Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

మీకా 5 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం


బేత్లెహేము నుండి వాగ్దాన పాలకుడు

1 సైన్య సమూహాలు గల నగరమా, సమూహాలను సమకూర్చు, శత్రువులు మనల్ని ముట్టడించారు. వారు ఇశ్రాయేలు ప్రజల పాలకున్ని బెత్తంతో చెంపమీద కొడతారు.

2 “అయితే బేత్లెహేము ఎఫ్రాతా, యూదా వారి కుటుంబాల మధ్య నీవు చిన్నదానివైనప్పటికి, నా కోసం ఇశ్రాయేలు మీద పరిపాలన చేసే అధిపతి నీలో నుండి వస్తాడు, ఆయన పూర్వకాలం నుండి శాశ్వతకాలం ఉన్నవాడు.”

3 కాబట్టి ప్రసవ వేదన పడే స్త్రీ బిడ్డను కనేవరకు ఇశ్రాయేలు విడిచిపెట్టబడుతుంది. అతని సోదరులలో మిగిలిన వారు, ఇశ్రాయేలీయులతో చేరడానికి తిరిగి వస్తారు.

4 ఆయన యెహోవా బలం పొంది తన దేవుడైన యెహోవా నామ మహిమతో లేచి తన మందను మేపుతాడు. ఆయన మహాత్యం భూదిగంతాల వరకు వ్యాపిస్తుంది, కాబట్టి వారు సురక్షితంగా నివసిస్తారు.

5 అష్షూరు వారు దండెత్తి మన దేశంలోకి వచ్చి మన కోటలలో ప్రవేశించేటప్పుడు, ఆయన మన సమాధానం అవుతారు మనం వారికి విరుద్ధంగా ఏడుగురు కాపరులను, ఎనిమిది మంది నాయకులుగా నియమిస్తాము.

6 వీరు ఖడ్గంతో అష్షూరు దేశాన్ని, దూసిన ఖడ్గంతో నిమ్రోదు దేశాన్ని పరిపాలిస్తారు. అష్షూరు వారు దండెత్తి మన సరిహద్దులను దాటి, మన దేశాన్ని ఆక్రమించుకున్నప్పుడు ఆయన మనల్ని రక్షిస్తారు.

7 యాకోబు సంతానంలో మిగిలినవారు, అనేక జనాల మధ్యలో, యెహోవా కురిపించే మంచులా, ఎవరి కోసం ఎదురుచూడకుండ ఏ మనిషి మీద ఆధారపడకుండా గడ్డి మీద కురిసే వానజల్లులా ఉంటారు.

8 యాకోబు సంతానంలో మిగిలినవారు దేశాల మధ్య, అనేక జనాల మధ్య, అడవి మృగాలలో సింహంలా, గొర్రెల మందలలో దూరి, ఎవ్వరూ విడిపించలేనంతగా వాటిని త్రొక్కి చీల్చే కొదమసింహంలా ఉంటారు.

9 మీ హస్తం మీ విరోధుల మీద విజయం సాధిస్తుంది, మీ శత్రువులందరూ నాశనమవుతారు.

10 యెహోవా ఇలా ప్రకటిస్తున్నారు, “ఆ దినాన” “నేను మీ మధ్య నుండి మీ గుర్రాలను నాశనం చేస్తాను, మీ రథాలను ధ్వంసం చేస్తాను.

11 మీ దేశంలోని పట్టణాలను నాశనం చేస్తాను మీ కోటలను పడగొడతాను,

12 మీ మధ్య మంత్రవిద్య లేకుండా నాశనం చేస్తాను ఇక ఎన్నడూ మీరు సోదె చెప్పరు.

13 నేను మీ విగ్రహాలను, మీ పవిత్ర రాళ్లను మీ మధ్య నుండి నిర్మూలిస్తాను; ఇకపై మీరు ఎన్నడు మీ చేతి పనులకు మ్రొక్కరు.

14 నేను మీ పట్టణాలను పడగొట్టినప్పుడు, మీ మధ్య నుండి అషేరా స్తంభాలను పెళ్లగిస్తాను.

15 నా మాట వినని దేశాల మీద కోపంతో, క్రోధంతో ప్రతీకారం తీసుకుంటాను.”

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం™

ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

Biblica® Open Telugu Contemporary Version™

Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

Biblica, Inc.
Lean sinn:



Sanasan