Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

కీర్తన 9 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం


కీర్తన 9
సంగీత దర్శకునికి. “కుమారుని మరణం” అనే రాగం మీద పాడదగినది. దావీదు కీర్తన.

1 యెహోవా, నేను నా హృదయమంతటితో మిమ్మల్ని స్తుతిస్తాను; మీ అద్భుతమైన క్రియల గురించి నేను చెప్తాను.

2 మీలో నేను ఆనందించి సంతోషిస్తాను; ఓ మహోన్నతుడా, మీ నామాన్ని బట్టి నేను స్తుతులు పాడతాను.

3 నా శత్రువులు వెనుకకు తిరుగుతారు; మీ ముందు వారు తడబడి నశిస్తారు.

4 నీతిమంతుడవైన న్యాయమూర్తిగా సింహాసనంపై కూర్చుని, నా పక్షంగా న్యాయం తీర్చుతున్నారు.

5 మీరు దేశాలను మందలించి దుష్టులను నిర్మూలం చేశారు; మీరు వారి పేరును ఎప్పటికీ లేకుండ తుడిచివేశారు.

6 అంతులేని పతనం నా శత్రువులు పతనమై పూర్తిగా నశిస్తారు, మీరు వారి పట్టణాలను పెల్లగించారు; వాటి జ్ఞాపకం కూడా చెరిగిపోతుంది.

7 యెహోవా నిరంతరం పరిపాలిస్తారు; తీర్పు కోసం ఆయన తన సింహాసనాన్ని స్థాపించారు.

8 ఆయన నీతితో లోకాన్ని పరిపాలిస్తారు ఆయన దేశాలను న్యాయంగా తీర్పు తీరుస్తారు.

9 అణచివేయబడిన వారికి యెహోవా ఆశ్రయం, కష్ట సమయాల్లో బలమైన కోట.

10 మీ నామం తెలిసిన వారు మీమీద నమ్మకం ఉంచుతారు, ఎందుకంటే యెహోవా, మిమ్మల్ని వెదికే వారిని మీరు ఎన్నడూ విడువరు.

11 సీయోనులో సింహాసనాసీనుడైయున్న యెహోవాను గురించి స్తుతులు పాడండి; దేశాల మధ్య ఆయన చేసిన వాటిని ప్రకటించండి.

12 ఎందుకంటే రక్తానికి ప్రతీకారం తీర్చుకునేవాడు జ్ఞాపకముంచుకుంటాడు; బాధితుల మొరను ఆయన విస్మరించరు.

13 యెహోవా, నా శత్రువులు నన్ను ఎలా హింసించారో చూడండి! నన్ను కరుణించి మరణ ద్వారాల నుండి నన్ను తప్పించండి,

14 తద్వార నేను మీ స్తుతులను సీయోను కుమారీ ద్వారాల దగ్గర ప్రకటిస్తాను, మీ రక్షణలో నేనానందిస్తాను.

15 తాము త్రవ్విన గోతిలోనే దేశాలు పడిపోయాయి; తాము పన్నిన వలలోనే వారి పాదాలు చిక్కుకున్నాయి.

16 తన న్యాయమైన క్రియల ద్వార యెహోవా బయలుపరచబడతారు; దుష్టులు తాము చేసిన దానిలోనే చిక్కుకుంటారు. సెలా

17 దుష్టులు పాతాళంలో పడిపోతారు, దేవున్ని మరచిపోయే దేశాలు కూడా అంతే.

18 కాని అవసరతలో ఉన్నవారిని దేవుడు ఎన్నడూ మరచిపోరు; బాధితుల నిరీక్షణ ఎప్పటికీ నశించదు.

19 యెహోవా, లెండి, మనుష్యులను గెలువనీయకండి; మీ సమక్షంలో రాజ్యాలకు తీర్పు తీర్చండి.

20 యెహోవా, వారిని భయభ్రాంతులకు గురి చేయండి; తాము కేవలం మానవమాత్రులే అని దేశాలను తెలుసుకోనివ్వండి. సెలా

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం™

ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

Biblica® Open Telugu Contemporary Version™

Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

Biblica, Inc.
Lean sinn:



Sanasan