Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

తీతుకు 1 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

1 దేవుని దాసుడును యేసు క్రీస్తు యొక్క అపొస్తలుడనైన పౌలు అనే నేను దేవుడు ఏర్పరచుకున్నవారికి విశ్వాసాన్ని ప్రకటించడానికి, దైవిక జీవితాలను ఎలా జీవించాలో వారికి చూపించే సత్యాన్ని తెలుసుకోవడం నేర్పడానికి,

2 ఈ సత్యం వారికి అబద్ధమాడని దేవుడు యుగయుగాలకు ముందే వాగ్దానం చేసిన నిత్యజీవాన్ని గురించిన నిరీక్షణతో,

3 ఆ నిత్యజీవం గురించి అబద్ధమాడని దేవుడు సృష్టి ఆరంభానికి ముందే వాగ్దానం చేశాడు.

4 విశ్వాస విషయంలో నా నిజమైన కుమారుడు, తీతుకు: మన తండ్రియైన దేవుని నుండి, రక్షకుడైన క్రీస్తు యేసు నుండి కృపా సమాధానాలు కలుగును గాక.


మంచిని ప్రేమించేవారిని సంఘపెద్దలుగా నియమించుట

5 నేను నిన్ను క్రేతులో విడిచిపెట్టడానికి కారణం ఏంటంటే, నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారం, ఇంకా పూర్తి చేయవలసిన వాటిని క్రమపరచి, ప్రతి పట్టణంలో సంఘ పెద్దలను నియమించు.

6 ఒక సంఘపెద్ద నిందారహితునిగా, తన భార్యకు నమ్మకమైనవానిగా ఉండాలి, అతని పిల్లలు విశ్వాసం కలవారిగా ఉండి, దుష్టమైన పనులు చేశారని అవిధేయులు అనే నిందలేనివారిగా ఉండాలి.

7 సంఘపెద్ద దేవుని కుటుంబాన్ని నడిపిస్తాడు కాబట్టి, అతడు నిందారహితునిగా ఉండాలి, అయితే అహంకారిగా, త్వరగా కోప్పడేవానిగా, త్రాగుబోతుగా, దౌర్జన్యం చేసేవానిగా, అక్రమ సంపాదన ఆశించేవానిగా ఉండకూడదు.

8 దానికి బదులు, అతడు ఆతిథ్యాన్ని ఇచ్చేవానిగా, మంచిని ప్రేమించేవానిగా, స్వీయ నియంత్రణ కలవానిగా, నీతిమంతునిగా, పరిశుద్ధునిగా, క్రమశిక్షణ కలవాడై ఉండాలి.

9 బోధించబడిన రీతిలో ఈ నమ్మకమైన వాక్యాన్ని అతడు గట్టిగా పట్టుకోవాలి. అప్పుడు అతడు తాను నేర్చుకున్న సత్య బోధతో ఇతరులను ప్రోత్సాహించి దానిని వ్యతిరేకించే వారిని ఖండించగలడు.


మంచి చేయడంలో విఫలమైన వారిని గద్దించుట

10 ఎందుకంటే మీలో అనేకమంది, ముఖ్యంగా సున్నతి పొందినవారిలో కొందరు, తిరుగుబాటు స్వభావం కలిగి, అర్థంలేని మాటలు మాట్లాడేవారిగా, మోసగించేవారిగా ఉన్నారు.

11 వారి నోళ్ళు ఖచ్చితంగా మూయించాలి, ఎందుకంటే వారు తమ అవినీతి సంపాదన కోసం బోధించకూడని తప్పుడు బోధలు చేస్తూ, కుటుంబాలన్నిటిని చెడగొడుతున్నారు.

12 క్రేతు ప్రవక్తల్లో ఒకడు తన సొంత ప్రజల గురించి చెప్తూ, “క్రేతు దేశస్థులు ఎప్పుడు అబద్ధికులుగా, క్రూరులుగా, సోమరులుగా, తిండిబోతులుగా ఉన్నారు” అన్నాడు.

13 వారి గురించి అతడు చెప్పింది సత్యమే. కాబట్టి విశ్వాసంలో స్థిరంగా ఉండేలా,

14 యూదుల కట్టుకథలను లేదా సత్యాన్ని తిరస్కరించిన మనుష్యుల ఆజ్ఞలను లక్ష్యపెట్టకుండా నీవు వారిని తీవ్రంగా గద్దించు.

15 ఎందుకంటే, పవిత్రులకు అన్ని పవిత్రంగానే ఉంటాయి కాని, నమ్మనివారికి, చెడిపోయినవారికి ఏది పవిత్రంగా ఉండదు. నిజానికి అలాంటివారి మనస్సులు, మనస్సాక్షి కూడా చెడిపోయాయి.

16 వారు దేవుని నమ్ముతున్నామని చెప్తున్నప్పటికి, తమ పనుల ద్వారా ఆయనను తిరస్కరిస్తారు. వారు హేయమైనవారు, అవిధేయులు, ఏ మంచిని చేయడానికైనా అనర్హులు.

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం™

ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

Biblica® Open Telugu Contemporary Version™

Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

Biblica, Inc.
Lean sinn:



Sanasan