కీర్తన 90 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదంనాలుగవ గ్రంథము కీర్తనలు 90–106 కీర్తన 90 దైవజనుడైన మోషే చేసిన ఒక ప్రార్థన. 1 ప్రభువా, తరతరాల నుండి మీరే మా నివాస స్థలంగా ఉన్నారు. 2 పర్వతాలు పుట్టక ముందే, మీరు లోకమంతటిని చేయక ముందే నిత్యత్వము నుండి నిత్యత్వము వరకు మీరే దేవుడు. 3 “మనుష్యులారా, మీరు మంటికి తిరిగి వెళ్లండి” అని అంటూ, మీరు ప్రజలను ధూళి వైపుకు తిరిగి త్రిప్పుతారు. 4 మీ దృష్టిలో వెయ్యి సంవత్సరాలు ఇప్పుడే గడిచిన రోజులా, రాత్రి జాముల్లా ఉన్నాయి. 5 అయినప్పటికీ మీరు మరణ నిద్రలో ప్రజలను ప్రవాహంలా తుడిచివేస్తారు; వారు ప్రొద్దున్నే మొలిచిన గడ్డిలా ఉన్నారు. 6 అది ఉదయం క్రొత్తగా పుడుతుంది, సాయంకాలానికల్లా వాడి ఎండిపోతుంది. 7 మేము మీ కోపాగ్నికి దహించుకు పోతున్నాము మీ ఆగ్రహానికి భయపడుతున్నాము. 8 మీరు మా దోషాలను మీ ఎదుట, మా రహస్య పాపాలను మీ సన్నిధి కాంతిలో ఉంచారు. 9 మా దినాలన్ని మీ ఉగ్రత లోనే గడిచిపోయాయి; మేము మా సంవత్సరాలను మూలుగుతో ముగిస్తాము. 10 మా ఆయుష్షు డెబ్బై సంవత్సరాలు, అధిక బలం ఉంటే ఎనభై సంవత్సరాలు; అయినా వాటి వైభవం నాశనం దుష్టత్వం, అవి త్వరగా గడచిపోతాయి, మేము ఎగిరిపోతాం. 11 ఒకవేళ మీ కోపం యొక్క శక్తి ఎవరు గ్రహించగలరు! మీ ఉగ్రత మీకు చెందిన భయంలా భీకరంగా ఉంటుంది. 12 మా దినాలను లెక్కించడం మాకు నేర్పండి, తద్వార మేము జ్ఞానంగల హృదయాన్ని సంపాదించగలము. 13 యెహోవా, మా దగ్గరకు తిరిగి రండి! ఇంకెంత కాలం? మీ దాసుల మీద కనికరం చూపండి. 14 ఉదయం మీ మారని ప్రేమతో మమ్మల్ని తృప్తిపరచండి, తద్వార బ్రతికినన్నాళ్ళు ఆనంద గానం చేస్తూ ఆనందిస్తాము. 15 మమ్మల్ని బాధించినన్ని దినాలు, మమ్మల్ని ఇబ్బంది పెట్టినన్నాళ్ళు మమ్మల్ని సంతోషింపజేయండి. 16 మీ క్రియలు మీ సేవకులకు, మీ ప్రభావము వారి పిల్లలకు కనుపరచబడును గాక. 17 మన ప్రభువైన దేవుని దయ మనమీద ఉండును గాక; మా చేతి పనులను మాకోసం స్థిరపరచండి, అవును, మా చేతి పనులను స్థిరపరచండి. |
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం™
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Biblica® Open Telugu Contemporary Version™
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Biblica, Inc.