1 కొరింథీ 13 - తెలుగు సమకాలీన అనువాదము1 మానవుల లేదా దేవదూతల భాషలు నేను మాట్లాడగలిగినా, నాకు ప్రేమ లేకపోతే, నేను కేవలం మ్రోగే గంట లేక గణగణలాడే కంచుతాళంలా ఉంటాను. 2 నేను ప్రవచన వరాన్ని కలిగినా, అన్ని రహస్యాలను అర్థం చేసికోగలిగినా, సమస్త జ్ఞానం కలిగివున్నా, పర్వతాలను కూడా కదిలించగల గొప్ప విశ్వాసాన్ని కలిగివున్నా, నాలో ప్రేమ లేకపోతే నేను వ్యర్థమే. 3 నాకున్న సంపాదన అంతా పేదలకు ఇచ్చివేసి, మెప్పు కొరకు నా శరీరాన్ని కష్టానికి అప్పగించినా నాలో ప్రేమ లేకపోతే నాకు ప్రయోజనం ఏమి లేదు. 4 ప్రేమే సహనం, ప్రేమే దయ, అది అసూయ లేనిది, అది హెచ్చించుకోదు, గర్వం లేనిది. 5 అది ఇతరులను అగౌరపరచదు, స్వార్ధం లేనిది, త్వరగా కోపపడదు, ప్రేమ తప్పులను జ్ఞాపకం ఉంచుకోదు. 6 ప్రేమ చెడుతనంలో ఆనందించదు కాని సత్యంలో అది ఆనందిస్తుంది. 7 అది ఎల్లప్పుడు కాపాడుతుంది, ఎల్లప్పుడు నమ్ముతుంది, ఎల్లప్పుడు నిరీక్షిస్తుంది, ఎల్లప్పుడు సహిస్తుంది. 8 ప్రేమ ఎప్పుడు విఫలం కాదు. అయితే ప్రవచనాలు ఆగిపోతాయి, భాషలైనా నిలిచిపోతాయి, జ్ఞానం గతించిపోతుంది. 9 ఎందుకంటే మనకు తెలిసింది అసంపూర్ణమే, మనం ప్రవచించేది అసంపూర్ణమే. 10 కాని సంపూర్ణమయింది వచ్చినప్పుడు అసంపూర్ణమైనవి గతించిపోతాయి. 11 నేను చిన్నబిడ్డగా ఉన్నపుడు చిన్నబిడ్డగా మాట్లాడాను, చిన్నబిడ్డగా తలంచాను, చిన్నబిడ్డగా ఆలోచించాను, కాని నేను పెద్దవాడిని అయినప్పుడు బాల్యపు పద్ధతులు వదిలేసాను. 12 ఇప్పుడు మనం చూస్తున్నది కేవలం అద్దంలో కనబడే ప్రతిబింబమే; కాని తరువాత ముఖాముఖిగా చూస్తాం. ఇప్పుడు నాకు తెలిసింది కొంతమాత్రమే, తరువాత నేను పూర్తిగా తెలుసుకోబడిన ప్రకారం నేను పూర్తిగా తెలుసుకుంటాను. 13 విశ్వాసం, నిరీక్షణ, ప్రేమ అనే ఈ మూడు నిలిచివుంటాయి. వీటిలో శ్రేష్ఠమైనది ప్రేమే. |
తెలుగు సమకాలీన అనువాదము™, క్రొత్త నిబంధన
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022 Biblica, Inc.
అనుమతితో ఉపయోగించబడినది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.
Telugu Contemporary Version™, New Testament
Copyright © 1976,1990, 2022 by Biblica, Inc.
Used with permission. All rights reserved worldwide.
Biblica, Inc.