Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

సంఖ్యా 28 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం


అనుదిన అర్పణలు

1 యెహోవా మోషేతో ఇలా అన్నారు,

2 “నీవు ఇశ్రాయేలీయులకు ఈ ఆజ్ఞలిస్తూ వారితో ఇలా చెప్పు: ‘నియమింపబడిన సమయంలో నాకు ఇష్టమైన సువాసనగా ఉండే హోమబలులు అర్పించేలా చూసుకోండి.’

3 నీవు వారికి ఇలా చెప్పు: ‘ఇది మీరు యెహోవాకు సమర్పించాల్సిన హోమబలి: ప్రతిరోజు లోపం లేని ఏడాది గొర్రెపిల్లలు రెండు దహనబలిగా అర్పించాలి.

4 ఒక గొర్రెపిల్లను ఉదయాన, మరొకదాన్ని సూర్యాస్తమయ వేళ అర్పించాలి,

5 దానితో పాటు ఒక ఓమెరు నాణ్యమైన పిండిని, ఒక పావు హిన్ ఒలీవనూనెతో కలిపి భోజనార్పణగా అర్పించాలి.

6 ఇది సీనాయి కొండపై నియమించబడిన క్రమం తప్పకుండ అర్పించే దహనబలి, యెహోవాకు ఇష్టమైన సువాసనగల హోమబలి.

7 దానితో పాటు ఒక పావు హిన్ పులియబెట్టిన పానీయాన్ని పానార్పణగా ప్రతి గొర్రెపిల్లతో పాటు అర్పించాలి. పరిశుద్ధాలయం దగ్గర యెహోవాకు పానార్పణ పోయాలి.

8 సాయంకాలం రెండవ గొర్రెపిల్లతో కలిపి ఉదయకాలం అర్పించినట్లే భోజనార్పణను పానార్పణను అర్పించాలి. ఇది యెహోవాకు ఇష్టమైన సువాసనగల హోమబలి.


సబ్బాతు అర్పణలు

9 “ ‘సబ్బాతు దినాన, లోపం లేని ఒక ఏడాది వయస్సు ఉన్న రెండు గొర్రెపిల్లలను, వాటితో పాటు పానార్పణం, భోజనార్పణగా ఒలీవనూనెతో కలిపిన రెండు ఓమెర్ల నాణ్యమైన పిండి అర్పించాలి.

10 ప్రతి సబ్బాతుకు క్రమం తప్పకుండ అర్పించే దహనబలి, పానార్పణంతో పాటు ఈ దహనబలి కూడా అర్పించాలి.


నెలసరి అర్పణలు

11 “ ‘ప్రతి నెల మొదటి రోజు యెహోవాకు లోపం లేని రెండు కోడెలు, ఒక పొట్టేలు, యేడు ఏడాది మగ గొర్రెపిల్లలు దహనబలిగా అర్పించాలి.

12 ప్రతి కోడెతో పాటు ఒలీవనూనె కలిపిన మూడు ఓమెర్ల నాణ్యమైన పిండితో భోజనార్పణ ఉండాలి; పొట్టేలుతో పాటు, నూనె కలిపిన రెండు ఓమెర్ల నాణ్యమైన పిండి భోజనార్పణగా ఉండాలి;

13 అలాగే ప్రతి గొర్రెపిల్లతో పాటు, నూనె కలిపిన ఒక ఓమెరు నాణ్యమైన పిండిని భోజనార్పణగా సమర్పించాలి. ఇది దహనబలి, యెహోవాకు ఇష్టమైన సువాసన కలిగించే హోమబలి.

14 ప్రతి కోడెతో పాటు పానార్పణగా అర హిన్ ద్రాక్షరసం ఉండాలి; పొట్టేలుతో పాటు, హిన్‌లో మూడవ వంతు ద్రాక్షరసం; ప్రతి గొర్రెపిల్లతో పాటు ఒక పావు హిన్ ద్రాక్షరసం అర్పించాలి. సంవత్సరంలో ప్రతి అమావాస్యకు అర్పించాల్సిన దహనబలి ఇది.

15 క్రమం తప్పకుండ అర్పించే దహనబలి, దాని పానార్పణంతో పాటు, యెహోవాకు పాపపరిహారబలిగా ఒక మేకపోతును అర్పించాలి.


పస్కా

16 “ ‘మొదటి నెల పద్నాలుగవ రోజు యెహోవా యొక్క పస్కా పండుగ ఆచరించాలి.

17 ఆ నెల పదిహేనవ రోజు ఒక పండుగ జరగాలి; ఏడు రోజులు పులియని రొట్టెలు తినాలి.

18 మొదటి రోజు పరిశుద్ధ సభను నిర్వహించాలి, పనులేవీ చేయకూడదు.

19 యెహోవాకు హోమబలిగా లోపం లేని రెండు కోడెలు, ఒక పొట్టేలు, ఏడాది వయస్సున్న ఏడు మగ గొర్రెపిల్లలు దహనబలిగా అర్పించాలి.

20 ప్రతి కోడెతో పాటు ఒలీవనూనెతో కలిపిన మూడు ఓమెర్ల నాణ్యమైన పిండిని భోజనార్పణగా అర్పించాలి; పొట్టేలుతో, రెండు ఓమెర్లు;

21 ఏడు గొర్రెపిల్లలలో ఒక్కో దానితో ఒక్కో ఓమెరు అర్పించాలి.

22 మీ ప్రాయశ్చిత్తం కోసం ఒక మేకపోతును పాపపరిహారబలిగా అర్పించాలి.

23 ఇవన్నీ ప్రతి ఉదయం దహన బలులతో పాటు అర్పించాలి.

24 ఈ విధంగా ఏడు రోజులపాటు యెహోవాకు ఇష్టమైన సువాసనగా ఉండే ఆహార అర్పణను అర్పించాలి; ప్రతిరోజు అర్పించే దహనబలి దాని పానార్పణంతో పాటు దీనిని అర్పించాలి.

25 ఏడవ రోజు పరిశుద్ధ సభను నిర్వహించాలి, జీవనోపాధి కోసమైన పనులేవీ చేయకూడదు.


వారాల పండుగ

26 “ ‘ప్రథమ ఫలాల రోజున, వారాల పండుగలో యెహోవాకు క్రొత్త ధాన్యంతో భోజనార్పణ అర్పించినప్పుడు పరిశుద్ధ సభ ఏర్పాటు చేయాలి, జీవనోపాధి కోసమైన పనులేవీ చేయకూడదు.

27 రెండు కోడెలు, ఒక పొట్టేలు, ఏడు ఏడాది మగ గొర్రెపిల్లలను యెహోవాకు ఇష్టమైన సువాసన కలిగించే దహనబలిగా అర్పించాలి.

28 ప్రతి కోడెతో పాటు భోజనార్పణగా ఒలీవనూనె కలిపిన మూడు ఓమెర్ల నాణ్యమైన పిండి; పొట్టేలుతో రెండు ఓమెర్లు;

29 ఏడు గొర్రెపిల్లలలో ఒక్కో దానితో ఒక్కో ఓమెరు అర్పించాలి.

30 దానితో పాటు ప్రాయశ్చిత్తం కోసం ఒక మేకపోతును అర్పించాలి.

31 దహనబలులు, ఆహార అర్పణలతో పాటు, వీటిని వీటి పానార్పణాలతో కలిపి అర్పించాలి. అర్పణ కోసం తెచ్చే ప్రతి జంతువు లోపం లేనిదై ఉండాలి.

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం™

ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

Biblica® Open Telugu Contemporary Version™

Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

Biblica, Inc.
Lean sinn:



Sanasan