కీర్తన 51 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదంకీర్తన 51 సంగీత దర్శకునికి. దావీదు కీర్తన. దావీదు బత్షెబతో వ్యభిచరించిన తర్వాత నాతాను ప్రవక్త తన దగ్గరకు వచ్చిన సందర్భంలో వ్రాశాడు. 1 ఓ దేవా, మీ మారని ప్రేమను బట్టి నన్ను కరుణించండి; మీ గొప్ప కనికరాన్ని బట్టి, నా పాపాలను తుడిచివేయండి. 2 నా దోషాలన్నింటిని కడిగి, నా పాపము నుండి నన్ను శుభ్రపరచండి. 3 నా అతిక్రమాలు నాకు తెలుసు నా పాపం ఎల్లప్పుడు నా కళ్లెదుటే ఉంది. 4 కేవలం మీకు, మీకే విరోధంగా నేను పాపం చేశాను, మీ దృష్టికి చెడు చేశాను; మీ తీర్పులో మీరు సరిగ్గా ఉంటారు మీరు తీర్పు తీర్చునప్పుడు న్యాయసమ్మతంగా ఉంటుంది. 5 నేను పాపిగా పుట్టాను, నా తల్లి నన్ను గర్భం దాల్చినప్పుడు నేను పాపిని. 6 మీరు అంతరంగంలో నిజాయితీ కోరతారు; ఆ రహస్య ప్రదేశంలో మీరు నాకు జ్ఞానం బోధించారు. 7 హిస్సోపుతో నన్ను శుద్ధీకరించండి, నేను శుద్ధునిగా ఉంటాను; నన్ను కడగండి, నేను హిమము కంటే తెల్లగా ఉంటాను. 8 నన్ను ఆనందాన్ని సంతోషాన్ని విననివ్వండి; మీరు విరిచిన ఎముకలను సంతోషించనివ్వండి. 9 నా పాపముల నుండి మీ ముఖాన్ని దాచండి నా దోషమంతటిని తుడిచివేయండి. 10 ఓ దేవా, నాలో శుద్ధహృదయాన్ని సృష్టించండి, నాలో స్థిరమైన ఆత్మను నూతనంగా పుట్టించండి. 11 మీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకండి, మీ పరిశుద్ధాత్మను నా నుండి తొలగించకండి. 12 మీ రక్షణానందం నాకు తిరిగి చేకూర్చండి, నన్ను సంరక్షించడానికి నాకు సమ్మతిగల ఆత్మను ఇవ్వండి. 13 అప్పుడు అతిక్రమం చేసేవారికి మీ మార్గాలను బోధిస్తాను, తద్వార పాపులు మీ దగ్గరకు తిరిగి వస్తారు. 14 మీరు దేవుడు, నా రక్షకుడు, ఓ దేవా, రక్తాపరాధం నుండి నన్ను విడిపించండి, నా నాలుక మీ నీతిని గురించి పాడుతుంది. 15 ప్రభువా, నా పెదవులను తెరవండి, నా నోరు మీ స్తుతిని ప్రకటిస్తుంది. 16 మీరు బలులను బట్టి ఆనందించరు, లేకపోతే నేను తెచ్చేవాన్ని; మీరు దహనబలులను ఇష్టపడరు. 17 విరిగిన ఆత్మ దేవునికి ఇష్టమైన బలి; పశ్చాత్తాపంతో విరిగిన హృదయాన్ని దేవా, మీరు నిరాకరించరు. 18 మీ దయతో సీయోనుకు మంచి చేయండి; యెరూషలేము గోడలు కట్టించండి. 19 అప్పుడు మీరు నీతిమంతుల బలులలో, దహన బలులలో, సర్వాంగ హోమములలో ఆనందిస్తారు; అప్పుడు మీ బలిపీఠం మీద ఎద్దులు అర్పించబడతాయి. |
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం™
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Biblica® Open Telugu Contemporary Version™
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Biblica, Inc.