Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

సామెతలు 16 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

1 హృదయ ప్రణాళికల మనుష్యులకు చెందినవి, కాని నాలుక యొక్క సరియైన జవాబు యెహోవా నుండి వస్తుంది.

2 ఒక వ్యక్తి యొక్క అన్ని మార్గాలు వారికి సరియైనవిగా కనిపిస్తాయి, అయితే ఉద్దేశాలు తూకం వేయబడతాయి.

3 మీ పనులను యెహోవాకు అప్పగించండి, మీ ప్రణాళికలు స్థిరపరచబడతాయి.

4 యెహోవా ప్రతిదీ దాని దాని పని కోసం కలుగజేశారు నాశన దినానికి ఆయన భక్తిలేని వారిని కలుగజేశారు.

5 గర్వ హృదయులందరిని యెహోవా అసహ్యించుకుంటారు. ఇది నిశ్చయం: వారు శిక్షింపబడకపోరు.

6 ప్రేమ, నమ్మకత్వం వలన పాపానికి ప్రాయశ్చిత్తం కలుగుతుంది; యెహోవాయందలి భయం వలన కీడు తొలగిపోతుంది.

7 ఒక వ్యక్తి మార్గాలు యెహోవాకు నచ్చినప్పుడు, అతడు వాని శత్రువులను వానితో సమాధానపరుస్తారు.

8 అన్యాయం చేత కలిగిన గొప్ప రాబడి కంటే, నీతితో కూడిన కొంచెము మేలు.

9 మనుష్యులు తాము చేయబోయేది తమ హృదయాల్లో ఆలోచిస్తారు, యెహోవా వారి అడుగులను స్ధిరపరుస్తారు.

10 రాజు పెదవులు దైవ వాక్కులా మాట్లాడతాయి, అతని నోరు న్యాయ ద్రోహం చేయదు.

11 న్యాయమైన త్రాసు, తూనిక రాళ్లు యెహోవా ఏర్పాట్లు, సంచిలోని గుండ్లన్నియు ఆయన నియమించారు.

12 రాజులు చెడ్డపనులు చేయడాన్ని అసహ్యించుకుంటారు, నీతి వలన సింహాసనం స్ధిరపరచబడుతుంది.

13 రాజులు నిజాయితీగల పెదవులను ఇష్టపడతారు, యథార్థంగా మాట్లాడేవారికి వారు విలువనిస్తారు.

14 రాజు ఆగ్రహం మరణ దూత వంటిది, అయితే జ్ఞానులు దాన్ని శాంతింపజేస్తారు.

15 రాజుల ముఖకాంతి వలన జీవం కలుగుతుంది, వారి దయ వసంత రుతువులో వర్షం మేఘం లాంటిది.

16 బంగారం కంటే జ్ఞానాన్ని సంపాదించడం, వెండి కంటే తెలివిని సంపాదించడం ఎంత మేలు!

17 యథార్థవంతుల రాజమార్గం చెడును తప్పిస్తుంది; తమ మార్గాలను కాపాడుకునేవారు తమ ప్రాణాలను కాపాడుకుంటారు.

18 నాశనానికి ముందు గర్వం, పతనానికి ముందు అహంకారం వెళ్తాయి.

19 గర్విష్ఠులతో దోపుడుసొమ్ము పంచుకోవడం కంటే, అణచివేయబడిన వారితో పాటు దీనులుగా ఉండడం మేలు.

20 ఉపదేశాన్ని పాటించేలా జాగ్రత్తవహించేవాడు వర్ధిల్లుతాడు, యెహోవాను నమ్ముకునేవాడు ధన్యుడు.

21 జ్ఞానంగల హృదయం గలవారు వివేకులు అని పిలువబడతారు, దయగల మాటలు ఒప్పింపజేస్తాయి.

22 వివేకికి వాని వివేకం ఒక జీవపుఊట, కానీ మూర్ఖులకు మూర్ఖత్వం శిక్షను తెస్తుంది.

23 జ్ఞానుని హృదయం వాని నోటికి తెలివి కలిగిస్తుంది, వాని పెదవులకు విద్య ఎక్కువయేలా చేస్తుంది.

24 దయ గల మాటలు తేనెతెట్టె వంటివి, అవి ప్రాణానికి తియ్యనివి ఎముకలకు ఆరోగ్యకరమైనవి.

25 ఒకని ఎదుట సరియైనదిగా కనబడే ఓ మార్గం ఉంది, అయితే చివరికి అది మరణానికి నడిపిస్తుంది.

26 కష్టం చేసేవారి ఆకలి వానిచేత కష్టం చేయిస్తుంది, వారి ఆకలి వారిని ముందుకు నడిపిస్తుంది.

27 పనికిమాలినవారు కీడును పన్నాగం వేస్తారు, వారి మాటలు మండుతున్న అగ్నిలాంటివి.

28 మూర్ఖులు తగవు రేపుతారు, పుకార్లు సన్నిహితులైన స్నేహితులను వేరు చేస్తాయి.

29 హింసాత్మకమైన వారు వారి పొరుగువారిని ఆశపెడతారు, సరియైనది కాని మార్గంలో వారిని నడిపిస్తారు.

30 తమ కన్ను గీటేవారు కుట్ర పన్నుతున్నారు; తన పెదవులు బిగబట్టేవారు కీడు వైపు మొగ్గు చూపుతారు.

31 నెరసిన వెంట్రుకలు వైభవం కలిగిన కిరీటం, అది నీతి మార్గంలో సాధించబడుతుంది.

32 యుద్ధవీరునికంటే సహనం గలవాడు, పట్టణాన్ని స్వాధీనం చేసుకునేవానికంటే తన మనస్సును అదుపు చేసుకోగలవాడు మేలు.

33 చీట్లు ఒడిలో వేయబడవచ్చు, కాని వాటి నిర్ణయం యెహోవా సొంతము.

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం™

ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

Biblica® Open Telugu Contemporary Version™

Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

Biblica, Inc.
Lean sinn:



Sanasan