కీర్తన 91 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదంకీర్తన 91 1 మహోన్నతుడైన దేవుని చాటున నివసించేవారు సర్వశక్తిమంతుని నీడలో స్థిరంగా ఉంటారు. 2 యెహోవా గురించి నేను చెప్పేదేమంటే, “ఆయనే నా ఆశ్రయం నా కోట, నా దేవుడు, ఆయననే నేను నమ్ముకున్నాను.” 3 వేటగాని వల నుండి, మరణకరమైన తెగులు నుండి, ఆయన తప్పక విడిపిస్తారు. 4 ఆయన తన రెక్కలతో నిన్ను కప్పుతారు, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం; ఆయన నమ్మకత్వం నీకు డాలుగాను గోడగాను ఉంటుంది. 5 రాత్రి భయాలకు గాని, పగటి పూట ఎగిరి వచ్చే బాణాలకు గాని, 6 చీకటిలో సంచరించే తెగులుకు గాని, మధ్యహ్నం హఠాత్తుగా కలిగే నాశనానికి గాని, నీవు భయపడాల్సిన అవసరం లేదు. 7 నీ ప్రక్కన వేయిమంది, నీ కుడి ప్రక్కన పదివేలమంది కూలవచ్చు, అయినా, అది నీ దగ్గరకు రాదు. 8 నీవు నీ కళ్లతో గమనిస్తావు దుష్టులు శిక్ష పొందడం నీవు చూస్తావు. 9 “యెహోవా నాకు ఆశ్రయం” అని ఒకవేళ నీవు అని, మహోన్నతుని నీకు నివాసంగా చేసుకుంటే, 10 ఏ హాని నీ మీదికి రాదు, ఏ తెగులు నీ గుడారానికి దగ్గరగా రాదు. 11 నీ మార్గాలన్నిటిలో నిన్ను కాపాడమని నీ గురించి ఆయన తన దూతలకు ఆజ్ఞాపిస్తారు. 12 నీ పాదాలకు రాయి తగలకుండ, వారు నిన్ను తమ చేతులతో ఎత్తి పట్టుకుంటారు. 13 నీవు సింహం మీద నాగుపాము మీద నడిచి వెళ్తావు; కొదమ సింహాన్ని సర్పాన్ని త్రొక్కివేస్తావు. 14 “అతడు నన్ను ప్రేమిస్తున్నాడు, కాబట్టి నేను అతన్ని విడిపిస్తాను” అని యెహోవా అంటున్నారు; అతడు నా నామాన్ని గుర్తిస్తాడు, కాబట్టి నేను అతన్ని కాపాడతాను. 15 అతడు నాకు మొరపెడతాడు, నేను అతనికి జవాబిస్తాను; కష్టాల్లో నేనతనిని ఆదుకుంటాను, అతన్ని విడిపిస్తాను ఘనపరుస్తాను. 16 దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరుస్తాను, నా రక్షణ అతనికి చూపిస్తాను. |
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం™
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Biblica® Open Telugu Contemporary Version™
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Biblica, Inc.