సామెతలు 15 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం1 మృదువైన మాట కోపాన్ని చల్లార్చుతుంది, నొప్పించే మాట కోపం రేపుతుంది. 2 జ్ఞానుల నాలుక తెలివితో అలంకరించబడుతుంది, బుద్ధిహీనుని నోరు మూర్ఖత్వాన్ని కుమ్మరిస్తుంది. 3 యెహోవా కళ్లు ప్రతిచోట ఉంటాయి, చెడ్డవారిని మంచివారిని చూస్తూ ఉంటాయి. 4 నెమ్మది గల నాలుక జీవ వృక్షము కాని పనికిమాలిన నాలుక ఆత్మకు భంగము కలుగజేస్తుంది. 5 మూర్ఖుడు తన తండ్రి క్రమశిక్షణను తృణీకరిస్తాడు కాని దిద్దుబాటును స్వీకరించేవాడు వివేకాన్ని కనుపరచుతాడు. 6 నీతిమంతుని ఇంట్లో గొప్ప ధననిధి ఉన్నది, కాని దుష్టుని కలుగు వచ్చుబడి కష్టానికి కారణము. 7 జ్ఞానుల పెదవులు తెలివిని వెదజల్లును బుద్ధిహీనుల హృదయం నిలకడయైనది కాదు. 8 భక్తిలేనివారు అర్పించు బలులు యెహోవాకు అసహ్యం, అయితే యథార్థవంతుల ప్రార్ధన ఆయనకు సంతోషకరము. 9 దుష్టుల మార్గాన్ని యెహోవా అసహ్యించుకుంటారు, నీతిని అనుసరించేవారిని ఆయన ప్రేమిస్తారు. 10 దారితప్పిన వానికి కఠిన శిక్ష కలుగును, గద్దింపును ద్వేషించువారు చావునొందుదురు. 11 మరణం, నాశనం యెహోవాకు కనబడతాయి, ఆయనకు మనుష్యుల హృదయాలు ఇంకా తేటగా కనిపిస్తాయి కదా! 12 ఎగతాళి చేసేవారికి సరిదిద్దేవారంటే ఇష్టముండదు, కాబట్టి జ్ఞానుల దగ్గరకు వెళ్లరు. 13 హృదయంలో ఆనందం ముఖాన్ని వికసింపజేస్తుంది, మనోవేదన ఆత్మను కృంగదీస్తుంది. 14 వివేకంగల హృదయం తెలివిని వెదకుతుంది, కాని బుద్ధిహీనునికి మూర్ఖత్వమే ఆహారము. 15 బాధింపబడుచున్న వారి రోజులన్నీ బాధాకరమే, కాని సంతోష హృదయం గలవారికి ఎప్పుడూ విందే. 16 నెమ్మది లేకుండా ఎక్కువ ధనముండడం కంటే, కొంచెమే కలిగి ఉండి యెహోవాయందు భయం ఉంటే మేలు. 17 ద్వేషం కలిగిన చోట క్రొవ్విన ఎద్దు మాంసం తినడం కంటే, ప్రేమ ఉన్నచోట ఆకుకూరల భోజనం తినడం మేలు. 18 ఉద్రేకంతో కూడిన కోపం తగాదా రేపుతుంది, దీర్ఘశాంతం తగాదాను శాంతింపజేస్తుంది. 19 సోమరి వాని బాట ముండ్లకంచె, యథార్థవంతుల త్రోవ రహదారి. 20 జ్ఞానంగల పిల్లలు తండ్రిని సంతోషపరుస్తారు, కానీ మూర్ఖపు మనుష్యులు తమ తల్లిని తృణీకరిస్తారు. 21 బుద్ధిహీనుని వానికి అవివేకం ఆనందాన్నిస్తుంది, కాని అవగాహన ఉన్నవాడు చక్కగా నడుచుకొనును. 22 ఆలోచనలు చెప్పువారు లేనిచోట తలంపులు వృధాయగును, ఆలోచన చెప్పువారు ఎక్కువ మంది ఉన్న ఎడల తలంపులు బలపడును. 23 సరిగా జవాబునిచ్చిన వానికి దాని వలన సంతోషము కలుగును, సమయానికి తగిన మాట ఎంతో మంచిది. 24 క్రిందనున్న మరణాన్ని తప్పించుకోవాలని, వివేకవంతులను జీవమార్గం పైకి నడిపిస్తుంది. 25 గర్వించువారి ఇల్లు యెహోవా పెరికివేయును, భర్తలేని స్త్రీ పొలిమేరను ఆయన స్ధాపించును. 26 దుష్టుల ఆలోచనలు యెహోవాకు అసహ్యం, దయగల మాటలు ఆయనకు పవిత్రము. 27 అత్యాశ తన ఇంటివారి మీదికి పతనాన్ని తెస్తుంది, లంచాన్ని అసహ్యించుకునేవారు బ్రతుకుతారు. 28 నీతిమంతుల హృదయం సరియైన జవాబివ్వడానికి ప్రయత్నిస్తుంది, భక్తిహీనుల నోరు చెడ్డ మాటలు కుమ్మరిస్తుంది. 29 భక్తిహీనులకు యెహోవా దూరంగా ఉంటారు, నీతిమంతుల ప్రార్ధన ఆయన అంగీకరిస్తారు. 30 సంతోషకరమైన చూపు హృదయానికి ఆనందాన్ని కలిగిస్తుంది, మంచి వార్త ఎముకలకు బలాన్నిస్తుంది. 31 జీవితాన్ని ప్రసాదించే దిద్దుబాటును అంగీకరించేవారు జ్ఞానుల సహవాసంలో ఉంటారు. 32 క్రమశిక్షణను తృణీకరించేవారు తమను తాము తృణీకరిస్తారు, అయితే దిద్దుబాటును అంగీకరించేవారు గ్రహింపు పొందుతారు. 33 యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండడం జ్ఞానం నేర్చుకోడానికి సాధనము ఘనతకు ముందు వినయం ఉంటుంది. |
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం™
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Biblica® Open Telugu Contemporary Version™
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Biblica, Inc.