కీర్తన 19 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదంకీర్తన 19 సంగీత దర్శకునికి. దావీదు కీర్తన. 1 ఆకాశాలు దేవుని మహిమను ప్రకటిస్తున్నాయి; అంతరిక్షం ఆయన చేతిపనిని చాటుతుంది. 2 పగటికి పగలు బోధ చేస్తుంది; రాత్రికి రాత్రి జ్ఞానాన్ని వెల్లడి చేస్తుంది. 3 వాటికి భాష లేదు, వాటికి మాటలు లేవు; వాటి స్వరం వినబడదు. 4 అయినా వాటి స్వరం భూమి అంతటికి, వాటి మాటలు భూదిగంతాలకు వెళ్తాయి. దేవుడు ఆకాశంలో సూర్యునికి డేరా వేశారు. 5 సూర్యుడు తన మంటపంలో నుండి బయటకు వస్తున్న పెండ్లికుమారునిలా, తన పందెం పరుగెత్తడంలో ఆనందిస్తున్న వీరునిలా వస్తున్నాడు. 6 ఆకాశంలో ఒక చివర ఉదయించి మరొక చివర వరకు దాని చుట్టూ తిరిగి వస్తాడు. దాని వేడిని ఏదీ తప్పించుకోలేదు. 7 యెహోవా ధర్మశాస్త్రం యథార్థమైనది, అది ప్రాణాన్ని తెప్పరిల్లజేస్తుంది. యెహోవా కట్టడలు నమ్మదగినవి, అవి సామాన్యులకు జ్ఞానాన్ని ఇస్తాయి. 8 యెహోవా కట్టడలు సరియైనవి, హృదయానికి ఆనందం కలిగిస్తాయి. యెహోవా ఆజ్ఞలు ప్రకాశవంతమైనవి, కళ్లకు కాంతి కలిగిస్తాయి. 9 యెహోవా పట్ల భయం స్వచ్ఛమైనది, నిరంతరం నిలుస్తుంది. యెహోవా శాసనాలు నమ్మదగినవి, అవన్నీ నీతియుక్తమైనవి. 10 అవి బంగారం కంటే, మేలిమి బంగారం కంటే విలువైనవి; తేనె కంటే, తేనెపట్టు నుండి వచ్చే ధారల కంటే మధురమైనవి. 11 వాటి వల్ల మీ సేవకుడు హెచ్చరిక పొందుతాడు; వాటిని పాటించడం వలన గొప్ప బహుమానం దొరుకుతుంది. 12 తమ తప్పిదాలను ఎవరు తెలుసుకోగలరు? నేను దాచిన తప్పులను క్షమించండి. 13 కావాలని చేసే పాపాల నుండి మీ సేవకున్ని తప్పించండి; అవి నా మీద పెత్తనం చేయకుండా అరికట్టండి. అప్పుడు నేను యథార్థవంతుడనై ఘోరమైన అతిక్రమాలు చేయకుండ నిర్దోషిగా ఉంటాను. 14 యెహోవా, నా కొండ, నా విమోచకా, నా నోటి మాటలు, నా హృదయ ధ్యానం మీ దృష్టికి అంగీకారంగా ఉండును గాక. |
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం™
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Biblica® Open Telugu Contemporary Version™
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Biblica, Inc.