కీర్తన 65 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదంకీర్తన 65 సంగీత దర్శకునికి. దావీదు కీర్తన. ఒక గీతము. 1 మా దేవా, సీయోనులో మీరు స్తుతికి యోగ్యులు; మా మ్రొక్కుబడులు మీకు చెల్లిస్తాము. 2 మీరు ప్రార్థనకు జవాబు ఇచ్చేవారు, ప్రజలందరు మీ దగ్గరకే వస్తారు. 3 మేము పాపాల్లో మునిగి ఉన్నప్పుడు, మీరు మా అతిక్రమాలను క్షమించారు. 4 మీ ఆవరణాల్లో నివసించడానికి మీరు ఎన్నుకుని మీ దగ్గరకు తెచ్చుకున్న వారు ధన్యులు! మీ పరిశుద్ధ మందిరం యొక్క, మీ గృహంలోని ఆశీర్వాదాలతో మేము తృప్తిచెందుతాం. 5 మీరు భీకరమైన నీతి క్రియలతో మాకు జవాబు ఇస్తారు, దేవా మా రక్షకా, భూదిగంతాలన్నిటికి సుదూర సముద్రాలకు మీరే నిరీక్షణ. 6 బలమును ఆయుధంగా ధరించుకొని, మీరు మీ మహాశక్తితో పర్వతాలను సృజించారు. 7 సముద్రం యొక్క హోరును, అలల యొక్క ఘోషను దేశాల్లోని కలకలాన్ని నిమ్మళం చేసేవారు ఆయనే. 8 భూదిగంతాలలో నివసించే వారందరు మీ అద్భుతాలకు భయంతో నిండి ఉన్నారు; ఉదయం సాయంత్రాలను మీరు ఆనందంతో కేకలు వేసేలా చేస్తారు. 9 మీరు భూమిని గమనించి నీరు పోస్తారు; మీరు దానిని సమృద్ధిగా సుసంపన్నం చేస్తారు. ప్రజలకు ధాన్యాన్ని అందించడానికి దేవుని ప్రవాహాలు నీటితో నిండి ఉన్నాయి ఎందుకంటే దానిని మీరు అలా నియమించారు. 10 మీరు దున్నిన భూమిని వర్షంతో తడిపి, గడ్డలను కరిగించి, గట్లు సమం చేస్తారు. మీరు వానజల్లులతో భూమిని మృదువుగా చేసి, దాని పంటలను ఆశీర్వదిస్తారు. 11 మీరు మీ దయతో సంవత్సరానికి కిరీటం ధరింపచేస్తారు, మార్గాలు కూడ సమృద్ధితో పొంగిపోతాయి. 12 అరణ్యం యొక్క తుక్కు భూములు పొంగిపొర్లుతాయి; కొండలు ఆనందాన్ని ధరించుకొని ఉన్నాయి. 13 పచ్చికబయళ్లు మందల చేత కప్పబడ్డాయి లోయలు ధాన్యంతో కప్పబడి ఉన్నాయి; వారు ఆనందంతో కేక వేస్తూ పాడతారు. |
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం™
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Biblica® Open Telugu Contemporary Version™
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Biblica, Inc.