పరమగీతము 4 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదంయువకుడు 1 నా ప్రియురాలా, నీవు ఎంత అందంగా ఉన్నావు! ఓ, ఎంత అందం! మీ ముసుగు వెనుక మీ కళ్లు గువ్వల్లా ఉన్నాయి. నీ శిరోజాలు గిలాదు పర్వతం మీది నుండి దిగివొచ్చే మేకల మందల్లా కనిపిస్తున్నాయి. 2 నీ పళ్ళు అప్పుడే కత్తెర వేయబడి, కడుగబడి పైకి వస్తున్న గొర్రె మందలా ఉన్నాయి. ప్రతిదీ జంటగా ఉన్నాయి, వాటిలో ఒక్కటి కూడా ఒంటరిగా లేదు. 3 నీ పెదవులు ఎర్ర త్రాడులా ఉన్నాయి; నీ నోరు మనోహరము. నీ ముసుగు వెనుక ఉన్న నీ చెక్కిళ్ళు, సగం దానిమ్మ పండులా ఉన్నాయి. 4 నీ మెడ అందంగా నిర్మించబడిన దావీదు గోపురంలా ఉన్నది; దాని మీద వేయి డాళ్లు వ్రేలాడుతున్నాయి; అవన్నీ శూరుల డాళ్లు. 5 నీ స్తనములు రెండు జింక పిల్లల్లా ఉన్నాయి, తామర పువ్వుల మధ్య మేసే దుప్పి కవల పిల్లల్లా ఉన్నాయి. 6 తెల్లవారుజాము రాకముందు నీడలు పారిపోకముందు, నేను బోళం కొండకు బోళం పర్వతానికి వెళ్తాను. 7 నా ప్రియురాలా, నీవు అధిక మనోహరం; నీలో ఏ కంళంకమూ లేదు. 8 నా వధువు, లెబానోను నుండి నాతో రా, లెబానోను నుండి నాతో రా. అమాన పర్వత శిఖరం నుండి, శెనీరు, హెర్మోను శిఖరాల నుంచీ, సింహాల బోనుల నుండి, చిరుత పులులు సంచరించే కొండల నుండి దిగిరా. 9 నా సోదరీ, నా వధువా, నీవు నా హృదయం దొంగిలించావు; నీ ఒక్క చూపుతో, నీ హారంలోని ఒక్క ఆభరణంతో నీవు నా హృదయాన్ని దొంగిలించావు. 10 నా సోదరీ, నా వధువా, నీ ప్రేమ ఎంత ఆహ్లాదకరం! ద్రాక్షరసం కంటే నీ ప్రేమ ఆనందమయం, నీవు పూసుకున్న పరిమళ తైల సువాసన సుగంధ ద్రవ్యాలన్నిటినీ మించింది! 11 నా వధువు! నీ పెదవులు తేనెతెట్టెలా మాధుర్యాన్ని వదులుతున్నాయి; నీ నాలుక క్రింద పాలు తేనె ఉన్నాయి. నీ వస్త్ర సువాసన లెబానోను సువాసనగా ఉంది. 12 నా సోదరీ, నా వధువు! నీవు మూసివేయబడిన తోటవు నీవు చుట్టబడిన ఊటవు, మూయబడిన సరస్సువు. 13 నీ మొక్కలు ఒక దానిమ్మతోట కోరుకున్న ఫలములతో, గోరింట జటామాంసి చెట్లతో, 14 జటామాంసి కుంకుమ పువ్వు, వోమ దాల్చిన చెక్క, ప్రతి విధమైన పరిమళ చెట్టుతో, బోళం కలబంద, అన్ని సుగంధద్రవ్యాలు. 15 నీవు ఉద్యానవనంలోని జలాశయానివి, లెబానోను నుండి దిగువకు ప్రవహించే, నీటి ఊటలు కల బావివి. యువతి 16 ఉత్తర వాయువూ, మేలుకో, దక్షిణ వాయువూ, రా! నా ఉద్యానవనం మీద వీచండి, తద్వారా అందలి పరిమళ వాసన అన్ని వైపుల వ్యాపించాలి. నా ప్రియుడు తన ఉద్యాన వనానికి వచ్చి నచ్చిన పండ్లు రుచి చేయును గాక. |
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం™
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Biblica® Open Telugu Contemporary Version™
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Biblica, Inc.