కీర్తన 94 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదంకీర్తన 94 1 యెహోవా ప్రతీకారం చేసే దేవుడు. ప్రతీకారం సాధించే దేవా, ప్రకాశించండి. 2 లోక న్యాయాధిపతి, లేవండి; గర్విష్ఠులకు తగ్గ ప్రతిఫలం ఇవ్వండి. 3 యెహోవా, ఎంతకాలం దుష్టులు, ఎంతకాలం దుష్టులు ఆనందిస్తారు? 4 వారు అహంకారపు మాటలు మాట్లాడతారు; కీడుచేసేవారంతా గొప్పలు చెప్పుకుంటారు. 5 యెహోవా, వారు మీ ప్రజలను నలిపివేస్తారు; మీ వారసత్వాన్ని అణచివేస్తారు. 6 విధవరాండ్రను విదేశీయులను చంపేస్తారు; వారు తండ్రిలేనివారిని హత్య చేస్తారు. 7 వారంటారు, “యెహోవా చూడడం లేదు; యాకోబు దేవుడు గమనించడంలేదు.” 8 ప్రజల్లో తెలివిలేని మీరు, గమనించండి; అవివేకులారా, మీరు ఎప్పుడు జ్ఞానులవుతారు? 9 చెవులిచ్చినవాడు వినడా? కళ్ళిచ్చిన వాడు చూడడా? 10 దేశాలను శిక్షణ చేసేవాడు మిమ్మల్ని శిక్షించడా? నరులకు బోధించేవానికి తెలివిలేదా? 11 మనుష్యుల ప్రణాళికలన్నీ యెహోవాకు తెలుసు; అవి వ్యర్థమైనవి అని ఆయనకు తెలుసు. 12 యెహోవా శిక్షణ చేసినవారు ధన్యులు, వారికి మీ ధర్మశాస్త్రం నుండి మీరు బోధిస్తారు. 13 దుష్టుని కోసం గొయ్యి త్రవ్వబడే వరకు, ఇబ్బంది దినాల నుండి మీరు వారికి ఉపశమనం కలిగిస్తారు. 14 యెహోవా తన ప్రజలను తృణీకరించరు; ఆయన తన వారసత్వాన్ని ఎన్నడు విడిచిపెట్టరు. 15 తీర్పు మళ్ళీ నీతి మీద స్థాపించబడుతుంది, యథార్థవంతులందరు దానిని అనుసరిస్తారు. 16 నా కోసం దుష్టునికి వ్యతిరేకంగా ఎవరు లేస్తారు? కీడు చేసేవారిని నా కోసం ఎవరు వ్యతిరేకిస్తారు? 17 యెహోవా నాకు సాయం చేసి ఉండకపోతే, నేను మౌన నిద్రలో నివసించేవాన్ని. 18 “నా కాలు జారింది” అని నేను అన్నప్పుడు, యెహోవా, మీ మారని ప్రేమ నన్ను ఎత్తి పట్టుకున్నది. 19 ఆందోళన కలిగించే తలంపులు ఎక్కువ అవుతున్నాయి. మీ ఓదార్పు నాకు ఆనందాన్ని కలిగించింది. 20 శాసనాల ద్వారా కష్టాలు తెచ్చే అవినీతి సింహాసనం మీతో పొత్తు పెట్టుకోగలదా? 21 నీతిమంతుల ప్రాణాలు తియ్యటానికి దుష్టులు దుమ్మీగా వచ్చి పైకి ఎగబడతారు. నిర్దోషులపై నేరాలు మోపి మరణశిక్ష విధిస్తారు. 22 యెహోవా నాకు ఎత్తైన కోట. నా దేవుడు నేను ఆశ్రయించే కొండ. 23 వారి పాపాలకు ఆయన వారికి తిరిగి చెల్లిస్తారు వారి దుష్టత్వాన్ని బట్టి వారిని నాశనం చేస్తారు; మన దేవుడైన యెహోవా వారిని నాశనం చేస్తారు. |
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం™
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Biblica® Open Telugu Contemporary Version™
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Biblica, Inc.