కీర్తన 30 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదంకీర్తన 30 దేవాలయ ప్రతిష్ఠ కొరకైన పాట; దావీదు కీర్తన. 1 యెహోవా, నేను మిమ్మల్ని ఘనపరుస్తాను, ఎందుకంటే నా శత్రువులు నాపై విజయం సాధించకుండ మీరు నన్ను పైకి లేవనెత్తారు. 2 యెహోవా, నా దేవా, సహాయం కోసం నేను మీకు మొరపెట్టగా, మీరు నన్ను స్వస్థపరిచారు. 3 యెహోవా, పాతాళం నుండి నా ప్రాణానికి పైకి లేవనెత్తారు; సమాధిలోనికి వెళ్లకుండా నన్ను కాపాడారు. 4 యెహోవా భక్తులారా, ఆయనను కీర్తించండి; ఆయన పరిశుద్ధ నామాన్ని స్తుతించండి. 5 ఆయన కోపం క్షణికం, కాని ఆయన దయ జీవితాంతం వరకు ఉంటుంది; రాత్రంతా దుఃఖం ఉన్నప్పటికీ, ఉదయాన్నే ఆనంద కలుగుతుంది. 6 నేను క్షేమంగా ఉన్నప్పుడు, “నేను ఎప్పటికీ కదల్చబడను” అని అన్నాను. 7 యెహోవా, మీ దయతో నన్ను పర్వతంలా స్థిరపరిచారు. కాని మీరు మీ ముఖాన్ని దాచినప్పుడు నేను కలవరపడ్డాను. 8 యెహోవా నేను మీకు మొరపెట్టాను; ప్రభువా కరుణ కోసం నేను మీకు మొరపెట్టాను: 9 “నేను నా రక్తాన్ని కార్చితే ఏమి లాభం? సమాధిలోనికి వెళ్తే ఏమి లాభం? మట్టి మిమ్మల్ని స్తుతిస్తుందా? అది మీ నమ్మకత్వాన్ని ప్రకటిస్తుందా? 10 యెహోవా! ఆలకించండి కరుణించండి. యెహోవా, నాకు సహాయంగా ఉండండి.” 11 మీరు నా దుఃఖాన్ని నాట్యంగా మార్చారు; మీరు నా గోనెపట్టను తీసివేసి ఆనంద వస్త్రాన్ని తొడిగించారు. 12 నా హృదయం మౌనంగా ఉండక మీకు స్తుతులు పాడుతుంది. యెహోవా, నా దేవా, నేను మిమ్మల్ని ఎల్లప్పుడు స్తుతిస్తాను. |
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం™
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Biblica® Open Telugu Contemporary Version™
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Biblica, Inc.