Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

సంఖ్యా 10 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం


వెండి బూరలు

1 యెహోవా మోషేతో ఇలా చెప్పారు:

2 “సుత్తెతో సాగగొట్టబడిన వెండితో రెండు బూరలు తయారుచేసి, సమాజం కూడుకోడానికి, శిబిరాలు బయలుదేరడాన్ని సూచించడానికి వాటిని వాడాలి.

3 రెండు బూరలు ఒకేసారి మ్రోగితే ఆ శబ్దానికి సమాజమంతా నీ ఎదుట సమావేశ గుడార ద్వారం దగ్గర కూడుకోవాలి.

4 ఒక బూర మాత్రమే మ్రోగితే, నాయకులు అంటే ఇశ్రాయేలు గోత్రాల అధిపతులు నీ ముందు సమకూడాలి.

5 బూరధ్వని వినబడినప్పుడు, తూర్పున ఉన్న గోత్రాలు బయలుదేరాలి.

6 రెండవ ధ్వని వినబడినప్పుడు, దక్షిణాన ఉన్న దండ్లు బయలుదేరాలి. బయలుదేరడానికి ధ్వని ఒక సూచన.

7 సమాజం కూడుకోడానికి, బూరలు ఊదండి, అయితే బయలుదేరడానికి ఊదే విధంగా కాదు.

8 “యాజకులైన అహరోను కుమారులు, బూరలు ఊదాలి. ఇది మీకు రాబోయే తరాలకు నిత్య కట్టుబాటుగా ఉంటుంది.

9 మీ భూమిలో మిమ్మల్ని బాధపరిచే మీ శత్రువులపై యుద్ధం చేయబోతున్నప్పుడు బూరధ్వని చేయాలి. అప్పుడు మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుని మీ శత్రువుల నుండి మిమ్మల్ని విడిపిస్తారు.

10 అంతేకాక మీ సంతోష సమయాల్లో అంటే నియమించబడిన పండుగలు, అమావాస్య వేడుకలప్పుడు మీ దహనబలులు, మీ సమాధాన బలులపై బూరధ్వని చేయండి. అవి మీ దేవుని ఎదుట జ్ఞాపకార్థంగా ఉంటాయి. నేను మీ దేవుడనైన యెహోవానై ఉన్నాను.”


ఇశ్రాయేలీయులు సీనాయిని విడిచివెళ్లడం

11 రెండవ సంవత్సరం రెండవ నెల ఇరవయ్యవ రోజున, మేఘం సాక్షి గుడారం మీది నుండి కదిలింది.

12 ఇశ్రాయేలీయులు సీనాయి అరణ్యం నుండి బయలుదేరి మేఘం పారాను అరణ్యంలో ఆగేవరకు స్థలం నుండి స్థలానికి ప్రయాణించారు.

13 యెహోవా మోషేకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం మొదటిసారిగా, వారు బయలుదేరారు.

14 యూదా శిబిరం యొక్క విభజనలు వారి పతాకాన్ని పట్టుకుని ముందుగా వెళ్లాయి. అమ్మీనాదాబు కుమారుడైన నయస్సోను యూదా గోత్రం వారిని నడిపించాడు.

15 అదే విధంగా సూయరు కుమారుడైన నెతనేలు ఇశ్శాఖారు గోత్రం,

16 ఏలీయాబు కుమారుడైన హేలోను జెబూలూను గోత్రానికి నియమించబడ్డారు.

17 తర్వాత గుడారాన్ని తీసివేశారు, గెర్షోను, మెరారి వంశస్థులు దానిని మోస్తూ బయలుదేరారు.

18 వారి తర్వాత రూబేను శిబిరం వారు వారి సేనల ప్రకారం వెళ్లారు. షెదేయూరు కుమారుడైన ఎలీసూరు రూబేను గోత్ర నాయకుడు సైన్యాధిపతి.

19 సూరీషద్దాయి కుమారుడైన షెలుమీయేలు షిమ్యోను గోత్రం మీద,

20 దెయూవేలు కుమారుడైన ఎలీయాసాపు గాదు గోత్రం మీద నియమించబడ్డారు.

21 తర్వాత కహాతు వంశస్థులు పవిత్ర వస్తువులను మోస్తూ బయలుదేరారు. వీరు తర్వాతి శిబిరాన్ని చేరకముందే సమావేశ గుడారం సిద్ధం చేయబడాలి.

22 వారి తర్వాత ఎఫ్రాయిం శిబిరం వారు వారి సేనల ప్రకారం బయలుదేరారు. అమీహూదు కుమారుడైన ఎలీషామా ఎఫ్రాయిం గోత్ర సైన్యాధిపతి.

23 తర్వాత మనష్షే గోత్రం వారు వెళ్లారు. వారి నాయకుడు పెదాసూరు కుమారుడైన గమలీయేలు,

24 తర్వాత బెన్యామీను గోత్రం వారు వెళ్లారు. వారి నాయకుడు గిద్యోనీ కుమారుడైన అబీదాను సైన్యాధిపతి.

25 చివరకు, అన్ని శిబిరాల వెనుక దాను శిబిరం వారు వారి సేనల ప్రకారం బయలుదేరారు. అమీషద్దాయి కుమారుడైన అహీయెజెరు న్యాయాధిపతి.

26 తర్వాత ఆషేరు గోత్రం వారు వెళ్లారు. వారు నాయకుడు ఒక్రాను కుమారుడైన పగీయేలు.

27 తర్వాత నఫ్తాలి గోత్రం వారు వెళ్లారు. వారి నాయకుడు ఏనాను కుమారుడైన అహీర సైన్యాధిపతి.

28 ఈ క్రమంలో తమ తమ సేనలతో ఇశ్రాయేలు ప్రజలు ప్రయాణం చేశారు.

29 ఒక రోజు మోషే తన మామ మిద్యానీయుడైన రెయూయేలు కుమారుడైన హోబాబుతో, “యెహోవా, ‘నేను మీకు ఇస్తాను’ అని చెప్పిన స్థలానికి వెళ్తున్నాము. నీవు మాతో వచ్చెయ్యి, మేము నిన్ను మంచిగా చూసుకుంటాం, ఎందుకంటే యెహోవా ఇశ్రాయేలుకు మంచి వాటిని వాగ్దానం చేశారు” అని చెప్పాడు.

30 అతడు, “నేను రాను, నా స్వదేశానికి, నా బంధువుల దగ్గరకు తిరిగి వెళ్తున్నాను” అని జవాబిచ్చాడు.

31 అయితే మోషే, “దయచేసి మమ్మల్ని వదిలి వెళ్లకు. ఈ అరణ్యంలో ఎక్కడ దిగాలో నీకు దారి బాగా తెలుసు, నీవు మాకు దారి చూపించగలవు.

32 నీవు కాబట్టి మాతో వస్తే యెహోవా మాకు ఇచ్చే మేలులు నీతో పంచుకుంటాం” అని చెప్పాడు.

33 కాబట్టి వారు యెహోవా పర్వతం నుండి బయలుదేరి మూడు రోజులు ప్రయాణించారు. వారి విశ్రాంతి స్థలం కోసం ఈ మూడు రోజులు యెహోవా నిబంధన మందసం వారికి ముందుగా వెళ్లింది.

34 వారు ప్రయాణం మొదలుపెట్టినప్పుడు యెహోవా మేఘము పగలు వారి మీద ఉంది.

35 మందసం ఎప్పుడు బయలుదేరుతుందో అప్పుడు మోషే బిగ్గరగా, “యెహోవా, లేవండి! మీ శత్రువులు చెదిరిపోవుదురు గాక; మీ ఎదుట నుండి మీ శత్రువులు పారిపోవుదురు గాక” అని అనేవాడు.

36 మందసం ఆగినప్పుడు, అతడు, “యెహోవా, లెక్కలేనంతగా ఉన్న వేలాది ఇశ్రాయేలు ప్రజల దగ్గరకు తిరిగి రండి” అని అనేవాడు.

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం™

ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

Biblica® Open Telugu Contemporary Version™

Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

Biblica, Inc.
Lean sinn:



Sanasan