Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

సంఖ్యా 17 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం


చిగురించిన అహరోను చేతికర్ర

1 యెహోవా మోషేతో అన్నారు,

2 “ఇశ్రాయేలీయులతో మాట్లాడి వారి పూర్వికుల గోత్రాల ఒక్కొక్క నాయకుడి నుండి ఒకటి చొప్పున కర్రలను తెప్పించు. ప్రతి వ్యక్తి పేరు అతని కర్రపై వ్రాయాలి.

3 లేవీ కర్రపై అహరోను పేరు వ్రాయాలి, ఎందుకంటే ప్రతి పూర్వికుల గోత్ర నాయకునికి ఒక కర్ర ఉండాలి.

4 సమావేశ గుడారంలో నేను మీతో కలిసే నిబంధన మందసం ఎదుట ఈ కర్రలను పెట్టు.

5 నేను ఎన్నుకున్న నాయకుడి కర్ర చిగురిస్తుంది, నీకు విరోధంగా ఇశ్రాయేలీయుల నుండి ఎప్పుడు వచ్చే సణుగుళ్లను ముగిస్తాను.”

6 కాబట్టి మోషే ఇశ్రాయేలీయులతో మాట్లాడాడు, పూర్వికుల వంశాల క్రమం ప్రకారం ఒక్కొక్క నాయకుడు వారి వారి కర్రను, మొత్తం పన్నెండు కర్రలు ఇచ్చారు. వాటిలో అహరోను కర్ర ఉంది.

7 మోషే ఆ కర్రలను నిబంధన గుడారంలో యెహోవా ఎదుట ఉంచాడు.

8 మర్నాడు మోషే నిబంధన గుడారంలోకి వెళ్లి చూడగా, వాటిలో లేవీ వంశ ప్రతినిధి యైన అహరోను కర్ర చిగురించి మొగ్గలు తొడిగి, పూలు పూసి, బాదం పండ్లు వచ్చాయి.

9 మోషే యెహోవా సన్నిధి నుండి ఆ కర్రలన్నీ ఇశ్రాయేలీయులందరి దగ్గరకు తెచ్చాడు. వారు వాటిని చూశారు, ప్రతీ నాయకుడు తన కర్రలను తీసుకున్నారు.

10 యెహోవా మోషేతో, “అహరోను కర్రను తెచ్చి మళ్ళీ నిబంధన మందసం ఎదుట పెట్టు. తిరుగుబాటు చేసినవారికి అది ఒక గుర్తుగా ఉండాలి. నాకు విరోధంగా వారు చేసే సణుగుడుకు ఇది ముగింపు కలిగిస్తుంది, తద్వార వారు చావరు” అని చెప్పారు.

11 యెహోవా తనకు ఆజ్ఞాపించినట్లే మోషే చేశాడు.

12 ఇశ్రాయేలీయులు మోషేతో, “మేము చస్తాము! మేము నశించాము, మేమంతా నశించాము!

13 ఎవరైనా కనీసం యెహోవా యొక్క సమావేశ గుడారం దగ్గరకు వచ్చినా చస్తారు. మేమంతా చస్తామా?” అని అన్నారు.

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం™

ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

Biblica® Open Telugu Contemporary Version™

Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

Biblica, Inc.
Lean sinn:



Sanasan