సంఖ్యా 27 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదంసెలోఫెహాదు కుమార్తెలు 1 యోసేపు కుమారుడైన మనష్షే వంశానికి చెందిన మనష్షే కుమారుడైన మాకీరు, అతని కుమారుడు గిలాదు, అతని కుమారుడు హెఫెరు, అతని కుమారుడైన సెలోఫెహాదు కుమార్తెలు. ఆ కుమార్తెల పేర్లు మహ్లా, నోవా, హొగ్లా, మిల్కా, తిర్సా. వీరు ముందుకు వచ్చి 2 సమావేశ గుడార ద్వారం దగ్గర మోషే, యాజకుడైన ఎలియాజరు, నాయకులు సమాజమంతటి ఎదుట నిలబడి, 3 “మా తండ్రి అరణ్యంలో చనిపోయాడు. అతడు యెహోవాకు విరుద్ధంగా తిరుగుబాటు చేసిన కోరహు సమూహంలో లేడు, కానీ తన సొంత పాపాన్ని బట్టి చనిపోయాడు, అతనికి కుమారులు లేరు. 4 కుమారులు లేనందుకు మా తండ్రి పేరు అతని వంశం నుండి తీసివేయబడాలి? మా తండ్రి బంధువుల్లో మాకు స్వాస్థ్యం ఇవ్వండి” అని అన్నారు. 5 మోషే ఈ విషయాన్ని యెహోవా దగ్గరకు తెచ్చాడు, 6 యెహోవా మోషేతో అన్నారు, 7 సెలోఫెహాదు కుమార్తెలు చెప్పేది న్యాయమైనదే. నీవు వారికి తమ తండ్రి బంధువుల్లో వారసత్వంగా స్వాస్థ్యం ఖచ్చితంగా ఇచ్చి వారి తండ్రి వారసత్వాన్ని వారికి ఇవ్వాలి. 8 “ఇశ్రాయేలీయులతో చెప్పు, ‘ఒక మనిషి చనిపోతే, అతనికి కుమారులు లేకపోతే, అతని వారసత్వం అతని కుమార్తెకు ఇవ్వాలి. 9 ఒకవేళ అతనికి కుమార్తెలు లేకపోతే, అతని వారసత్వం అతని సహోదరులకు ఇవ్వాలి. 10 ఒకవేళ సహోదరులు లేకపోతే, వారసత్వం అతని తండ్రి సహోదరులకు ఇవ్వాలి. 11 అతని తండ్రికి సహోదరులు లేకపోతే, తన వారసత్వం సమీప బంధువుకు ఇవ్వాలి, అతడు స్వాస్థ్యంగా పొందుకుంటాడు. ఇది ఇశ్రాయేలీయుల కోసం యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన న్యాయ నియమము.’ ” మోషే తర్వాత నాయకుడు యెహోషువ 12 యెహోవా మోషేతో అన్నారు, “నీవు అబారీము పర్వతం ఎక్కి నేను ఇశ్రాయేలీయులకు ఇచ్చిన దేశాన్ని చూడు. 13 చూసిన తర్వాత, నీవును నీ అన్న అహరోను లాగే చనిపోయి స్వజనుల దగ్గరకు చేరతావు. 14 ఎందుకంటే, సీను ఎడారిలో సమాజం నీళ్ల దగ్గర తిరుగుబాటు చేసినప్పుడు, మీరిద్దరు వారి దృష్టిలో నన్ను పరిశుద్ధునిగా గౌరవించకుండా అవిధేయత చూపారు.” (ఈ నీళ్లు సీను అరణ్యంలో మెరీబా కాదేషు నీళ్లు.) 15 మోషే యెహోవాతో అన్నాడు, 16 “సమస్త జీవులకు శ్వాసనిచ్చే దేవుడైన యెహోవా, ఈ సమాజం మీద ఒక నాయకుని నియమించాలి, 17 అతడు ఈ సమాజం ముందు వెళ్తూ, వస్తూ, వారిని బయటకు లోనికి నడిపిస్తూ ఉండాలి, అప్పుడు యెహోవా ప్రజలైన వీరు కాపరి లేని గొర్రెల్లా ఉండరు.” 18 కాబట్టి యెహోవా మోషేతో అన్నారు, “నూను కుమారుడైన యెహోషువను తీసుకో, అతనిలో నాయకత్వపు ఆత్మ ఉంది, అతని మీద నీ చేయి పెట్టు. 19 యాజకుడైన ఎలియాజరు సమాజమందరి సముఖంలో అతన్ని నిలబెట్టి, అధికార పూర్వకంగా నియమించు. 20 నీ ప్రభావంలో కొంత అతనికి ఇవ్వు, అప్పుడు ఇశ్రాయేలు సమాజమంతా అతనికి లోబడుతుంది. 21 అతన్ని యాజకుడైన ఎలియాజరు ఎదుట నిలబెట్టు, ఎలియాజరు యెహోవా సన్నిధిలో ఊరీముతో సంప్రదించి అతని కోసం చట్టాలు పొందుకోవాలి. అతని ఆజ్ఞమేరకు అతడు, ఇశ్రాయేలు సమాజమంతా బయటకు వెళ్తుంది, అతని ఆజ్ఞమేరకు వారు లోనికి వస్తారు.” 22 యెహోవా ఆజ్ఞమేరకు మోషే చేశాడు. యెహోషువను యాజకుడైన ఎలియాజరు ముందు, సర్వసమాజం ముందు నిలబెట్టాడు. 23 తర్వాత యెహోవా మోషేకు సూచించిన ప్రకారం అతనిపై చేతులుంచి అధికార పూర్వకంగా అతన్ని నియమించాడు. |
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం™
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Biblica® Open Telugu Contemporary Version™
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Biblica, Inc.