మీకా 4 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదంయెహోవా పర్వతం 1 చివరి రోజుల్లో యెహోవా ఆలయ పర్వతం పర్వతాలన్నిటిలో ఉన్నతమైనదిగా స్థిరపరచబడుతుంది; అది కొండలకు పైగా హెచ్చింపబడుతుంది, ప్రజలు ప్రవాహంలా దాని దగ్గరకు వెళ్తారు. 2 అన్య దేశాల వారనేకులు వచ్చి ఇలా అంటారు, “రండి, మనం యెహోవా పర్వతం మీదికి, యాకోబు దేవుని ఆలయానికి వెళ్దాము. మనం ఆయన మార్గంలో నడిచేలా, ఆయన మనకు తన మార్గాల్ని బోధిస్తారు.” సీయోనులో నుండి ధర్మశాస్త్రం, యెరూషలేములో నుండి యెహోవా వాక్కు బయటకు వెళ్తాయి. 3 ఆయన అనేక ప్రజలకు తీర్పు తీరుస్తారు, దూరంగా ఉన్న బలమైన దేశాల వివాదాలను పరిష్కరిస్తారు. వారు తమ ఖడ్గాలను సాగగొట్టి నాగటి నక్కులుగా, తమ ఈటెలను సాగగొట్టి మడ్డికత్తులుగా చేస్తారు. దేశం మరొక దేశం మీది ఖడ్గం తీయదు, వారు ఇకపై యుద్ధానికి శిక్షణ పొందరు. 4 ప్రతి ఒక్కరు తమ సొంత ద్రాక్షచెట్టు క్రింద, తమ అంజూర చెట్టు క్రింద కూర్చుంటారు, ఎవరూ వారిని భయపెట్టరు, ఎందుకంటే సైన్యాల యెహోవా మాట ఇచ్చారు. 5 అన్ని దేశాల ప్రజలు తమ దేవుళ్ళ పేరిట నడుచుకుంటారు, అయితే మేము మా దేవుడైన యెహోవా పేరును బట్టి ఎల్లకాలం నడుచుకుంటాము. యెహోవా ప్రణాళిక 6 యెహోవా ఇలా అంటున్నారు, “ఆ రోజు, నేను కుంటివారిని పోగుచేస్తాను; బందీలుగా వెళ్లిన వారిని, నేను బాధకు గురిచేసిన వారిని సమకూరుస్తాను. 7 కుంటివారిని నా శేషంగా, వెళ్లగొట్టబడిన వారిని బలమైన దేశంగా చేస్తాను. యెహోవా సీయోను కొండమీద ఆ రోజు నుండి ఎల్లప్పుడూ వారిని పరిపాలిస్తారు. 8 మందకు కావలికోటగా, సీయోను కుమార్తె దుర్గంగా ఉన్న నీకైతే, మునుపటి అధికారం తిరిగి ఇవ్వబడుతుంది; యెరూషలేము కుమార్తెకు రాజ్యాధికారం వస్తుంది.” 9 ఇప్పుడు మీరెందుకు కేకలు వేస్తున్నారు? మీకు రాజు లేడా? మీ పరిపాలకుడు నాశనమయ్యాడా? స్త్రీ ప్రసవవేదన పడినట్లు మీరెందుకు వేదన చెందుతున్నారు? 10 సీయోను కుమార్తె, నీవు ప్రసవ వేదనలో ఉన్న స్త్రీలా వేదనతో మెలికలు తిరుగు, ఎందుకంటే ఇప్పుడు నీవు పట్టణం వదిలిపెట్టి, బయట నివసించాలి. మీరు బబులోనుకు వెళ్తారు, అక్కడే మీరు విడిపించబడతారు. అక్కడే యెహోవా మీ శత్రువు చేతిలో నుండి మిమ్మల్ని విడిపిస్తారు. 11 ఇప్పుడు అనేక దేశాలు మీకు విరుద్ధంగా కూడుకుని, “సీయోను అపవిత్రం కావాలి, దాని నాశనం మేము కళ్లారా చూడాలి!” అంటున్నారు. 12 కాని వారికి యెహోవా తలంపులు తెలియవు; ఆయన ప్రణాళిక వారు గ్రహించరు. నూర్పిడి కళ్ళంలో పనలు సమకూర్చినట్లు ఆయన వారిని సమకూరుస్తారు. 13 “సీయోను కుమార్తె, లేచి, కళ్ళం త్రొక్కు, నేను నీకు ఇనుప కొమ్ములు ఇస్తాను; ఇత్తడి డెక్కలు ఇస్తాను. నీవు అనేక దేశాలను ముక్కలుగా విరగ్గొడతావు.” నీవు వారి అన్యాయపు సంపదను యెహోవాకు సమర్పిస్తావు. వారి ఆస్తులను సర్వలోక ప్రభువుకు సమర్పిస్తావు. |
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం™
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Biblica® Open Telugu Contemporary Version™
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Biblica, Inc.