Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

సామెతలు 23 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం


సూక్తి 7

1 మీరు ఒక పాలకుడితో భోజనం చేయడానికి కూర్చున్నప్పుడు, మీ ముందు ఉన్న దాన్ని బాగా గమనించండి.

2 నీవు తిండిబోతువైన ఎడల నీ గొంతుకు కత్తి పెట్టుకో.

3 అతని రుచిగల పదార్థాలకు ఆశపడకు, అవి మోసగించే ఆహారపదార్థాలు.


సూక్తి 8

4 సంపదను పొందడానికి ప్రయాసపడకండి; నీ స్వంత తెలివిని నమ్ముకోవద్దు.

5 కనురెప్పపాటులో ధనం కనుమరుగవుతుంది, ఎందుకంటే అది రెక్కలు ధరించి గ్రద్దలా ఆకాశానికి ఎగిరిపోతుంది.


సూక్తి 9

6 ఎదుటివాని అభివృద్ధి చూసి పిసినారి వానితో కలిసి భోజనము చేయకండి, అతని రుచిగల పదార్థాలకు ఆశపడవద్దు,

7 ఎందుకంటే అట్టి వాడు తన హృదయంలో ఎప్పుడూ ఖరీదు గురించి ఆలోచిస్తాడు. “తినండి త్రాగండి” అని అతడు నీతో చెప్తాడు, కాని అది అతని హృదయంలోనుండి వచ్చుమాట కాదు.

8 నీవు తినిన కొంచెము కక్కివేస్తావు నీవు పలికిన అభినందనలు వృధా అవుతాయి.


సూక్తి 10

9 బుద్ధిహీనులతో మాట్లాడకండి, ఎందుకంటే వారు మీ వివేకవంతమైన మాటలను ఎగతాళి చేస్తారు.


సూక్తి 11

10 పురాతన సరిహద్దు రాయిని కదిలించవద్దు తండ్రిలేనివారి పొలములోనికి చొరబడవద్దు,

11 ఎందుకంటే వారిని కాపాడేవాడు బలవంతుడు; నీకు వ్యతిరేకంగా ఆయన వారి పక్షంగా నీతో పోరాడతారు.


సూక్తి 12

12 ఉపదేశానికి నీ హృదయాన్ని తెలివిగల మాటలకు నీ చెవులను అప్పగించు.


సూక్తి 13

13 నీ పిల్లలకు క్రమశిక్షణ నేర్పడం మానకుము; ఒకవేళ బెత్తముతో వాని కొట్టినా వారు చావరు.

14 బెత్తముతో వాని శిక్షించి చావు నుండి వారిని కాపాడండి.


సూక్తి 14

15 నా కుమారుడా, నీ హృదయం జ్ఞానం కలిగి ఉంటే, అప్పుడు నా హృదయం సంతోషిస్తుంది;

16 నీ పెదవులు సరియైనది మాట్లాడినప్పుడు, నా అంతరింద్రియం సంతోషిస్తుంది.


సూక్తి 15

17 పాపులను చూసి నీ హృదయాన్ని అసూయపడనీయకు, కాని ఎల్లప్పుడు యెహోవాయందలి భయం పట్ల ఆసక్తి కలిగి ఉండు.

18 నిజంగా నీకు భవిష్యత్ నిరీక్షణ ఉన్నది, నీ నిరీక్షణ తొలగించబడదు.


సూక్తి 16

19 నా కుమారుడా, ఆలకించి జ్ఞానిగా ఉండు నీ హృదయాన్ని సరియైన మార్గంలో నిలుపుకో.

20 అతిగా ద్రాక్షరసం త్రాగువారితోనైను, మాంసం ఎక్కువగా తినే వారితోనైను స్నేహము చేయవద్దు.

21 ఎందుకంటే త్రాగుబోతులు తిండిబోతులు దరిద్రులౌతారు, మగత వారిని దుప్పట్లలో వస్త్రాల్లా ధరిస్తుంది.


సూక్తి 17

22 నీకు జీవితాన్నిచ్చిన, నీ తండ్రి మాటను ఆలకించు, నీ తల్లి ముసలితనంలో ఆమెను నిర్లక్ష్యం చేయకు.

23 సత్యాన్ని కొనుక్కో దాన్ని అమ్మకు జ్ఞానాన్ని, బోధను, అంతరార్థాన్ని కూడా కొని ఉంచుకో.

24 నీతిమంతులైన పిల్లల తండ్రికి గొప్ప ఆనందం; జ్ఞానం గలవానికి తండ్రిగా ఉన్నవాడు వాని వలన సంతోషిస్తాడు.

25 నీ తల్లిదండ్రులు సంతోషించుదురు గాక; నిన్ను కనిన తల్లి ఆనందంగా ఉండును గాక!


సూక్తి 18

26 నా కుమారుడా, నీ హృదయాన్ని నాకివ్వు నీ కళ్లు నా మార్గాలను అనుసరించుట యందు ఆనందించును గాక,

27 ఎందుకంటే ఒక వ్యభిచార స్త్రీ ఒక లోతైన గుంట, దారితప్పిన భార్య ఇరుకైన బావి.

28 బందిపోటులా అది పొంచి ఉంటుంది అది అనేకమంది మనుష్యులను నమ్మకద్రోహులుగా చేస్తుంది.


సూక్తి 19

29 ఎవరికి శ్రమ ఉంది? ఎవరికి దుఃఖం ఉంది? ఎవరికి కలహాలు ఉన్నాయి? ఎవరికి ఫిర్యాదులు ఉన్నాయి? ఎవరికి అవసరంలేని గాయాలు? ఎవరి కళ్లు ఎర్రబడి ఉన్నాయి?

30 మద్యంతో ప్రొద్దుపుచ్చేవారు, నమూనా మద్యమాల మిశ్రమాలను రుచిచూడడానికి వెళ్లేవారు.

31 మద్యం ఎర్రగా ఉన్నప్పుడు, గిన్నెలో తళతళలాడుతూ, గొంతులో పడగానే మంచిగా అనిపిస్తుందేమో అయినా దానివైపు చూడవద్దు!

32 అంతంలో అది పాములా కరుస్తుంది కట్లపాములా విషం చిమ్ముతుంది.

33 నీ కళ్లు వింత దృశ్యాలను చూస్తాయి, నీ మనస్సు గందరగోళమైన వాటిని ఊహిస్తుంది.

34 నీవు నడిసముద్రంలో పడుకునేవానిలా ఉంటావు. స్తంభాన్ని పట్టుకుని ఉన్నావు.

35 “వారు నన్ను కొట్టారు, కాని గాయం కాలేదు! వారు నన్ను కొట్టారు, కాని నాకు తెలియలేదు! మరి కాస్త మద్యం త్రాగడానికి నేనెప్పుడు నిద్ర లేస్తాను?”

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం™

ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

Biblica® Open Telugu Contemporary Version™

Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

Biblica, Inc.
Lean sinn:



Sanasan