Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

కీర్తన 31 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం


కీర్తన 31
ప్రధాన గాయకునికి. దావీదు కీర్తన.

1 యెహోవా, నేను మీలో ఆశ్రయం పొందాను; నన్ను ఎప్పటికీ సిగ్గుపడనీయకండి; మీ నీతిని బట్టి నన్ను విడిపించండి.

2 మీరు నా వైపు చెవియొగ్గి, నన్ను విడిపించడానికి త్వరగా రండి; నా ఆశ్రయదుర్గమై, బలమైన కోటవై నన్ను కాపాడండి.

3 మీరు నా కొండ, నా కోట; మీ నామాన్ని బట్టి నన్ను నడిపించండి.

4 నా కోసం ఏర్పాటు చేయబడిన ఉచ్చులో పడకుండ నన్ను తప్పించండి, ఎందుకంటే మీరు నా ఆశ్రయమై ఉన్నారు.

5 మీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నాను. యెహోవా నా నమ్మకమైన దేవా, నన్ను విడిపించండి.

6 విగ్రహాలను వెంబడించే వారిని నేను అసహ్యించుకుంటాను; నేనైతే యెహోవాలో నమ్మకముంచాను.

7 మీ మారని ప్రేమలో నేను ఆనందించి సంతోషిస్తాను, నా బాధను మీరు చూశారు నా వేదన మీకు తెలుసు.

8 మీరు నన్ను శత్రువుల చేతికి అప్పగించలేదు నా పాదాలను విశాలమైన స్థలంలో ఉంచారు.

9 యెహోవా, నేను బాధలో ఉన్నాను నన్ను కరుణించండి; నా కళ్లు విచారంతో బలహీనం అవుతున్నాయి, నా ప్రాణం దేహం దుఃఖంతో క్షీణిస్తున్నాయి.

10 నా బ్రతుకు వేదనలో గడుస్తుంది నిట్టూర్పులతో నా సంవత్సరాలు గతించిపోతున్నాయి. నా పాపాన్ని బట్టి నా బలమంతా హరించుకు పోతోంది, నా ఎముకల్లో సత్తువలేదు.

11 నా శత్రువులందరి కారణంగా పొరుగువారు నన్ను ఎగతాళి చేస్తున్నారు నన్ను చూసి నా స్నేహితులు భయపడుతున్నారు వీధిలో నన్ను చూసేవారు నా నుండి పారిపోతున్నారు.

12 చనిపోయిన వాడిగా నన్ను మరచిపోయారు; నేను పగిలిన కుండలా అయ్యాను.

13 అనేకమంది గుసగుసలాడడం నేను విన్నాను, “అన్నివైపులా భయమే!” నామీద వారు దురాలోచన చేస్తున్నారు నా ప్రాణం తీయాలని కుట్ర పన్నుతున్నారు.

14 కాని యెహోవా, నేను మిమ్మల్ని నమ్ముతాను; “మీరే నా దేవుడు” అని నేను చెప్తాను.

15 నా బ్రతుకంతా మీ చేతిలోనే ఉంది; నన్ను వెంటాడే వారి నుండి, నా శత్రువుల చేతుల్లో నుండి నన్ను విడిపించండి.

16 మీ దాసుని మీద మీ ముఖకాంతిని ప్రకాశించనీయండి; మీ మారని ప్రేమతో నన్ను రక్షించండి.

17 యెహోవా, నేను మీకు మొరపెట్టాను, నన్ను సిగ్గుపడనీయకండి; అయితే దుష్టులు అవమానపరచబడాలి వారు పాతాళంలో మౌనంగా ఉండాలి.

18 అహంకారంతో ధిక్కారంతో గర్వంతో నీతిమంతులను దూషించే వారి అబద్ధపు పెదవులు మూయబడాలి.

19 మీకు భయపడేవారి కోసం మీరు దాచి ఉంచిన మేలు ఎంత గొప్పది! మీలో ఆశ్రయం పొందినవారికి మనుష్యులందరు చూస్తుండగా, మీరు ఇచ్చిన సమృద్ధి ఎంత గొప్పది!

20 మనుష్యుల కుట్రలకు గురికాకుండ మీ సన్నిధి గుడారంలో వారిని దాచిపెడతారు; నిందించే నాలుకల నుండి తప్పించి వారిని మీ నివాసంలో భద్రంగా ఉంచుతారు.

21 యెహోవాకు స్తుతి, ఎందుకంటే ముట్టడించబడిన పట్టణంలో నేను ఉన్నప్పుడు తన మార్పుచెందని ప్రేమలోని అద్భుతాలను ఆయన నాకు చూపించారు.

22 “మీ దృష్టి నుండి తొలగించబడ్డాను” అని నేను ఆందోళన చెందాను. సాయం చేయమనే ప్రాధేయపడి వేడుకున్నప్పుడు నా విన్నపాన్ని విన్నారు.

23 యెహోవా భక్తులారా, ఆయనను ప్రేమించండి. యెహోవాను నమ్మినవారిని ఆయన కాపాడతారు. గర్విష్ఠులకు గొప్ప ప్రతీకారం చేస్తారు.

24 యెహోవాలో నిరీక్షించే ప్రజలారా! నిబ్బరం కలిగి, ధైర్యంగా ఉండండి.

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం™

ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

Biblica® Open Telugu Contemporary Version™

Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

Biblica, Inc.
Lean sinn:



Sanasan