సంఖ్యా 1 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదంజనాభా లెక్కలు 1 ఇశ్రాయేలీయులు ఈజిప్టు నుండి బయటకు వచ్చిన రెండవ సంవత్సరం రెండవ నెల మొదటి రోజు సీనాయి ఎడారిలో ఉన్న సమావేశ గుడారంలో యెహోవా మోషేతో మాట్లాడారు. ఆయన ఇలా అన్నారు: 2 మొత్తం సమాజంలోని ఇశ్రాయేలీయుల వంశాలు కుటుంబాల ప్రకారం వారి జనాభా లెక్కలు నమోదు చేయి. 3 నీవూ అహరోను కలిసి ఇశ్రాయేలీయులలో ఇరవై సంవత్సరాలు అంతకు పైబడి వయస్సు గలవారు, సైన్యంలో సేవ చేయగలవారిని వారి వారి సేనల ప్రకారం లెక్కించాలి. 4 ప్రతీ గోత్రం నుండి ఒకడు తన కుటుంబానికి పెద్దగా ఉన్న ప్రతీ ఒకడు మీకు సహాయం చేయాలి. 5 “మీకు సహాయం చేయాల్సిన పురుషుల పేర్లు ఇవి: “రూబేను గోత్రం నుండి షెదేయూరు కుమారుడైన ఎలీసూరు; 6 షిమ్యోను గోత్రం నుండి సూరీషద్దాయి కుమారుడైన షెలుమీయేలు; 7 యూదా గోత్రం నుండి అమ్మీనాదాబు కుమారుడైన నయస్సోను; 8 ఇశ్శాఖారు గోత్రం నుండి సూయరు కుమారుడైన నెతనేలు; 9 జెబూలూను గోత్రం నుండి హేలోను కుమారుడైన ఏలీయాబు; 10 యోసేపు కుమారుల నుండి: ఎఫ్రాయిం గోత్రం నుండి అమీహూదు కుమారుడైన ఎలీషామా; మనష్షే గోత్రం నుండి పెదాసూరు కుమారుడైన గమలీయేలు; 11 బెన్యామీను గోత్రం నుండి గిద్యోనీ కుమారుడైన అబీదాను; 12 దాను గోత్రం నుండి అమీషద్దాయి కుమారుడైన అహీయెజెరు; 13 ఆషేరు గోత్రం నుండి ఒక్రాను కుమారుడైన పగీయేలు; 14 గాదు గోత్రం నుండి దెయూవేలు కుమారుడైన ఎలీయాసాపు; 15 నఫ్తాలి గోత్రం నుండి ఏనాను కుమారుడైన అహీర.” 16 వీరు సమాజంలో వారి పితరుల గోత్రాల నుండి నాయకులుగా ఏర్పాటు చేయబడినవారు. వీరు ఇశ్రాయేలీయుల వంశాల పెద్దలు. 17 యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు, మోషే అహరోనులు పేర్లు పేర్కొనబడిన వారిని తీసుకుని, 18 రెండవ నెల మొదటి రోజున సమాజమంతటిని సమావేశ పరిచారు. ప్రజలు వారి వారి గోత్రాలు, వారి వారి కుటుంబాల ప్రకారం తమ వంశాన్ని నమోదు చేసుకున్నారు. యిరవై సంవత్సరాలు అంతకు పైబడి వయస్సున్న వారు ఒకరి తర్వాత ఒకరి పేరు నమోదు చేశారు. 19 యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన ప్రకారం మోషే సీనాయి ఎడారిలో వారిని లెక్కించాడు: 20 ఇశ్రాయేలు మొదటి సంతానమైన రూబేను సంతతివారి నుండి: యిరవై సంవత్సరాలు అంతకన్నా ఎక్కువ వయస్సు ఉండి, సైన్యంలో పని చేయగలిగే పురుషులందరు వారి వంశాలు, వారి కుటుంబాల వంశాల ప్రకారం పేరుపేరున లెక్కించబడ్డారు. 21 రూబేను గోత్రం నుండి లెక్కించబడినవారు 46,500. 22 షిమ్యోను సంతతివారి నుండి: యిరవై సంవత్సరాలు అంతకన్నా ఎక్కువ వయస్సు ఉండి సైన్యంలో పని చేయగలిగే పురుషులందరు వారి వంశాలు, వారి కుటుంబాల వంశాల ప్రకారం పేరుపేరున లెక్కించబడ్డారు. 23 షిమ్యోను గోత్రం నుండి లెక్కించబడినవారు 59,300. 24 గాదు సంతతివారి నుండి: యిరవై సంవత్సరాలు అంతకన్నా ఎక్కువ వయస్సు ఉండి సైన్యంలో పని చేయగలిగే పురుషులందరు వారి వంశాలు, వారి కుటుంబాల వంశాల ప్రకారం పేరుపేరున లెక్కించబడ్డారు. 25 గాదు గోత్రం నుండి లెక్కించబడినవారు 45,650. 26 యూదా సంతతివారి నుండి: యిరవై సంవత్సరాలు అంతకు పైబడి ఉండి సైన్యంలో పని చేయగలిగే పురుషులందరు వారి వంశాలు, వారి కుటుంబాల వంశాల ప్రకారం పేరుపేరున లెక్కించబడ్డారు. 27 యూదా గోత్రం నుండి లెక్కించబడినవారు 74,600. 28 ఇశ్శాఖారు సంతతివారి నుండి: యిరవై సంవత్సరాలు అంతకు పైబడి ఉండి సైన్యంలో పని చేయగలిగే పురుషులందరు వారి వంశాలు, వారి కుటుంబాల వంశాల ప్రకారం పేరుపేరున లెక్కించబడ్డారు. 29 ఇశ్శాఖారు గోత్రం నుండి లెక్కించబడినవారు 54,400. 30 జెబూలూను సంతతివారి నుండి: యిరవై సంవత్సరాలు అంతకు పైబడి ఉండి సైన్యంలో పని చేయగలిగే పురుషులందరు వారి వంశాలు, వారి కుటుంబాల వంశాల ప్రకారం పేరుపేరున లెక్కించబడ్డారు. 31 జెబూలూను గోత్రం నుండి లెక్కించబడినవారు 57,400. 32 యోసేపు కుమారులు: ఎఫ్రాయిం సంతతివారి నుండి: యిరవై సంవత్సరాలు అంతకన్నా ఎక్కువ వయస్సు ఉండి సైన్యంలో పని చేయగలిగే పురుషులందరు వారి వంశాలు, వారి కుటుంబాల వంశాల ప్రకారం పేరుపేరున లెక్కించబడ్డారు. 33 ఎఫ్రాయిం గోత్రం నుండి లెక్కించబడినవారు 40,500. 34 మనష్షే సంతతివారి నుండి: యిరవై సంవత్సరాలు అంతకన్నా ఎక్కువ వయస్సు ఉండి సైన్యంలో పని చేయగలిగే పురుషులందరు వారి వంశాలు, వారి కుటుంబాల వంశాల ప్రకారం పేరుపేరున లెక్కించబడ్డారు. 35 మనష్షే గోత్రం నుండి లెక్కించబడినవారు 32,200. 36 బెన్యామీను సంతతివారి నుండి: యిరవై సంవత్సరాలు అంతకన్నా ఎక్కువ వయస్సు ఉండి సైన్యంలో పని చేయగలిగే వారు వారి వంశాలు, వారి కుటుంబాల వంశాల ప్రకారం పేరుపేరున లెక్కించబడ్డారు. 37 బెన్యామీను గోత్రం నుండి లెక్కించబడినవారు 35,400. 38 దాను సంతతివారి నుండి: యిరవై సంవత్సరాలు అంతకన్నా ఎక్కువ వయస్సు ఉండి సైన్యంలో పని చేయగలిగే వారు వారి వంశాలు, వారి కుటుంబాల వంశాల ప్రకారం పేరుపేరున లెక్కించబడ్డారు. 39 దాను గోత్రం నుండి లెక్కించబడినవారు 62,700. 40 ఆషేరు సంతతివారి నుండి: యిరవై సంవత్సరాలు అంతకన్నా ఎక్కువ వయస్సు ఉండి సైన్యంలో పని చేయగలిగే వారు వారి వంశాలు, వారి కుటుంబాల వంశాల ప్రకారం పేరుపేరున లెక్కించబడ్డారు. 41 ఆషేరు గోత్రం నుండి లెక్కించబడినవారు 41,500. 42 నఫ్తాలి సంతతివారి నుండి: యిరవై సంవత్సరాలు అంతకన్నా ఎక్కువ వయస్సు ఉండి సైన్యంలో పని చేయగలిగే వారు వారి వంశాలు, వారి కుటుంబాల వంశాల ప్రకారం పేరుపేరున లెక్కించబడ్డారు. 43 నఫ్తాలి గోత్రం నుండి లెక్కించబడినవారు 53,400. 44 వీరంతా ఇశ్రాయేలు పన్నెండు గోత్రాల నాయకులతో కలిసి మోషే అహరోనులచేత లెక్కించబడినవారు. 45 ఇశ్రాయేలీయులందరిలో ఇరవై సంవత్సరాలు అంతకన్నా ఎక్కువ వయస్సుండి ఇశ్రాయేలు సైన్యంలో పని చేయగలిగే వారు వారి వంశాలు, వారి కుటుంబాల ప్రకారం పేర్లు నమోదు చేసుకున్నారు. 46 వీరి మొత్తం సంఖ్య 6,03,550. 47 అయితే లేవీయుల పూర్వికుల గోత్రం ప్రకారం వీరితో పాటు లెక్కించబడలేదు. 48 యెహోవా మోషేతో ఇలా అన్నారు: 49 “లేవీయుల గోత్రాన్ని నీవు లెక్క పెట్టకూడదు, ఇశ్రాయేలీయుల జనాభా లెక్కలో చేర్చకూడదు. 50 దానికి బదులుగా సాక్షి గుడారం లేదా సాక్షి గుడారం మీద, దాని ఉపకరణాల మీద, దానికి సంబంధించిన అన్నిటి మీద లేవీయులను నియమించు. వారు సమావేశ గుడారాన్ని, దాని ఉపకరణాలన్నిటిని మోయాలి; వారు దాని చుట్టూ ఉంటూ దానిని చూసుకోవాలి. 51 సమావేశ గుడారాన్ని తరలించాల్సి వచ్చినప్పుడెల్లా, లేవీయులే దానిని క్రిందికి దించాలి, అలాగే సమావేశ గుడారాన్ని వేయాల్సి వచ్చినప్పుడెల్లా, లేవీయులే దాన్ని వేయాలి. ఇతరులు దానిని సమీపిస్తే వారికి మరణశిక్ష విధించాలి. 52 ఇశ్రాయేలీయులు తమ తమ గోత్ర విభజన ప్రకారం సొంత జెండాలతో తమ డేరాలు వేసుకోవాలి. 53 అయితే నా కోపం ఇశ్రాయేలీయుల సమాజం మీదికి రాకుండా లేవీయులు సాక్షి గుడారం చుట్టూ డేరాలు వేసుకోవాలి. సాక్షి గుడారాన్ని కాపాడే బాధ్యత లేవీయులదే.” 54 యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లే ఇశ్రాయేలీయులు చేశారు. |
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం™
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Biblica® Open Telugu Contemporary Version™
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Biblica, Inc.