Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

కీర్తన 7 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం


కీర్తన 7
దావీదు వీణతో పాడిన కీర్తన. బెన్యామీనీయుడైన కూషు విషయంలో దావీదు యెహోవాకు పాడిన కీర్తన.

1 యెహోవా నా దేవా, నేను మిమ్మల్ని ఆశ్రయించాను; నన్ను వెంటాడే వారందరి నుండి నన్ను రక్షించి విడిపించండి,

2 లేకపోతే వారు సింహంలా చీల్చివేస్తారు ఎవరు విడిపించలేనంతగా నన్ను ముక్కలు చేస్తారు.

3 యెహోవా నా దేవా, ఒకవేళ నేను అన్యాయమైన చర్యలకు పాల్పడితే

4 నాతో సమాధానంగా ఉన్నవానికి కీడు చేస్తే కారణం లేకుండ నా శత్రువును నేను దోచుకుంటే

5 అప్పుడు నా శత్రువు నన్ను వెంటాడి పట్టుకొనును గాక; నా ప్రాణాన్ని నేల మీద అణగద్రొక్కి నా ప్రతిష్ఠను మట్టిపాలు చేయును గాక. సెలా

6 యెహోవా, కోపంతో లేవండి; నా శత్రువుల ఆగ్రహానికి వ్యతిరేకంగా లేవండి. నా దేవా, మేల్కొనండి; న్యాయాన్ని శాసించండి.

7 మీరు వారికి పైగా ఉన్నత సింహాసనంపై ఆసీనులై ఉండగా, ఆయా జాతుల ప్రజలు మీ చుట్టూ గుమికూడనివ్వండి.

8 యెహోవా జనులకు తీర్పు తీర్చును గాక. యెహోవా, నా నీతిని బట్టి, ఓ మహోన్నతుడా, నా యథార్థతను బట్టి నాకు శిక్షావిముక్తి చేయండి.

9 మనస్సులను హృదయాలను పరిశీలించే, నీతిమంతుడవైన దేవా, దుష్టుల దుర్మార్గాన్ని అంతం చేసి, నీతిమంతులను భద్రపరచండి.

10 యథార్థ హృదయులను కాపాడే సర్వోన్నతుడైన దేవుడే నాకు డాలు.

11 దేవుడు నీతిగల న్యాయమూర్తి, ఆయన దుష్టులపై ప్రతిరోజు తన ఉగ్రతను చూపిస్తారు.

12 ఒకవేళ ఎవరైనా పశ్చాత్తాపపడకపోతే, దేవుడు తన ఖడ్గాన్ని పదునుపెడతారు; ఆయన తన విల్లు ఎక్కుపెట్టి బాణం సిద్ధపరుస్తారు.

13 ఆయన తన మారణాయుధాలు సిద్ధం చేసుకుంటారు; ఆయన తన అగ్ని బాణాలు సిద్ధం చేసుకుంటారు.

14 దుష్టులు చెడును గర్భం దాలుస్తారు, కీడును గర్భంలో మోసి అబద్ధాలకు జన్మనిస్తారు.

15 ఇతరుల కోసం గుంటను త్రవ్వుతారు తాము త్రవ్విన గుంటలో వారే పడతారు.

16 వారు చేసిన కీడు వారికే చుట్టుకుంటుంది; వారు చేసిన హింస వారి తల మీదికే వస్తుంది.

17 యెహోవా నీతిని బట్టి నేను ఆయనకు కృతజ్ఞతలు చెల్లిస్తాను; మహోన్నతుడైన యెహోవా నామానికి నేను స్తుతులు పాడతాను.

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం™

ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

Biblica® Open Telugu Contemporary Version™

Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

Biblica, Inc.
Lean sinn:



Sanasan