సామెతలు 2 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదంజ్ఞానం యొక్క నైతిక ప్రయోజనాలు 1 నా కుమారుడా, నీవు నా మాటలను విని నా ఆజ్ఞలను నీలో దాచుకొంటే, 2 జ్ఞానం వైపు నీవు చెవిపెట్టి, హృదయపూర్వకంగా అవగాహన చేసుకోవాలి. 3 నీవు అంతరార్థం కోసం మొరపెడితే, వివేచనకై బిగ్గరగా మనవి చేస్తే, 4 వెండిని వెదికినట్లు దానిని వెదికితే, దాచబడిన నిధులను వెదికినట్లు దానిని వెదికితే, 5 యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండడం గురించి నీవు తెలుసుకుంటావు, దేవుని తెలివిని కనుగొంటావు. 6 ఎందుకంటే యెహోవాయే జ్ఞానాన్ని ప్రసాదించేవాడు; తెలివి వివేచన ఆయన నోట నుండే వస్తాయి. 7 యథార్థవంతులకు విజయం దాచి ఉంచేది ఆయనే, నిందారహితులుగా నడుచుకొనే వారికి ఆయనే డాలు. 8 ఎందుకంటే న్యాయం యొక్క కాలగతులు కాపాడేది ఆయనే, తన నమ్మకమైన వారిని కాపాడేది ఆయనే. 9 అప్పుడు నీవు నీతిన్యాయాలను యథార్థతను, ప్రతి మంచి మార్గాన్ని గ్రహిస్తావు. 10 జ్ఞానం నీ హృదయంలోకి వస్తుంది, తెలివి నీ ప్రాణానికి సంతోషాన్ని కలిగిస్తుంది. 11 బుద్ధి నిన్ను కాపాడుతుంది, వివేకం నీకు కావలి కాస్తుంది. 12 దుష్టుల చెడు మార్గాల నుండి, మూర్ఖంగా మాట్లాడేవారి నుండి జ్ఞానం నిన్ను కాపాడుతుంది. 13 అలాంటివారు చీకటిదారిలో నడవడానికి, తిన్నని మార్గాలను విడిచిపెడతారు. 14 చెడు చేయడంలో సంతోషిస్తారు, దుర్మార్గుల మూర్ఖత్వాన్ని బట్టి ఆనందిస్తారు. 15 వారి త్రోవలు సరియైనవి కావు వారు వంచనతో ఆలోచిస్తారు. 16 జ్ఞానం నిన్ను వ్యభిచార స్త్రీ నుండి, మోహపు మాట్లాడే దారితప్పిన స్త్రీ నుండి కాపాడుతుంది. 17 అలాంటి స్త్రీ తన యవ్వన కాలపు భర్తను విడిచిపెట్టి దేవుని ఎదుట తాను చేసిన ప్రమాణాన్ని నిర్లక్ష్యం చేస్తుంది. 18 ఖచ్చితంగా దాని ఇల్లు మరణం దగ్గరకు నడిపిస్తుంది, దాని త్రోవలు చనిపోయినవారి దగ్గరకు దారితీస్తాయి. 19 ఆ స్త్రీ దగ్గరకు వెళ్లిన ఎవరూ తిరిగి రారు జీవమార్గాలను వారు చేరుకోలేరు. 20 కాబట్టి నీవు మంచి మార్గాల్లో నడుచుకోవాలి, నీతిమంతుల ప్రవర్తనను అనుసరించాలి. 21 యథార్థవంతులు దేశంలో నివసిస్తారు, ఏ తప్పుచేయని వారే దానిలో నిలిచి ఉంటారు. 22 కాని దుర్మార్గులు దేశం నుండి తొలగించబడతారు ద్రోహులు దాని నుండి నిర్మూలం చేయబడతారు. |
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం™
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Biblica® Open Telugu Contemporary Version™
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Biblica, Inc.