Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

పరమగీతము 5 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం


యువకుడు

1 నా సోదరీ, నా వధువు, నా ఉద్యాన వనానికి వచ్చేశాను; నా పరిమళాలతో పాటు నా గోపరసాన్ని సేకరించుకున్నాను. నేను తేనెతెట్టె తేనె తిన్నాను; నేను నా ద్రాక్షరసం, నా పాలు త్రాగాను. స్నేహితులారా, తినండి త్రాగండి; ప్రేమికులారా! తృప్తిగా సేవించండి.


చెలికత్తెలు యువతి

2 నేను నిద్ర పోతున్నానన్న మాటే గాని, నా హృదయం మేలుకొని ఉంది. వినండి! నా ప్రియుడు తలుపు తడుతూ: “తలుపు తియ్యి, నా సోదరీ, నా ప్రియురాలా! నా పావురమా, నిష్కళంకురాలా. నా తల మంచుకు తడిసింది, రాత్రి తేమకు నా వెంట్రుకలన్నీ తడిసిపోయాయి.”

3 నేను నా వస్త్రాన్ని తీసివేశాను దాన్ని మళ్ళీ ధరించాలా? నేను నా కాళ్లు కడుక్కున్నాను మళ్ళీ వాటిని మురికి చేసుకోవాలా?

4 నా ప్రియుడు తలుపు సందులో చేయి పెట్టంగానే; నా గుండె అతని కోసం కొట్టుకోవడం ప్రారంభించింది.

5 నా ప్రియునికి తలుపు తీద్దామని లేచాను. నా చేతులు బోళముతో తడిసి, నా వ్రేళ్ళ నుండి బోళం, తలుపు గడియ మీదికి స్రవించింది.

6 నా ప్రియుడికి, నేను తలుపు తీసేలోగా, ఆయన వెళ్లిపోయాడు. నా ప్రాణం స్పృహ తప్పింది. నేను ఆయన కోసం వెదికాను కాని ఆయన కనబడలేదు. నేను ఆయనను పిలిచాను కాని ఆయన పలుకలేదు.

7 పట్టణంలో గస్తీ తిరిగేవారు నాకెదురై వారు నన్ను కొట్టి, గాయపరిచారు; నా ముసుగును తొలగించారు, వారు ప్రాకారం మీద కావలివారు.

8 యెరూషలేము కుమార్తెలారా, నా ప్రియుడు మీకు కనిపిస్తే, ఆయనకు మీరు ఏమి చెప్తారు? ప్రేమను బట్టి నాకు స్పృహ తప్పిందని చెప్తామని ప్రమాణం చేయండి.


చెలికత్తెలు

9 స్త్రీలలో అత్యంత అందమైనదానా, ఇతరులకంటే నీ ప్రియుడి విశిష్టత యేమి? ఇంతగా మాచేత ప్రమాణం చేయించుకున్నావు, ఇంతకు నీ ప్రియుడి విశేషమేమి?


యువతి

10 నా ప్రియుడు ప్రకాశమానమైన వాడు ఎర్రని వాడు, పదివేలమంది కన్న గొప్పవాడు.

11 ఆయన తల మేలిమి బంగారం; ఆయనది ఉంగరాల జుట్టు, కాకి నలుపంత నల్లగా ఉన్నాయి.

12 ఆయన నేత్రాలు నదీ తీరాన ఎగిరే గువ్వల్లాంటివి, అవి పాలలో స్నానమాడినట్లున్నాయి, ఆభరణాల్లా చెక్కబడ్డాయి.

13 ఆయన చెక్కిళ్ళు సువాసన ఇచ్చే పరిమళ పడకల్లాంటివి, ఆయన పెదవులు తామరలాంటివి వాటిలో నుండి బోళం స్రవిస్తుంది.

14 ఆయన చేతులు గోమేధికం పొదిగిన బంగారు కడ్డీలు, ఆయన ఉదరం నీలమణి, వైడూర్యం పొదిగిన దంత కళాఖండము.

15 ఆయన కాళ్లు మేలిమి బంగారు దిమ్మల మీద నిలిపిన పాలరాతి స్తంభాలు. ఆయన రూపం లెబానోనులా, దాని దేవదారు వృక్షాలలా ఉంది.

16 ఆయన నోరు అతిమధురం; ఆయన మనోహరము. యెరూషలేము కుమార్తెలారా! ఈయనే నా ప్రియుడు, నా స్నేహితుడు.

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం™

ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

Biblica® Open Telugu Contemporary Version™

Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

Biblica, Inc.
Lean sinn:



Sanasan