కీర్తన 62 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదంకీర్తన 62 సంగీత దర్శకునికి. యెదూతూను అనే రాగం మీద పాడదగినది. దావీదు కీర్తన. 1 నేను దేవునిలోనే విశ్రాంతి పొందుతాను; ఆయన నుండి నాకు రక్షణ కలుగుతుంది. 2 ఆయనే నా కొండ నా రక్షణ; ఆయన నా బలమైన దుర్గం, నేను ఎప్పటికీ కదల్చబడను. 3 ఎంతకాలం మీరు ఒక్కడి మీద దాడి చేస్తారు? వాలుతున్న గోడను, పడిపోతున్న కంచెను పడద్రోసినట్లు మీరంతా నన్ను పడద్రోస్తారు? 4 ఖచ్చితంగా వారు నన్ను నా ఉన్నత స్థానం నుండి పడగొట్టాలని నిర్ణయించారు; వారు అబద్ధాలు చెప్పడంలో ఆనందిస్తారు. వారు నోటితో దీవిస్తారు, కాని వారి హృదయాల్లో శపిస్తారు. సెలా 5 అవును, నా ఆత్మ దేవునిలోనే విశ్రాంతి పొందుతుంది; ఆయన వలననే నాకు నిరీక్షణ కలుగుతుంది. 6 ఆయన నా కొండ నా రక్షణ; ఆయన నా కోట, నేను కదల్చబడను. 7 నా రక్షణ నా ఘనత దేవుని పైనే ఆధారపడి ఉన్నాయి; ఆయన నాకు శక్తివంతమైన కొండ, నా ఆశ్రయము. 8 ప్రజలారా, ఎల్లప్పుడూ ఆయనను నమ్మండి; మీ హృదయాలను ఆయన ఎదుట క్రుమ్మరించండి, ఎందుకంటే దేవుడు మనకు ఆశ్రయము. సెలా 9 సామాన్య మనుష్యులు ఊపిరిలాంటివారు, ఉన్నత గోత్రం కేవలం మాయ త్రాసులో పెట్టి తూస్తే వారిద్దరు కలిసి ఊపిరి కంటే తేలికగా ఉంటారు. 10 బలాత్కారాన్ని నమ్ముకోకండి దోపిడీలు చేసి ధనవంతులై విర్రవీగకండి. ధనం ఎక్కువైనా సరే, దాని మీద మనస్సు పెట్టకండి. 11 దేవుడు ఒక్క సంగతి మాట్లాడారు, రెండు సార్లు విన్నాను: “దేవా, శక్తి మీకే చెందుతుంది, 12 ప్రభువా, మీరు మారని ప్రేమగలవారు; మీరు మనుష్యులందరికి వారి క్రియలను తగ్గట్టుగా ప్రతిఫలమిస్తారు.” |
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం™
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Biblica® Open Telugu Contemporary Version™
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Biblica, Inc.