Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

ప్రకటన 10 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం


చిన్న గ్రంథపుచుట్ట, దేవదూత

1 బలమైన మరొక దేవదూత మేఘాన్ని ధరించుకొని, తన తలమీద వానవిల్లు కలిగి పరలోకం నుండి దిగి రావడం నేను చూశాను. ఆ దేవదూత ముఖం సూర్యునిలా, కాళ్లు అగ్ని స్తంభాల్లా ఉన్నాయి.

2 అతడు తెరిచి ఉన్న ఒక చిన్న గ్రంథపుచుట్టను తన చేతిలో పట్టుకుని తన కుడికాలు సముద్రం మీద, ఎడమకాలు భూమి మీద పెట్టి,

3 సింహగర్జన వంటి పెద్ద కేక వేశాడు. అతడు కేక వేసినప్పుడు ఏడు ఉరుములు తిరిగి గర్జించాయి.

4 ఆ ఏడు ఉరుముల గర్జనలను విన్న నేను వాటి గురించి వ్రాయబోయాను; కానీ పరలోకం నుండి ఒక స్వరం నాతో, “ఈ గర్జనలను గురించి వ్రాయకు, ఏడు ఉరుములు పలికిన సంగతులకు ముద్రవేసి వాటిని రహస్యంగా ఉంచాలి” అని చెప్పడం విన్నాను.

5 అప్పుడు సముద్రం మీద, భూమి మీద నిలబడి ఉన్నట్లు నేను చూసిన ఆ దేవదూత తన కుడిచేతిని ఆకాశం వైపు ఎత్తాడు.

6 ఆ తర్వాత అతడు ఎల్లకాలం జీవిస్తూ పరలోకాన్ని దానిలో ఉన్నవాటన్నిటిని, భూమిని దానిలో ఉన్నవాటన్నిటిని, సముద్రాన్ని దానిలో ఉన్నవాటన్నిటిని సృజించినవాని తోడు నేను ప్రమాణం చేసి చెప్తున్నాను, “ఇక ఏ ఆలస్యం ఉండదు!

7 కాని ఏడవ దూత తన బూరను ఊదబోయే సమయంలో, దేవుడు తన సేవకులైన ప్రవక్తలకు ముందే తెలిపిన విధంగా దేవుని మర్మం నెరవేరుతుంది” అని చెప్పాడు.

8 అప్పుడు పరలోకం నుండి నాతో మాట్లాడిన స్వరం మళ్ళీ నాతో, “వెళ్లు, సముద్రం మీద భూమి మీద నిలబడి ఉన్న దేవదూత చేతిలో తెరిచి ఉన్న ఆ చిన్న గ్రంథపుచుట్టను తీసుకో” అని చెప్పడం విన్నాను.

9 కాబట్టి నేను ఆ దేవదూత దగ్గరకు వెళ్లి ఆ చిన్న గ్రంథపుచుట్టను నాకు ఇవ్వమని అడిగాను. అప్పుడు అతడు నాతో, “దీనిని తీసుకుని తిను, ఇది నీ కడుపుకు చేదుగా ఉంటుంది కాని నీ నోటికి తేనెలా తియ్యగా ఉంటుంది” అని చెప్పాడు.

10 అప్పుడు నేను ఆ చిన్న గ్రంథపుచుట్టను ఆ దేవదూత చేతిలో నుండి తీసుకుని తినగా అది నా నోటికి తేనెలా తియ్యగా ఉంది కాని నేను దాన్ని తిన్న తర్వాత నా కడుపులో చేదుగా మారింది.

11 అప్పుడు ఆయన నాతో, “నీవు అనేక ప్రజలు, దేశాలు, రాజులు, వివిధ భాషలు మాట్లాడేవారి గురించి మళ్ళీ ప్రవచించాలి” అని చెప్పాడు.

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం™

ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

Biblica® Open Telugu Contemporary Version™

Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

Biblica, Inc.
Lean sinn:



Sanasan