Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

కీర్తన 45 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం


కీర్తన 45
సంగీత దర్శకునికి. షోషనీయులను రాగం మీద పాడదగినది. కోరహు కుమారులు రచించిన ధ్యానకీర్తన. పెళ్ళి గీతము.

1 నేను రాజు కోసం వ్రాసిన పద్యాలు వల్లించేటప్పుడు, నా హృదయం ఓ మంచి అంశంతో ఉప్పొంగింది; నా నాలుక నైపుణ్యం కలిగిన రచయిత కలము.

2 మీరు మనుష్యుల్లో అత్యంత అద్భుతమైనవారు మీ పెదవులపై దయ నిండి ఉంది, దేవుడు మిమ్మల్ని నిత్యం ఆశీర్వదిస్తారు.

3 బలాఢ్యుడా, మీ ఖడ్గాన్ని నడుముకు కట్టుకోండి; వైభవం ప్రభావాలను ధరించుకోండి.

4 సత్యం, వినయం, న్యాయం కోసం మీ వైభవంతో విజయవంతంగా ముందుకు సాగిపోండి. మీ కుడిచేయి భీకరమైన క్రియలు సాధించాలి.

5 పదునైన మీ బాణాలు శత్రురాజుల గుండెలను చీల్చుకునిపోతాయి. మీ పాదాల క్రింద జనాలు కూలి పడతారు.

6 ఓ దేవా, మీ సింహాసనం నిరంతరం నిలుస్తుంది; మీ న్యాయ దండమే మీ రాజ్య దండం.

7 మీరు నీతిని ప్రేమించి దుష్టత్వాన్ని ద్వేషిస్తారు; కాబట్టి దేవుడు, మీ దేవుడు ఆనంద తైలంతో మిమ్మల్ని అభిషేకించి, మీ తోటివారి కన్నా మిమ్మల్ని ఉన్నతస్థితికి హెచ్చించారు.

8 మీరు ధరించిన వస్త్రాలన్ని గోపరసం, అగరు, లవంగపట్ట సుగంధంతో గుభాళిస్తున్నాయి. దంతం చేత అలంకరించబడిన భవనాలలో నుండి తంతి వాయిద్యాలు మోగుతూ ఉంటే మీకెంతో ఆనందము.

9 ఘనత వహించిన స్త్రీలలో రాజుల కుమార్తెలున్నారు. ఓఫీరు దేశపు సువర్ణాభరణాలతో అలంకరించుకుని రాణి మీ కుడి ప్రక్కన నిలిచి ఉంది.

10 కుమారీ, విను, శ్రద్ధగా ఈ మాటలు విను: నీ సొంత ప్రజలను నీ పుట్టింటిని మరచిపో.

11 రాజు నీ అందానికి పరవశించును గాక; ఆయన నీ ప్రభువు, ఆయనను ఘనపరచు.

12 తూరు నగర కుమారి కానుకలతో మీ దగ్గరకు వస్తుంది, ధనికులు మీ దయ కోసం చూస్తారు.

13 అంతఃపురంలో రాజకుమారి వైభవంలో నిండుతనం ఉంది. ఆమె ధరించిన ఖరీదైన వస్త్రాలు బంగారంతో బుట్టా వేసినవి.

14 అందమైన కుట్టుపని చేసిన వస్త్రాలు ఆమె ధరించింది. ఆమెను రాజు దగ్గరకు తీసుకువస్తారు; ఆమె వెంట చెలికత్తెలు కన్యలు వస్తారు.

15 వారిని ఆనందోత్సాహాలతో తీసుకురాగా, వారు రాజభవనంలో ప్రవేశిస్తారు.

16 నీ కుమారులు నీ పూర్వికుల స్థానాన్ని తీసుకుంటారు; వారిని దేశమంతట అధికారులుగా నియమిస్తావు.

17 నీ నామం తరతరాలు జ్ఞాపకం ఉండేలా చేస్తాను; ఈ కారణంగా జనములు నిత్యం నీకు కృతజ్ఞతలు చెప్తారు.

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం™

ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

Biblica® Open Telugu Contemporary Version™

Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

Biblica, Inc.
Lean sinn:



Sanasan