Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

మత్తయి 11 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం


యేసు, బాప్తిస్మమిచ్చే యోహాను

1 యేసు తన పన్నెండుమంది శిష్యులకు ఆదేశాలు ఇవ్వడం ముగించిన తర్వాత, ఆయన అక్కడినుండి గలిలయలోని పట్టణాల్లో ఉపదేశించడానికి, సువార్తను ప్రకటించడానికి వెళ్లారు.

2 క్రీస్తు చేస్తున్న క్రియలను గురించి చెరసాలలో ఉన్న యోహాను విని, ఆయన దగ్గరకు తన శిష్యులను పంపించి,

3 “రావలసిన వాడవు నీవేనా, లేదా మేము వేరొకరి కోసం ఎదురుచూడాలా?” అని ఆయనను అడగమన్నాడు.

4 యేసు వారికి ఇలా జవాబిచ్చారు, “మీరు వెళ్లి చూసినవాటిని, విన్నవాటిని యోహానుకు చెప్పండి.

5 గ్రుడ్డివారు చూపు పొందుతున్నారు, కుంటివారు నడుస్తున్నారు, కుష్ఠురోగులు శుద్ధులవుతున్నారు, చెవిటివారు వింటున్నారు. చనిపోయినవారు తిరిగి బ్రతుకుతున్నారు, పేదవారికి సువార్త ప్రకటించబడుతుంది.

6 నా విషయంలో అభ్యంతరపడని వాడు ధన్యుడు.”

7 యోహాను శిష్యులు వెళ్లిపోతుండగా, యేసు జనంతో యోహాను గురించి మాట్లాడటం ప్రారంభించాడు, “ఏమి చూడడానికి మీరు అరణ్యంలోనికి వెళ్లారు? గాలికి ఊగే రెల్లునా?

8 అది కాకపోతే, మరి ఏమి చూడడానికి వెళ్లారు? విలువైన వస్త్రాలను ధరించిన ఒక వ్యక్తినా? కాదు, విలువైన వస్త్రాలను ధరించిన వ్యక్తులు రాజభవనాల్లో ఉంటారు.

9 మరి ఏమి చూడడానికి మీరు వెళ్లారు? ఒక ప్రవక్తనా? అవును, ప్రవక్తకంటే కూడా గొప్పవాడు అని మీతో చెప్తున్నాను.

10 అతని గురించి ఇలా వ్రాయబడింది: “ ‘ఇదిగో, నీకు ముందుగా దూతను పంపుతాను, అతడు నీ ముందర నీ మార్గాన్ని సిద్ధపరుస్తాడు.’

11 స్త్రీలకు పుట్టిన వారిలో బాప్తిస్మమిచ్చే యోహాను కంటే గొప్పవానిగా ఎదిగినవారు ఒక్కరు లేరు; అయినప్పటికీ, పరలోకరాజ్యంలో అందరికంటే అల్పమైనవాడు అతనికంటే గొప్పవాడని నేను మీతో ఖచ్చితంగా చెప్తున్నాను.

12 బాప్తిస్మమిచ్చే యోహాను రోజులనుండి ఇప్పటివరకు పరలోక రాజ్యం హింసకు గురవుతూనే ఉంది, హింసించేవారు దానిపై దాడులు చేస్తూనే ఉన్నారు.

13 యోహాను వచ్చేవరకు ధర్మశాస్త్రం, అలాగే ప్రవక్తలందరు ప్రవచించారు.

14 మీరు అంగీకరించడానికి ఇష్టపడితే, ఇతడే ఆ రావలసిన ఏలీయా.

15 వినడానికి చెవులుగలవారు విందురు గాక.

16 “ఈ తరం వారిని నేను దేనితో పోల్చాలి? వారు సంత వీధుల్లో కూర్చుని ఇతరులను పిలుస్తూ అని చెప్పుకునే చిన్న పిల్లల్లా ఉంటారు:

17 “ ‘మేము మీ కోసం పిల్లనగ్రోవి వాయించాం, మీరు నాట్యం చేయలేదు; మేము విషాద గీతం పాడాం, మీరు దుఃఖపడలేదు’

18 యోహాను తినలేదు త్రాగలేదు అయినా వారు, ‘వీడు దయ్యం పట్టినవాడు’ అంటున్నారు.

19 మనుష్యకుమారుడు తింటున్నారు త్రాగుతున్నారు కాబట్టి వారు, ‘ఇదిగో, తిండిబోతు, త్రాగుబోతు, పన్ను వసూలు చేసేవారికి, పాపులకు స్నేహితుడు’ అంటున్నారు. కాని జ్ఞానం సరియైనదని దాని పనులను బట్టే నిరూపించబడుతుంది.”


పశ్చాత్తాపపడని పట్టణాలకు శ్రమ

20 యేసు ఏ పట్టణాల్లో ఎక్కువ అద్భుతాలను చేశాడో ఆ పట్టణాలు పశ్చాత్తాపపడలేదని వాటిని నిందించడం మొదలుపెట్టారు.

21 “కొరజీనూ నీకు శ్రమ! బేత్సయిదా నీకు శ్రమ! ఎందుకంటే మీలో జరిగిన అద్భుతాలు తూరు, సీదోను పట్టణాల్లో జరిగి ఉంటే, ఆ ప్రజలు చాలా కాలం క్రిందటే గోనెపట్ట కట్టుకుని బూడిదలో కూర్చుని పశ్చాత్తాపపడి ఉండేవారు.

22 అయితే తీర్పు దినాన మీ మీదికి వచ్చే గతికంటే తూరు సీదోను పట్టణాల గతి భరించ గలదిగా ఉంటుంది.

23 ఓ కపెర్నహూమా, నీవు ఆకాశానికి ఎత్తబడతావా? లేదు, నీవు పాతాళంలోనికి దిగిపోతావు. నీలో జరిగిన అద్భుతాలు సొదొమలో జరిగి ఉంటే అది ఈనాటి వరకు నిలిచి ఉండేది.

24 అయితే తీర్పు దినాన మీ మీదికి వచ్చే గతికంటే సొదొమ దేశపు గతి భరించ గలదిగా ఉంటుందని నేను మీతో చెప్తున్నాను.”


తండ్రి కుమారునిలో ప్రత్యక్షపరచుకొనుట

25 ఆ సమయంలో యేసు ఇలా అన్నారు, “తండ్రీ, భూమి ఆకాశాలకు ప్రభువా, నీవు ఈ సంగతులను జ్ఞానులకు, తెలివైనవారికి మరుగుచేసి, చిన్న పిల్లలకు బయలుపరిచావు కాబట్టి నేను నిన్ను స్తుతిస్తున్నాను.

26 అవును తండ్రీ, ఈ విధంగా చేయడం నీకు సంతోషము.

27 “నా తండ్రి నాకు సమస్తం అప్పగించారు. కుమారుడు ఎవరో తండ్రికి తప్ప ఎవరికి తెలియదు; అలాగే తండ్రి ఎవరో కుమారునికి, కుమారుడు ఎవరికి తెలియచేయాలని అనుకున్నారో వారికి తప్ప మరి ఎవరికి తెలియదు.

28 “భారం మోస్తూ అలసిపోయిన వారలారా! మీరందరు నా దగ్గరకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను.

29 నేను సౌమ్యుడను, వినయ హృదయం గలవాడను కాబట్టి నా కాడి మీమీద ఎత్తుకుని నా దగ్గర నేర్చుకోండి, అప్పుడు మీ ఆత్మలకు విశ్రాంతి దొరుకుతుంది.

30 ఎందుకంటే, నా కాడి సుళువుగా మోయదగినది, నేను ఇచ్చే నా భారం తేలికైనది.”

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం™

ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

Biblica® Open Telugu Contemporary Version™

Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

Biblica, Inc.
Lean sinn:



Sanasan