Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

కీర్తన 66 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం


కీర్తన 66
సంగీత దర్శకునికి. ఒక కీర్తన. ఒక గీతము.

1 సర్వలోకమా! ఆనందంతో దేవునికి కేకలు వేయండి!

2 ఆయన నామాన్ని కీర్తించండి ఆయనను స్తుతించి మహిమపరచండి.

3 దేవునితో ఇలా అనండి, “మీ క్రియలు ఎంత అద్భుతం! మీ శక్తి ఎంతో గొప్పది కాబట్టి మీ శత్రువులు భయంతో మీకు లొంగిపోతారు.

4 సర్వ లోకం మీకు నమస్కరిస్తుంది; మీకు స్తుతి పాడతారు మీ నామాన్ని స్తుతిస్తారు.” సెలా

5 దేవుడు ఏం చేశారో వచ్చి చూడండి, మనుషులకు ఆయన చేసిన భీకరమైన క్రియలు చూడండి!

6 సముద్రాన్ని ఆరిన నేలగా చేశారు, వారు కాలినడకన నది దాటి వెళ్లారు రండి, మనం ఆయనలో ఆనందిస్తాము.

7 ఆయన తన శక్తితో నిత్యం పరిపాలిస్తారు, ఆయన కళ్లు దేశాలను చూస్తాయి, తిరుగుబాటు చేసేవారు తమను తాము హెచ్చించుకోకూడదు. సెలా

8 సర్వజనులారా, మన దేవున్ని స్తుతించండి, ఆయనను స్తుతిస్తున్న ధ్వని వినబడును గాక;

9 ఆయన మనల్ని సజీవంగా ఉంచారు మన పాదాలు జారిపోకుండ చేశారు.

10 దేవా, మీరు మమ్మల్ని పరీక్షించారు; వెండిలా మమ్మల్ని శుద్ధి చేశారు.

11 మీరు మమ్మల్ని వలలో బంధించారు, మా నడుముల మీద భారాన్ని మోపారు.

12 మీరు మా తలలపై స్వారీ చేయడానికి ప్రజలను అనుమతించారు; అగ్ని జలాల గుండా మేము వెళ్లాము, అయినా మీరు మమ్మల్ని సమృద్ధిగల స్థలంలోనికి తెచ్చారు.

13 దహన బలులతో మీ ఆలయానికి వచ్చి నా మ్రొక్కుబడులు మీకు చెల్లిస్తాను.

14 నేను శ్రమల్లో ఉన్నప్పుడు నా పెదవులు ప్రమాణం చేసిన, నా నోరు పలికిన మ్రొక్కుబడులు చెల్లిస్తాను.

15 నేను మీకు క్రొవ్విన జంతువులను పొట్టేళ్ళను సువాసనగల దహనబలిగా అర్పిస్తాను; నేను ఎద్దులను మేకలను అర్పిస్తాను. సెలా

16 దేవుడంటే భయం భక్తి ఉన్నవారలారా, మీరంతా రండి వినండి; ఆయన నా కోసం ఏం చేశారో మీకు చెప్తాను.

17 నేను నా నోటితో ఆయనకు మొరపెట్టాను; ఆయన స్తుతి నా నాలుక మీద ఉంది.

18 నా హృదయంలో దుష్టత్వం ఉంటే, ప్రభువు నా ప్రార్థన వినేవారు కాదు.

19 కాని దేవుడు నిశ్చయంగా ఆలకించారు నా ప్రార్థన విన్నారు.

20 నా ప్రార్థనను త్రోసివేయని తన మారని ప్రేమను నా నుండి తొలగించని, దేవునికి స్తుతి కలుగును గాక!

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం™

ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

Biblica® Open Telugu Contemporary Version™

Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

Biblica, Inc.
Lean sinn:



Sanasan