Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

రూతు 2 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం


ధాన్య పొలంలో బోయజును కలిసిన రూతు

1 నయోమికి తన భర్త ఎలీమెలెకు వంశం యొక్క బంధువు ఉన్నాడు, అతని పేరు బోయజు.

2 మోయాబీయురాలైన రూతు నయోమితో, “నేను పొలాలకు వెళ్లి ఎవరి దృష్టిలో దయ పొందితే అతని వెనుక అతని పొలంలో పరిగె ఏరుకు వస్తాను” అని చెప్పింది. అందుకు నయోమి, “నా కుమారీ, వెళ్లు” అన్నది.

3 కాబట్టి ఆమె వెళ్లి, ఒక పొలంలో కోతకోస్తున్న పనివారి వెనుక పరిగె ఏరుకోవడం ప్రారంభించింది. అలా ఆమె పని చేసిన పొలం ఎలీమెలెకు వంశం వాడైన బోయజుకు చెందినది.

4 అప్పుడే బోయజు బేత్లెహేము నుండి వచ్చి, “యెహోవా మీకు తోడై ఉండును గాక!” అని పనివారితో అన్నాడు. “యెహోవా నిన్ను ఆశీర్వదించును గాక!” అని వారు జవాబిచ్చారు.

5 అప్పుడు బోయజు కోతపనివారి మీద నియమించబడిన తన సేవకునితో, “ఈ యువతి ఎవరికి సంబంధించినది?” అని అడిగాడు.

6 సేవకుడు జవాబిస్తూ అన్నాడు, “ఆమె మోయాబు నుండి నయోమితో కూడ తిరిగివచ్చిన మోయాబీయురాలు.

7 ‘దయచేసి నేను పనివారి వెనుక వెళ్లి పనల మధ్య పరిగెను ఏరుకోనివ్వండి’ అని ఆమె అన్నది. ఉదయం నుండి ఇప్పటివరకు ఏరుకుంటూ ఉన్నది, కొంతసేపు మాత్రమే ఆమె ఇంటి దగ్గర విశ్రాంతి తీసుకుంది.”

8 కాబట్టి బోయజు రూతుతో అన్నాడు, “నా కుమారీ, నా మాట విను. ఏరుకోడానికి వేరే పొలంలోకి వెళ్లకు, దీనిని విడిచి వెళ్లకు. నా కోసం పని చేసే స్త్రీలతో ఉండు.

9 పురుషులు పంట కోస్తున్నప్పుడు కనిపెట్టి స్త్రీల వెంట వెళ్లు. నిన్ను ఇబ్బంది కలిగించవద్దని పురుషులకు చెప్పాను. నీకు దాహం వేస్తే, పురుషులు నింపిన కుండల దగ్గరకు వెళ్లి నీళ్లు త్రాగు.”

10 అందుకు ఆమె తలవంచి సాష్టాంగపడి, “నేను పరదేశిని, మీరు నన్ను గమనించేటంత దయ మీ దృష్టిలో ఎలా సంపాదించుకున్నాను?” అని ఆమె అతన్ని అడిగింది.

11 అందుకు బోయజు ఆమెతో అన్నాడు, “నీ భర్త చనిపోయిన తర్వాత నీ అత్తకు నీవు చేసినదంతా అనగా ఎలా నీవు నీ తండ్రిని తల్లిని, నీ కుటుంబాన్ని, నీ స్వదేశాన్ని విడిచి ఇంతకుముందు నీకు తెలియని ఈ ప్రజల మధ్యకు వచ్చావో నేను విన్నాను.

12 యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలమిచ్చును గాక. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితంగా ఉండునట్లు నీవు వచ్చావు, ఆయన నీకు సంపూర్ణమైన బహుమానమిచ్చును గాక.”

13 అందుకు ఆమె, “నా ప్రభువా, నేను మీ పనివారిలో ఒకదాన్ని కానప్పటికి, మీరు నన్నాదరించి దయతో మాట్లాడారు. నేను మీ దృష్టిలో దయ సంపాదించుకోవడం కొనసాగాలి” అన్నది.

14 భోజన సమయంలో బోయజు ఆమెతో, “నీవిక్కడికి రా, భోజనం చేసి, పులిసిన ద్రాక్షరసంలో రొట్టె ముంచి తిను” అన్నాడు. ఆమె పనివారితో కూర్చున్నప్పుడు, అతడు ఆమెకు కాల్చిన ధాన్యం కొంత ఇచ్చాడు. ఆమె తృప్తిగా తిని కొంత మిగిల్చింది.

15 ఆమె ఏరుకోడానికి లేచినప్పుడు, బోయజు తన మగ పనివారితో, “ఆమె పనల మధ్య ఏరుకోనివ్వండి, ఆమెను అభ్యంతర పెట్టకండి.

16 ఆమె కోసం కొన్ని కంకులు పనల నుండి పడేయండి, ఆమె వాటిని ఏరుకునేలా విడిచిపెట్టండి, ఆమెను గద్దించకండి” అని అంటూ హెచ్చరించాడు.

17 కాబట్టి రూతు సాయంత్రం వరకు పరిగె ఏరుకుంది. తర్వాత తాను సేకరించుకున్న యవలను దుళ్లగొట్టింది, అది దాదాపు తూమెడు అయ్యింది.

18 ఆమె వాటిని పట్టణానికి తీసుకెళ్లింది, తన అత్త ఆమె ఎంత సేకరించిందో చూసింది. రూతు తాను తృప్తిగా తిన్న తర్వాత మిగిలిన దానిని కూడ తెచ్చి ఆమెకు ఇచ్చింది.

19 ఆమె అత్త ఆమెతో, “ఈ రోజు నీవెక్కడ ఏరుకున్నావు? ఎక్కడ పని చేశావు? నిన్ను గమనించిన మనిషి ధన్యుడు!” అని అన్నది. అప్పుడు రూతు ఆమె ఏ స్థలంలో పని చేస్తూ ఉన్నదో చెప్తూ, “నేను బోయజు అని పేరుగల మనిషి దగ్గర ఈ రోజు పని చేశాను” అన్నది.

20 నయోమి తన కోడలితో, “యెహోవా అతన్ని ఆశీర్వదించును గాక! అతడు బ్రతికి ఉన్నవారికి, చచ్చినవారికి దయ చూపడం మానలేదు” అన్నది. “ఆ మనుష్యుడు మనకు సమీపబంధువు; అతడు మనలను విడిపింపగల వారిలో ఒకడు” అని కూడా చెప్పింది.

21 అప్పుడు మోయాబీయురాలైన రూతు అన్నది, “అతడు నాతో, ‘నా పనివారు పంటంతా కోసే వరకు వారితో ఇక్కడే ఉండు’ అని కూడా అన్నాడు.”

22 నయోమి తన కోడలైన రూతుతో, “నా కుమారీ, అతని పనికత్తెలతోనే వెళ్లడం మంచిది, ఎందుకంటే ఇతరుల పొలంలో నీకు హాని కలుగవచ్చు” అని అన్నది.

23 కాబట్టి రూతు పరిగె ఏరుకోడానికి, యవల కోత గోధుమల కోత ముగిసేవరకు బోయజు పనికత్తెలకు దగ్గరగా ఉంది. ఆమె తన అత్తతో నివసించింది.

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం™

ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

Biblica® Open Telugu Contemporary Version™

Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

Biblica, Inc.
Lean sinn:



Sanasan