సామెతలు 12 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం1 శిక్షను ప్రేమించేవాడు జ్ఞానాన్ని ప్రేమించేవాడు, కానీ దిద్దుబాటును అసహ్యించేవాడు మూర్ఖుడు. 2 మంచివారు యెహోవా దయ పొందుతారు, చెడు ఆలోచనలు చేసేవారికి శిక్ష విధిస్తారు. 3 చెడుతనం ద్వారా మనుష్యులు స్ధిరపరచబడరు, అయితే నీతిమంతులు ఎప్పటికిని పెరికివేయబడరు. 4 మంచి భార్య తన భర్తకు కిరీటం వంటిది కానీ అపకీర్తిగల భార్య వాని యెముకల్లో కుళ్ళువంటిది. 5 నీతిమంతుల ఆలోచనలు న్యాయమైనవి దుష్టుల సలహాలు మోసకరమైనవి. 6 దుష్టుల మాటలు ఒక హత్యకు పొంచి ఉన్న వారి లాంటివి, యథార్థవంతుల మాటలు వారిని విడిపిస్తాయి. 7 దుష్టులు చనిపోయి కనుమరుగవుతారు, అయితే నీతిమంతుల ఇల్లు స్థిరంగా నిలుస్తుంది. 8 మనుష్యులు తన వివేకాన్ని బట్టి పొగడబడతాడు, అలాగే వికృతమైన మనస్సు కలవారు తిరస్కరించబడతారు. 9 ఏమీ కాకపోయినా ఏదో గొప్పవానిగా నటిస్తూ ఆహారం కూడా లేని వానికంటె ఏమీ కాని వాడైనా ఒక సేవకుని కలిగి ఉన్నవాడు మేలు. 10 నీతిమంతులు తన పశువులను జాగ్రత్తగా చూసుకుంటారు, కానీ దుష్టులు చేసే అత్యంత జాలిగల పనులు కౄరంగా ఉంటాయి. 11 తమ భూమిలో పని చేసేవారికి ఆహారం సమృద్ధిగా ఉంటుంది, కానీ పగటి కలల వెంటపడేవారికి బుద్ధి ఉండదు. 12 దుష్టులు కీడుచేసేవారి బలమైన కోటను కోరుకుంటారు, అయితే నీతిమంతుల వేరు చిగురిస్తుంది. 13 కీడుచేసేవారు వారి పాపిష్ఠి మాటచేత చిక్కుకుంటారు, నిర్దోషులు ఆపద నుండి తప్పించుకుంటారు. 14 ప్రజలు తాము చెప్పే మాటల వలన మేలు పొందుతారు, ఎవరు చేసిన పనికి వారికే ప్రతిఫలం కలుగుతుంది. 15 మూర్ఖుల దారి వారి దృష్టికి సరియైనదిగా కనబడుతుంది, కాని జ్ఞానులు సలహాలు వింటారు. 16 మూర్ఖులు తమ కోపాన్ని వెంటనే చూపిస్తారు, కాని వివేకంగలవారు తమకు కలిగిన అవమానాన్ని మౌనంగా భరిస్తారు. 17 నమ్మకమైన సాక్షులు న్యాయం మాట్లాడతారు, కాని అబద్ధ సాక్షులు అబద్ధాలు మాట్లాడతారు. 18 నిర్లక్ష్యపు మాటలు ఖడ్గాల్లా గుచ్చుతాయి, కాని జ్ఞానుల నాలుకలు స్వస్థత కలిగిస్తాయి. 19 నిజాయితీగల పెదవులు శాశ్వతంగా ఉంటాయి, అబద్ధాలు మాట్లాడే నాలుక క్షణికమే ఉంటుంది. 20 కీడును కలిగించువారి హృదయంలో మోసము కలదు సమాధానపరచడానికి ఆలోచన చెప్పువారు సంతోషముగా ఉందురు. 21 నీతిమంతులకు ఏ ఆపద రాదు దుష్టులువాని ఇల్లు కీడుతో నిండి ఉంటుంది. 22 అబద్ధాలు మాట్లాడేవారు యెహోవాకు అసహ్యం నమ్మదగినవారు ఆయనకు ఇష్టులు. 23 వివేకంగల మనుష్యులు తమ తెలివిని దాచిపెడతారు కానీ మూర్ఖులు తమ మూర్ఖత్వాన్ని ప్రచారం చేసుకుంటారు. 24 శ్రద్ధగా పని చేసేవారు అధికారులవుతారు కానీ సోమరులు బానిసలవుతారు. 25 ఒకని హృదయంలో దిగులు వానిని క్రుంగిపోయేలా చేస్తుంది, దయ గల మాటలు వానిని సంతోషపెడతాయి. 26 నీతిమంతులు తమ పొరుగువారికి దారి చూపుతారు, కానీ దుష్టుని ప్రవర్తన వానిని దారి తప్పిస్తుంది. 27 సోమరి మనుష్యులు తాము వేటాడిన మాంసాన్ని కాల్చరు, కానీ శ్రద్ధగల వారు తమకు దొరికిన ప్రతీదానిని ఉపయోగిస్తారు. 28 నీతిమంతుల మార్గంలో జీవం ఉంటుంది; ఆ మార్గం మరణానికి దారితీయదు. |
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం™
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Biblica® Open Telugu Contemporary Version™
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Biblica, Inc.