Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

మీకా 3 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం


నాయకులు, ప్రవక్తలు గద్దించబడుట

1 అప్పుడు నేను ఇలా అన్నాను, “యాకోబు నాయకులారా, ఇశ్రాయేలు పాలకులారా, వినండి. న్యాయాన్ని మీరు తెలుసుకోవద్దా?

2 మీరు మంచిని అసహ్యించుకుని చెడును ప్రేమిస్తారు; నా ప్రజల చర్మం ఒలిచి, వారి ఎముకల మీద మాంసాన్ని చీలుస్తారు;

3 నా ప్రజల మాంసాన్ని తింటారు, వారి చర్మం ఒలిచి, వారి ఎముకలను ముక్కలుగా విరగ్గొడతారు; పాత్రలో వేసే మాంసాన్ని ముక్కలు చేసినట్లు, కుండలో వేసే మాంసాన్ని ముక్కలు చేసినట్లు చేస్తారు.”

4 తర్వాత వారు యెహోవాకు మొరపెడతారు, కాని ఆయన వారికి జవాబివ్వరు. వారు చేసిన చెడు కారణంగా ఆయన ఆ కాలంలో తన ముఖం దాచుకుంటారు.

5 యెహోవా చెప్పే మాట ఇదే: “నా ప్రజలను తప్పుదారి పట్టించిన ప్రవక్తల విషయానికి వస్తే, వారికి తినడానికి ఏదైన ఉంటే, వారు ‘సమాధానం’ ప్రకటిస్తారు, కాని ఎవరైనా వారికి భోజనం పెట్టకపోతే, వారి మీద యుద్ధానికి సిద్ధపడతారు.

6 కాబట్టి మీకు దర్శనాలేమీ రాకుండా రాత్రి కమ్ముతుంది, సోదె చెప్పకుండా మిమ్మల్ని చీకటి ఆవరిస్తుంది. ప్రవక్తలకు సూర్యాస్తమయం అవుతుంది, పగలు వారికి చీకటిగా మారుతుంది.

7 అప్పుడు దీర్ఘదర్శులు సిగ్గుపడతారు సోదె చెప్పేవారు అవమానపడతారు. దేవుని దగ్గర నుండి జవాబేమీ రాక వారంతా తమ ముఖాలను కప్పుకుంటారు.”

8 నేనైతే, యాకోబుకు అతని అతిక్రమాన్ని ఇశ్రాయేలుకు అతని పాపాన్ని తెలియజేయడానికి, యెహోవా ఆత్మను పొంది శక్తితో నింపబడి ఉన్నాను, న్యాయబుద్ధితో, బలంతో ఉన్నాను.

9 యాకోబు నాయకులారా, ఇశ్రాయేలు పాలకులారా, మీరు ఇది వినండి. మీరు న్యాయాన్ని తృణీకరించి, సరియైన దానినంతటిని వంకర చేస్తారు;

10 మీరు రక్తపాతంతో సీయోనును కడతారు, దుష్టత్వంతో యెరూషలేమును నిర్మిస్తారు.

11 దాని నాయకులు లంచం తీసుకుని తీర్పు చెప్తారు, దాని యాజకులు జీతానికి ఉపదేశిస్తారు. దాని ప్రవక్తలు డబ్బు కోసం సోదె చెప్తారు. అయినా వారు యెహోవా సహాయం కోసం చూస్తూ, “యెహోవా మన మధ్య ఉన్నారు గదా! ఏ కీడు మన మీదికి రాదు” అంటారు.

12 కాబట్టి మీ కారణంగా, సీయోను ఒక పొలంలా దున్నబడుతుంది, యెరూషలేము రాళ్ల కుప్పగా మారుతుంది ఆలయమున్న కొండ దట్టమైన పొదలతో మట్టి దిబ్బగా మారుతుంది.

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం™

ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

Biblica® Open Telugu Contemporary Version™

Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

Biblica, Inc.
Lean sinn:



Sanasan