary Version™, New Testament

Copyright © 1976,1990, 2022 by Biblica, Inc.

Used with permission. All rights reserved worldwide.

Biblica, Inc.
Lean sinn:



Sanasan