Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

కీర్తన 88 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం


కీర్తన 88
ఒక గీతము. కోరహు కుమారుల కీర్తన. సంగీత దర్శకునికి. మహలతు లయన్నోత్ అనే రాగం మీద పాడదగినది. ఎజ్రాహీయుడైన హేమాను ధ్యానకీర్తన.

1 యెహోవా, మీరు నన్ను రక్షించే దేవుడు; రాత్రింబగళ్ళు నేను మీకు మొరపెడతాను.

2 నా ప్రార్థనలు మీ ఎదుటకు వచ్చును గాక; చెవియొగ్గి నా మొర ఆలకించండి.

3 నేను ఇబ్బందుల్లో మునిగి ఉన్నాను నా ప్రాణం మరణానికి చేరువగా ఉంది.

4 సమాధికి వెళ్లే వారితో నేను లెక్కించబడ్డాను; నేను బలం లేనివాడిలా ఉన్నాను.

5 సమాధిలో పడి ఉన్న హతులైనవారిలా, నేను చచ్చినవారితో విడిచిపెట్టబడ్డాను, వారిని మీరు ఎన్నటికి జ్ఞాపకముంచుకోరు, వారు మీ సంరక్షణ నుండి తొలగిపోయారు.

6 మీరు నన్ను లోతైన గుంటలో, చీకటి గుంటలో ఉంచారు.

7 మీ ఉగ్రత నా మీద భారంగా ఉంది; మీ అలలతో నన్ను ముంచివేశారు. సెలా

8 నా దగ్గరి స్నేహితులను నా నుండి దూరం చేశారు నన్ను వారికి అసహ్యమైన వానిగా చేశారు. నేను నిర్బంధించబడ్డాను నేను తప్పించుకోలేను;

9 దుఃఖంతో నా కళ్లు మసకబారాయి. యెహోవా, ప్రతిరోజు నేను మీకు మొరపెడుతున్నాను; మీ వైపు నా చేతులు చాచాను.

10 మృతులకు మీరు అద్భుతాలు చూపిస్తారా? వారి ఆత్మలు లేచి మిమ్మల్ని స్తుతిస్తాయా? సెలా

11 సమాధిలో మీ మారని ప్రేమ ప్రకటించబడుతుందా? నాశనకూపంలో మీ నమ్మకత్వం ప్రకటించబడుతుందా?

12 చీకటి స్థలంలో మీ అద్భుతాలు తెలుస్తాయా? మరుపుకు గురియైన దేశంలో మీ నీతి క్రియలు తెలుస్తాయా?

13 కాని యెహోవా, నేను సహాయం కోసం మీకు మొరపెడతాను; ఉదయం నా ప్రార్థన మీ ఎదుటకు వస్తుంది.

14 యెహోవా, మీరు ఎందుకు నన్ను తృణీకరిస్తూ నా నుండి మీ ముఖాన్ని దాచుకుంటున్నారు?

15 నా యవ్వనం నుండి నేను బాధను అనుభవించి మరణానికి దగ్గరగా ఉన్నాను; నేను మీ భయాలను భరించి నిరాశలో ఉన్నాను.

16 మీ ఉగ్రత నన్ను ముంచేసింది; మీ భయాలు నన్ను నిర్మూలం చేశాయి.

17 అవి రోజంతా ప్రవాహంలా నన్ను చుట్టుముట్టాయి; అవి నన్ను పూర్తిగా ముంచేశాయి.

18 నా స్నేహితులను నా పొరుగువారిని నాకు దూరం చేశారు చీకటే నాకు దగ్గరి స్నేహితుడు.

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం™

ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

Biblica® Open Telugu Contemporary Version™

Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

Biblica, Inc.
Lean sinn:



Sanasan