Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

కీర్తన 118 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం


కీర్తన 118

1 యెహోవా మంచివాడు, ఆయనకు కృతజ్ఞతలు చెల్లించండి; ఆయన మారని ప్రేమ నిరంతరం ఉంటుంది.

2 “ఆయన మారని ప్రేమ నిరంతరం ఉంటుంది” అని ఇశ్రాయేలీయులు చెప్పుదురు గాక.

3 “ఆయన మారని ప్రేమ నిరంతరం ఉంటుంది” అని అహరోను వంశం చెప్పుదురు గాక.

4 “ఆయన మారని ప్రేమ నిరంతరం ఉంటుంది” అని యెహోవాకు భయపడేవారు చెప్పుదురు గాక.

5 నేను ఇరుకులో ఉండి యెహోవాకు మొరపెట్టాను; ఆయన నాకు జవాబిచ్చి నన్ను విశాల స్థలంలోకి తెచ్చారు.

6 యెహోవా నా పక్షాన ఉన్నారు; నేను భయపడను. నరమాత్రులు నన్నేమి చేయగలరు?

7 యెహోవా నా పక్షాన ఉన్నారు; ఆయన నా సహాయకుడు. నా శత్రువుల వైపు నేను విజయం పొందినవానిగా చూస్తాను.

8 మనుష్యులను నమ్మడం కంటే యెహోవాను ఆశ్రయించడం మంచిది.

9 రాజులను నమ్మడం కంటే యెహోవాను ఆశ్రయించడం మంచిది.

10 దేశాలన్నీ నన్ను చుట్టుముట్టాయి, కాని యెహోవా పేరట నేను వారిని ఛేదించాను.

11 వారు ప్రతి వైపు నుండి నన్ను చుట్టుముట్టారు, కాని యెహోవా పేరట నేను వారిని ఛేదించాను.

12 వారు కందిరీగల్లా నా చుట్టూ తిరిగారు, కాని మండుతున్న ముళ్ళపొదల్లా వారు త్వరగా కాలిపోయారు; యెహోవా పేరట నేను వారిని ఛేదించాను.

13 శత్రువు నన్ను బలంగా గెంటివేశాడు, నేను పడిపోయి ఉండే వాడినే కాని యెహోవా నాకు సహాయం చేశారు.

14 యెహోవా నా శక్తి, నా బలం; ఆయనే నా రక్షణ అయ్యారు.

15 నీతిమంతుల గుడారాల్లో రక్షణానంద కేకలు ప్రతిధ్వనిస్తాయి: “యెహోవా కుడి హస్తం పరాక్రమమైన వాటిని చేసింది!

16 యెహోవా కుడి హస్తం పైకి ఎత్తబడింది; యెహోవా కుడి హస్తం పరాక్రమమైన వాటిని చేసింది!”

17 నేను చావను కాని బ్రతికి ఉండి, యెహోవా చేసిన దానిని ప్రకటిస్తాను.

18 యెహోవా నన్ను తీవ్రంగా శిక్షించారు, కాని ఆయన నన్ను చావుకు అప్పగించలేదు.

19 నా కొరకు నీతిమంతుల గుమ్మాలను తెరవండి; నేను లోపలికి ప్రవేశించి యెహోవాకు కృతజ్ఞతలు చెల్లిస్తాను.

20 ఇది యెహోవా గుమ్మం నీతిమంతులు దీని గుండా ప్రవేశిస్తారు.

21 మీరు నాకు జవాబిచ్చారు, కాబట్టి నేను మీకు కృతజ్ఞతలు చెల్లిస్తాను; మీరు నాకు రక్షణ అయ్యారు.

22 ఇల్లు కట్టేవారు నిషేధించిన రాయి మూలరాయి అయ్యింది;

23 ఇది యెహోవా చేశారు, ఇది మా కళ్లకు ఆశ్చర్యంగా ఉంది.

24 ఇది యెహోవా చేసిన దినం ఈ దినం మనం ఉత్సహించి ఆనందిద్దాము.

25 యెహోవా, మమ్మల్ని రక్షించండి! యెహోవా, మాకు విజయం ప్రసాదించండి!

26 యెహోవా పేరట వచ్చేవాడు స్తుతింపబడును గాక! యెహోవా మందిరం నుండి మేము మిమ్మల్ని దీవిస్తాము.

27 యెహోవాయే దేవుడు, ఆయన తన వెలుగును మనమీద ప్రకాశింపజేశారు. త్రాళ్లతో అర్పణను బలిపీఠం కొమ్ములకు కట్టెయ్యండి.

28 మీరు నా దేవుడు, నేను మిమ్మల్ని స్తుతిస్తాను; మీరు నా దేవుడు, నేను మిమ్మల్ని హెచ్చిస్తాను.

29 యెహోవా మంచివాడు, ఆయనకు కృతజ్ఞతలు చెల్లించండి; ఆయన మారని ప్రేమ నిరంతరం ఉంటుంది.

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం™

ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

Biblica® Open Telugu Contemporary Version™

Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

Biblica, Inc.
Lean sinn:



Sanasan