పరమగీతము 2 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదంయువతి 1 నేను షారోను పొలంలో పూసిన గులాబిని, లోయల్లో వికసించిన తామర పువ్వును. యువకుడు 2 ముళ్ళ మధ్య తామర పువ్వులా నా ప్రియురాలు ఈ కన్యకల మధ్య కనిపిస్తూ ఉన్నది. యువతి 3 అడవి చెట్ల మధ్య ఆపిల్ వృక్షంలా నా ప్రియుడు యువకుల మధ్య ఉన్నాడు, ఆయన నీడలో ఆనందమయినై కూర్చుండిపోయాను, ఆయన ఫలం నా రుచికి మధురము. 4 నన్ను ఆయన విందుశాలకు నడిపించారు, ఆయన నన్ను ప్రేమతో కప్పివేశారు. 5 ఎండు ద్రాక్షపండ్లతో నన్ను బలోపేతం చేయండి, ఆపిల్ పండ్లతో తినిపించండి. ఎందుకంటే నేను ప్రేమతో మూర్ఛపోయాను. 6 ఆయన ఎడమ చేయి నా తల క్రింద ఉంచాడు, కుడిచేతితో నన్ను కౌగిలించుకున్నాడు. 7 యెరూషలేము కుమార్తెలారా! పొలములోని జింకలను బట్టి లేళ్లను బట్టి మీతో ప్రమాణము చేయిస్తున్నాను: సరియైన సమయం వచ్చేవరకు ప్రేమను లేపకండి, మేల్కొల్పకండి. 8 వినండి! నా ప్రియుడు! చూడండి! ఆయన వచ్చాడు, పర్వతాల మీదుగా గంతులు వేస్తూ, కొండల మీదుగా దూకుతూ. 9 నా ప్రియుడు జింకలాంటి వాడు, లేదా లేడిపిల్ల లాంటివాడు. చూడండి! అక్కడ అతడు మా గోడ వెనుక నిలబడి కిటికీల గుండా చూస్తూ, జాలక గుండా దాచుకుని చూస్తున్నాడు. 10 నా ప్రియుడు మాట్లాడి నాతో అన్నాడు, నా ప్రియురాలా, లే, నా సౌందర్యవతి, నాతో రా. 11 చూడండి! శీతాకాలం గడిచిపోయింది; వర్షాలు అయిపోయాయి. 12 భూమిపై పువ్వులు ప్రత్యక్షమవుతాయి; పాడే రుతువు వచ్చేసింది. మన దేశంలో పావురాల కూత వినిపిస్తూ ఉంది. 13 అంజూర చెట్టు దాని తొలి ఫలాలను కాస్తుంది; ద్రాక్షచెట్లు వికసించి సువాసనను వెదజల్లుతున్నాయి. నా ప్రియురాలా, లేచి, రా, నా సౌందర్యవతి, నాతో రా. యువకుడు 14 బండ సందుల్లో, పర్వత ప్రాంతంలో దాగే స్థలాల్లో ఉన్న నా పావురమా, నీ ముఖాన్ని నాకు చూపించు, నీ స్వరాన్ని విననివ్వు; ఎందుకంటే నీ స్వరం మధురం నీ ముఖం మనోహరము. 15 నక్కలను పట్టుకోండి, గుంట నక్కలను పట్టుకోండి ఎందుకంటే అవి ద్రాక్షతోటలను పాడు చేస్తాయి, మన ద్రాక్షతోట పూతకు వచ్చింది. యువతి 16 నా ప్రియుడు నావాడు నేను ఆయన దానను; తామర పువ్వుల మధ్య ఆయన నెమ్మదిగా సంచరిస్తున్నాడు. 17 తెల్లవారుజాము వచ్చి నీడలు పారిపోకముందు, నా ప్రియుడా, నా దగ్గరకు తిరిగి రా, నీవు జింకలా దుప్పిలా ఎగుడు దిగుడు కొండల మీది నుండి చెంగు చెంగున రా. |
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం™
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Biblica® Open Telugu Contemporary Version™
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Biblica, Inc.