Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

రోమా పత్రిక 15 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

1 బలవంతులమైన మనం, మనల్ని మనం సంతోషపరచుకోవడం కాక బలహీనులైన వారి దోషాలను భరించవలసినవారిగా ఉన్నాము.

2 మనలో ప్రతి ఒక్కరూ తన పొరుగువారు వృద్ధిచెందేలా, వారి మంచి కోసం వారిని సంతోషపెట్టాలి.

3 క్రీస్తు కూడా తనను తానే సంతోషపరచుకోలేదు కాని, “నిన్ను అవమానపరిచేవారి అవమానాలు నాపై పడ్డాయి” అని లేఖననాల్లో వ్రాయబడిన ప్రకారం ఆయన వాటిని అనుభవించారు.

4 గతంలో వ్రాయబడిన సంగతులన్ని, లేఖనాల్లో బోధించబడిన ఓర్పు ద్వారా అవి ఇచ్చే ప్రోత్సాహాన్ని బట్టి మనం నిరీక్షణ కలిగి ఉండడం కోసం మనకు బోధించడానికి వ్రాయబడ్డాయి.

5 మన ప్రభువైన యేసు క్రీస్తు తండ్రియైన దేవున్ని మీరు ఒకే మనస్సుతో ఒకే స్వరంతో మహిమపరిచేలా,

6 మనకు ఓర్పును ప్రోత్సాహాన్ని ఇస్తున్న దేవుడు క్రీస్తు యేసు కలిగి ఉన్న వైఖరి మనం ఒకరిపట్ల ఒకరం కలిగి ఉండేలా మనకు అనుగ్రహించును గాక.

7 క్రీస్తు మిమ్మల్ని అంగీకరించినట్టుగా దేవునికి మహిమ కలిగేలా మీరు కూడా ఒకరిని ఒకరు అంగీకరించండి.

8-9 పితరులకు ఇచ్చిన వాగ్దానాల విషయంలో దేవుడు సత్యవంతుడని నిరూపించడానికి, యూదేతరులు దేవుని కనికరాన్ని బట్టి ఆయనను మహిమపరచడానికి, క్రీస్తు యూదుల సేవకుడిగా మారారని నేను మీకు చెప్తున్నాను. దీని విషయమై లేఖనాల్లో ఇలా వ్రాయబడి ఉంది: “కాబట్టి నేను నిన్ను యూదేతరుల మధ్యలో ఘనపరుస్తాను. నీ నామాన్ని గురించి స్తుతులు పాడతాను.”

10 అలాగే మరొక చోట, “యూదేతరులారా, ఆయన ప్రజలతో కలిసి సంతోషించండి.”

11 మరియొక చోట, “యూదేతరులారా, ప్రభువును స్తుతించండి; సర్వ జనులు ఆయనను కీర్తించుదురు గాక.”

12 మరోచోట యెషయా ఇలా చెప్పాడు, “యెష్షయి వేరు నుండి చిగురు వస్తుంది అంటే జనాల మీద రాజ్యం చేసేవాడు వస్తాడు, యూదేతరులంతా ఆయనలో నిరీక్షణ కలిగి ఉంటారు.”

13 పరిశుద్ధాత్మ శక్తిచేత మీరు అత్యధికమైన నిరీక్షణను కలిగి ఉండేలా నిరీక్షణకర్తయైన దేవుడు, మీరు ఆయనలో నమ్మకముంచిన ప్రకారం మిమ్మల్ని సంతోషంతో సమాధానంతో నింపును గాక.


యూదేతరులకు పరిచారకునిగా పౌలు

14 నా సహోదరీ సహోదరులారా, మీరందరు మంచితనంతో నిండినవారై, జ్ఞానం కలిగి ఒకరికి ఒకరు బోధించుకోడానికి సమర్ధులని నేను నమ్ముతున్నాను.

15-16 అయినా నేను కొన్ని విషయాలు మళ్ళీ గుర్తుచేయాలని చాలా ధైర్యంగా మీకు వ్రాస్తున్నాను, ఎందుకంటే నాకు ఇవ్వబడిన దేవుని కృపను బట్టి నేను యూదేతరులకు యేసు క్రీస్తు పరిచారకునిగా ఉన్నాను. పరిశుద్ధాత్మచేత పరిశుద్ధపరచబడి దేవునికి అంగీకారయోగ్యమైన అర్పణగా యూదేతరులు మారేలా దేవుని సువార్తను ప్రకటించడమనే యాజక ధర్మాన్ని ఆయన నాకు ఇచ్చారు.

17 అందువల్ల నేను దేవునికి చేస్తున్న సేవను బట్టి క్రీస్తు యేసులో అతిశయపడుతున్నాను.

18 పరిశుద్ధాత్మ శక్తిచేత నేను చెప్పిన మాటలు, చేసిన క్రియలు, అద్భుతాలు, సూచక క్రియల ద్వారా యూదేతరులను దేవునికి విధేయత చూపించేలా నడిపించడంలో క్రీస్తు నా ద్వారా నెరవేర్చిన దానిని గురించి తప్ప నేను దేని గురించి మాట్లాడడానికి సాహసించను.

19 కాబట్టి యెరూషలేము నుండి ఇల్లూరికు వరకు ఉన్న అన్ని ప్రదేశాల్లో క్రీస్తు సువార్తను సంపూర్ణంగా ప్రకటించాను.

20 మరొకరు వేసిన పునాది మీద నేను కట్టకూడదని క్రీస్తు గురించి తెలియని చోట్ల సువార్త ప్రకటించాలనేది ఎల్లప్పుడు నా ఆశగా ఉండింది.

21 ఎందుకంటే, ఇలా వ్రాయబడి ఉంది: “ఆయన గురించి ఎవరికి చెప్పబడలేదో వారు చూస్తారు, ఆయన గురించి ఎవరు వినలేదో వారు గ్రహిస్తారు.”

22 దీనిబట్టే నేను మీ దగ్గరకు రాకుండా చాలాసార్లు నాకు ఆటంకాలు ఎదురయ్యాయి.


రోమాను దర్శించాలని పౌలు కోరిక

23 అయితే ఇప్పుడు ఈ ప్రాంతాల్లో నేను పని చేయడానికి నాకిక స్థలమేమి లేదు. మిమ్మల్ని దర్శించాలని ఎన్నో సంవత్సరాలుగా నేను ఆశపడుతున్నాను.

24 కాబట్టి నేను స్పెయినుకు వెళ్లేటప్పుడు అక్కడికి రావాలని ఆలోచిస్తున్నాను. నేను ఆ మార్గంలో ప్రయాణిస్తున్నప్పుడు మిమ్మల్ని చూడాలని కొంతకాలం మీ సహవాసంలో ఆనందించిన తర్వాత అక్కడినుండి మీరు నన్ను సాగనంపాలని ఆశిస్తున్నాను.

25 అయితే ఇప్పుడు, నేను యెరూషలేములో ఉన్న పరిశుద్ధులకు సేవ చేయడానికి అక్కడికి వెళ్తున్నాను.

26 యెరూషలేములో ఉన్న పరిశుద్ధుల మధ్యలో ఉన్న పేదవారికి సహాయం చేయడానికి మాసిదోనియా అకాయ వారు కొంత విరాళాన్ని ఇవ్వడానికి సంతోషించారు.

27 వారు దాన్ని సంతోషంతో చేశారు. నిజానికి వారు వీరికి రుణపడి ఉన్నారు. ఎలాగంటే యూదేతరులు యూదుల ఆత్మ సంబంధమైన దీవెనలను పంచుకున్నారు కాబట్టి తమ భౌతిక సంబంధమైన దీవెనలను యూదులతో పంచుకుని వారు రుణపడి ఉన్నారు.

28 నేను ఈ పనిని ముగించాక ఖచ్చితంగా విరాళం వారికందించి, తర్వాత అక్కడినుండి స్పెయినుకు బయలుదేరి మార్గంలో మిమ్మల్ని కలుస్తాను.

29 నేను మీ దగ్గరకు వచ్చేటప్పుడు క్రీస్తు పరిపూర్ణమైన దీవెనలతో వస్తానని నాకు తెలుసు.

30 సహోదరీ సహోదరులారా, నా కోసం దేవునికి ప్రార్థించడం ద్వారా మీరు కూడా నాతో కలిసి పోరాడాలని మన ప్రభువైన యేసు క్రీస్తును బట్టి ఆత్మలోని ప్రేమను బట్టి మిమ్మల్ని వేడుకుంటున్నాను.

31 యూదయలో ఉన్న అవిశ్వాసుల నుండి నేను తప్పించుకునేలా, యెరూషలేముకు నేను తీసుకెళ్తున్న విరాళాన్ని అక్కడ ఉన్న పరిశుద్ధులు సంతోషంగా స్వీకరించేలా ప్రార్థించండి.

32 అప్పుడు నేను దేవుని చిత్తమైతే సంతోషంగా మీ దగ్గరకు వచ్చి మీ సహవాసంలో విశ్రాంతి తీసుకుంటాను.

33 సమాధానకర్తయైన దేవుడు మీ అందరితో ఉండును గాక. ఆమేన్.

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం™

ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

Biblica® Open Telugu Contemporary Version™

Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

Biblica, Inc.
Lean sinn:



Sanasan