Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

జెకర్యా 10 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం


యెహోవా యూదాను సంరక్షిస్తారు

1 వసంతకాలంలో వర్షం కోసం యెహోవాను అడగండి; ఉరుములతో ఉన్న తుఫానును పంపేది యెహోవాయే. అందరి పొలానికి మొక్కలు పెరిగేలా, ఆయన ప్రజలందరికి వర్షాన్ని కురిపిస్తారు.

2 గృహదేవతలు మోసపు మాటలు మాట్లాడతాయి, సోదె చెప్పేవారు అబద్ధపు దర్శనాలు చూస్తారు; వారు మోసంతో కలల భావాలు చెప్తారు, వ్యర్థమైన ఓదార్పు ఇస్తారు. కాబట్టి కాపరి లేకపోవడం వలన బాధించబడిన గొర్రెలు తిరిగినట్లు ప్రజలు తిరుగుతారు.

3 “కాపరుల మీద నా కోపం రగులుకుంది, నేను నాయకులను శిక్షిస్తాను; సైన్యాల యెహోవా తన మందయైన యూదా ప్రజల మీద శ్రద్ధ చూపుతారు ఆయన వారిని గర్వించే యుద్ధ గుర్రాల్లా చేస్తారు.

4 యూదా నుండి మూలరాయి వస్తుంది, అతని నుండి డేరా మేకు, అతని నుండి యుద్ధ విల్లు వస్తాయి, అతని నుండి ప్రతి పాలకుడు వస్తాడు.

5 వారందరు కలిసి యుద్ధంలోని వీరుల్లా వీధుల బురదలో తమ శత్రువులను త్రొక్కుతారు. యెహోవా వారికి తోడుగా ఉన్నారు కాబట్టి వారు పోరాడతారు, శత్రువుల గుర్రపురౌతులను సిగ్గుపడేలా చేస్తారు.

6 “నేను యూదాను బలపరుస్తాను యోసేపు గోత్రాలను రక్షిస్తాను. వారి పట్ల నాకు దయ ఉంది కాబట్టి, నేను వారిని తిరిగి రప్పిస్తాను. నేను వారిని విడిచిపెట్టిన సంగతిని వారు మరిచిపోతారు, ఎందుకంటే నేను వారి దేవుడనైన యెహోవాను, నేను వారికి జవాబిస్తాను.

7 ఎఫ్రాయిమువారు వీరుల్లా అవుతారు, ద్రాక్షరసం త్రాగినట్లుగా వారి హృదయాలు సంతోషిస్తాయి. వారి పిల్లలు అది చూసి సంతోషిస్తారు; యెహోవాను బట్టి వారి హృదయాలు ఆనందిస్తాయి.

8 నేను వారికి ఈలవేసి పిలిచి వారిని సమకూరుస్తాను. ఖచ్చితంగా నేను వారిని విమోచిస్తాను; వారు మునుపటిలా అనేకులుగా ఉంటారు.

9 నేను వారిని ఇతర ప్రజల మధ్యలోనికి చెదరగొట్టినా దూరదేశాలలో వారు నన్ను జ్ఞాపకం చేసుకొంటారు. వారు వారి సంతానం సజీవులుగా తిరిగి వస్తారు.

10 నేను వారిని ఈజిప్టు నుండి తిరిగి తీసుకువస్తాను అష్షూరు దేశం నుండి సమకూరుస్తాను. నేను వారిని గిలాదు, లెబానోను దేశాలకు తీసుకువస్తాను అక్కడ ఉన్న స్థలం వారికి సరిపోదు.

11 వారు దుఃఖ సముద్రాన్ని దాటుతారు; సముద్రపు అలలు అణచివేయబడతాయి నైలు నదిలోని లోతైన స్థలాలన్నీ ఎండిపోతాయి. అష్షూరు యొక్క గర్వం అణచివేయబడుతుంది, ఈజిప్టు రాజదండం తీసివేయబడుతుంది.

12 నేను వారిని యెహోవాలో బలపరుస్తాను. ఆయన నామం బట్టి వారు క్షేమంగా జీవిస్తారు,” అని యెహోవా చెప్తున్నారు.

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం™

ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

Biblica® Open Telugu Contemporary Version™

Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

Biblica, Inc.
Lean sinn:



Sanasan