Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

లూకా సువార్త 8 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం


విత్తువాని ఉపమానం

1 ఆ తర్వాత, యేసు దేవుని రాజ్యసువార్తను ప్రకటిస్తూ, ఒక పట్టణం నుండి మరొక పట్టణానికి, ఒక గ్రామం నుండి మరొక గ్రామానికి ప్రయాణం చేశారు. ఆయనతో పాటు పన్నెండుమంది శిష్యులు ఉన్నారు,

2 అపవిత్రాత్మల నుండి వ్యాధుల నుండి బాగుపడిన కొందరు స్త్రీలు, అనగా, ఏడు దయ్యాలు వదిలిపోయిన మగ్దలేనే మరియ;

3 హేరోదు గృహనిర్వాహకుడైన కూజా భార్య యోహన్న; సూసన్న ఇంకా అనేకమంది ఉన్నారు. ఈ స్త్రీలు తమకు కలిగిన వాటితో వారికి సహాయం చేసేవారు.

4 ఒక రోజు ప్రతి పట్టణం నుండి గొప్ప జనసమూహం యేసు దగ్గరకు వస్తుండగా, ఆయన వారికి ఈ ఉపమానం చెప్పారు:

5 “ఒక రైతు విత్తనాలను చల్లడానికి వెళ్లాడు. అతడు విత్తనాలు చల్లేటప్పుడు, కొన్ని దారి ప్రక్కన పడ్డాయి; అవి కాళ్లతో త్రొక్కబడ్డాయి, పక్షులు వచ్చి వాటిని తినివేశాయి.

6 మరికొన్ని రాతి నేలలో పడ్డాయి, అవి మొలిచినప్పుడు, వాటికి తడి లేదు కాబట్టి మొక్కలు ఎండిపోయాయి.

7 మరికొన్ని విత్తనాలు ముళ్ళపొదల్లో పడ్డాయి, వాటితో ఆ ముళ్ళపొదలు పెరిగి వాటిని అణచి వేశాయి.

8 మరికొన్ని విత్తనాలు మంచి నేలలో పడ్డాయి. అవి మొలకెత్తి, విత్తబడినవాటి కన్న వందరెట్లు అధికంగా పంటనిచ్చాయి.” ఆయన ఇది చెప్పిన తర్వాత, “వినడానికి చెవులుగలవారు విందురు గాక!” అని బిగ్గరగా అన్నారు.

9 శిష్యులు, ఈ ఉపమాన భావం ఏమిటి? అని ఆయనను అడిగారు.

10 ఆయన, “దేవుని రాజ్యం గురించిన రహస్యాలకు సంబంధించిన జ్ఞానం మీకు ఇవ్వబడింది, కాని ఇతరులతో ఉపమానరీతిలోనే మాట్లాడతాను, ఎందుకంటే, “ ‘చూస్తూనే ఉంటారు కాని గ్రహించరు, వింటూనే ఉంటారు కాని అర్థం చేసుకోరు.’

11 “ఇది ఈ ఉపమాన భావం: విత్తనం దేవుని వాక్యము.

12 దారి ప్రక్కన పడిన విత్తనాలు అంటే, వాక్యాన్ని వింటారు, కానీ నమ్మి రక్షణ పొందకుండా అపవాది వచ్చి వారి హృదయాల్లో నుండి వాక్యాన్ని ఎత్తుకుపోతాడు.

13 రాతి నేలలో పడిన విత్తనాలు అంటే, వారు వాక్యాన్ని విన్నప్పుడు దానిని సంతోషంతో అంగీకరిస్తారు, కానీ వారిలో వేరు ఉండదు. వారు కొంతకాలమే నమ్ముతారు, శోధన సమయంలో త్వరగా పడిపోతారు.

14 ముళ్ళపొదల్లో పడిన విత్తనాలు అంటే, వారు వాక్యాన్ని వింటారు, కాని కాలం గడిచేకొలది తమ జీవితాల్లో ఎదురయ్యే తొందరలు, ఐశ్వర్యాలు ఆనందాలతో అణచివేయబడడంవల్ల, వాక్యంలో ఎదగరు.

15 అయితే మంచి నేలలో పడిన విత్తనాలు యోగ్యులై మంచి హృదయం కలిగినవారు, వారు వాక్యాన్ని వింటారు, దానిని పాటిస్తారు, పట్టుదలతో ఫలిస్తారు.


దీపం ఒక స్తంభం పైన పెట్టబడాలి

16 “ఎవ్వరూ దీపాన్ని వెలిగించి దానిని మట్టి పాత్ర క్రింద లేదా మంచం క్రింద పెట్టరు. దానికి బదులు, లోపలికి వచ్చే వారికి వెలుగిచ్చేలా, దానిని దీపస్తంభం మీద పెడతారు.

17 ఎందుకంటే మరుగున ఉంచినదేది బయటపడక ఉండదు, దాచిపెట్టబడినదేది తెలియకుండా లేదా బహిర్గతం కాకుండ ఉండదు.

18 కాబట్టి మీరు ఏమి వింటున్నారో జాగ్రత్తగా చూసుకోండి. కలిగినవానికి మరి ఎక్కువగా ఇవ్వబడుతుంది; లేనివారి నుండి, తమకు ఉన్నదని అనుకునేది కూడా తీసివేయబడుతుంది” అని చెప్పారు.


యేసు తల్లి సహోదరులు

19 యేసు తల్లి సహోదరులు ఆయనను కలవడానికి వచ్చారు, కానీ ప్రజలు గుంపుగా ఉండడంతో ఆయన దగ్గరకు రాలేకపోయారు.

20 అది చూసిన ఒకడు ఆయనతో, “నీ తల్లి నీ సహోదరులు నిన్ను కలవడానికి వచ్చి, బయట వేచి ఉన్నారు” అని చెప్పాడు.

21 అందుకు ఆయన, “దేవుని వాక్యాన్ని విని, దాని ప్రకారం జీవించేవారే నా తల్లి, నా సహోదరులు” అని జవాబిచ్చారు.


యేసు తుఫానును శాంతింపచేయుట

22 ఒక రోజు యేసు తన శిష్యులతో, “మనం సరస్సు అవతలి వైపుకి వెళ్దాం పదండి” అన్నారు, వారు పడవ ఎక్కి బయలుదేరారు.

23 వారు ప్రయాణం చేస్తూ ఉండగా, యేసు నిద్రపోయారు. అంతలో భయంకరమైన తుఫాను సరస్సు మీదికి వచ్చి, పడవంతా నీళ్లతో నిండిపోవడం మొదలుపెట్టింది, వారు ఎంతో ప్రమాదంలో ఉన్నారు.

24 కాబట్టి శిష్యులు ఆయన దగ్గరకు వెళ్లి, “బోధకుడా, బోధకుడా, మేము మునిగిపోతున్నాం” అని అంటూ ఆయనను లేపారు. ఆయన లేచి, గాలిని ఉప్పొంగుతున్న నీటిని గద్దించగానే, తుఫాను ఆగింది, అంతా ప్రశాంతంగా మారింది.

25 అప్పుడు ఆయన, “మీ విశ్వాసం ఎక్కడ?” అని తన శిష్యులను అడిగారు. అయితే వారు విస్మయంతో భయపడుతూ ఒకనితో ఒకడు, “ఈయన ఎవరు? గాలిని నీళ్లను ఈయన ఆజ్ఞాపించగానే, అవి లోబడుతున్నాయి” అని చెప్పుకొన్నారు.


దయ్యం పట్టిన వానికి యేసు విడుదల కలుగచేయుట

26 వారు గలిలయ సరస్సును దాటి, గెరాసేనీయులు నివసించు ప్రాంతాన్ని చేరుకొన్నారు.

27 యేసు ఒడ్డున అడుగు పెట్టగానే, దయ్యాలు పట్టిన గ్రామస్తుడొకడు ఆయనకు ఎదురుగా వచ్చాడు. వాడు చాలా కాలం నుండి బట్టలు వేసుకోలేదు ఇంట్లో కాకుండా, సమాధుల్లో నివసించేవాడు.

28 వాడు యేసును చూడగానే, వాడు కేక వేస్తూ ఆయన పాదాల దగ్గర పడి, “సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, యేసూ, నాతో నీకేమి? నన్ను వేధించవద్దని నిన్ను వేడుకొంటున్నాను!” అని బిగ్గరగా అరిచాడు.

29 ఎందుకంటే యేసు ఆ అపవిత్రాత్మను వాని నుండి బయటకు రమ్మని ఆజ్ఞాపించారు. అది చాలాసార్లు వానిని పట్టి పీడించింది, వాని కాళ్లకు చేతులకు గొలుసులను వేసి బంధించి కాపలా ఉన్నా, వాడు ఆ గొలుసులను తెంపివేసేవాడు, ఆ దయ్యాలు వాన్ని అరణ్యంలోనికి తీసుకెళ్ళేవి.

30 అప్పుడు యేసు, “నీ పేరేమిటి?” అని వాన్ని అడిగారు. అందుకు వాడు, “సేన” అని జవాబిచ్చాడు, ఎందుకంటే అనేక దయ్యాలు వానిలో చొరబడి ఉన్నాయి.

31 పాతాళానికి వెళ్లమని తమను ఆజ్ఞాపించవద్దని అవి యేసును పదే పదే బ్రతిమాలాయి.

32 అక్కడ ఒక పెద్ద పందుల మంద కొండమీద మేస్తూ ఉంది. ఆ దయ్యాలు ఆ పందులలోనికి చొరబడడానికి అనుమతి ఇవ్వమని యేసును బ్రతిమాలాయి, ఆయన వాటికి అనుమతి ఇచ్చారు.

33 ఆ దయ్యాలు వానిలో నుండి బయటకు వచ్చి, ఆ పందులలోనికి చొరబడ్డాయి, వెంటనే ఆ మంద కొండ మీది నుండి వేగంగా సరస్సులోనికి పరుగెత్తుకొని వెళ్లి మునిగిపోయింది.

34 ఎప్పుడైతే పందులను కాస్తున్నవారు జరిగిన దానిని చూశారో, వారు పరుగెత్తుకొని వెళ్లి పట్టణంలోను గ్రామీణ ప్రాంతాల్లోనూ తెలియజేశారు.

35 ప్రజలు ఏమి జరిగిందో చూడడానికి వెళ్లారు. వారు యేసు దగ్గరకు వచ్చినప్పుడు, దయ్యాలు వదిలిన మనుష్యుడు, బట్టలు వేసుకుని సరియైన మానసిక స్థితిలో, యేసు పాదాల దగ్గర కూర్చుని ఉండడం చూశారు; వారు భయపడ్డారు.

36 జరిగింది చూసినవారు ఆ దయ్యాలు పట్టినవాడు ఎలా బాగయ్యాడో ఆ ఊరి వారికి తెలియజేశారు.

37 అప్పుడు గెరాసేన ప్రాంతపు ప్రజలందరు ఎంతో భయపడి, తమను విడిచిపొమ్మని యేసును బ్రతిమాలారు. కాబట్టి ఆయన పడవ ఎక్కి అక్కడినుండి వెళ్లిపోయారు.

38 అప్పుడు ఆ దయ్యాల నుండి విడుదల పొందినవాడు, తాను ఆయనతో పాటు వస్తానని బ్రతిమలాడాడు.

39 కాని యేసు అతనితో, “నీ ఇంటికి వెళ్లి దేవుడు నీకు ఎంతగా మేలు చేశాడో చెప్పు” అని చెప్పి పంపివేశారు. కాబట్టి వాడు వెళ్లిపోయి యేసు తనకు చేసిన దానిని గురించి ఆ పట్టణమంతటికి చెప్పాడు.


యేసు చనిపోయిన బాలికను తిరిగి లేపుట రోగియైన స్త్రీని స్వస్థపరచుట

40 యేసు తిరిగి రాగానే, ఆయన కోసం ఎదురు చూస్తున్న ప్రజలు సంతోషంగా ఆయనను ఆహ్వానించారు.

41 అప్పుడు యాయీరు అనే పేరుగల సమాజమందిరపు అధికారి వచ్చి, యేసు పాదాలపై పడి, తన ఇంటికి రమ్మని బ్రతిమాలాడు.

42 ఎందుకంటే సుమారు పన్నెండేళ్ళ వయస్సుగల అతని ఏకైక కుమార్తె జబ్బుతో చనిపోయేలా ఉంది. యేసు అతనితో వెళ్తూ ఉండగా, ప్రజలు గుంపుగా ఆయనపై పడుతున్నారు.

43 పన్నెండేళ్ల నుండి రక్తస్రావంతో బాధపడుతున్న ఒక స్త్రీ అక్కడ ఉంది. ఆమె తనకున్నదంతా వైద్యులకు ఖర్చు చేసినా గాని, ఎవరు ఆమెను బాగు చేయలేకపోయారు.

44 ఆమె ఆయన వెనుక నుండి వచ్చి, ఆయన వస్త్రపు అంచును ముట్టింది, వెంటనే ఆమె రక్తస్రావం ఆగిపోయింది.

45 “నన్ను ముట్టింది ఎవరు?” అని యేసు అడిగారు. మేము కాదని అందరు అంటూ ఉంటే, పేతురు, “బోధకుడా, ప్రజలు గుంపుగా నీపై పడుతున్నారు కదా” అన్నాడు.

46 అయినా యేసు, “ఎవరో నన్ను ముట్టుకున్నారు, నాలో నుండి శక్తి బయటకు వెళ్లినట్లు నాకు తెలిసింది” అని అన్నారు.

47 అప్పుడు ఆ స్త్రీ, ఇక దాగి ఉండలేనని తెలిసి, వణుకుతూ వచ్చి ఆయన కాళ్లమీద పడింది. ఆమె ఎందుకు ఆయనను ముట్టుకుందో వెంటనే ఎలా స్వస్థత పొందిందో ప్రజలందరి ముందు చెప్పింది.

48 అప్పుడు ఆయన ఆమెతో, “కుమారీ, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచింది. సమాధానంతో వెళ్లు” అని చెప్పారు.

49 యేసు ఇంకా మాట్లాడుతుండగా, సమాజమందిరపు నాయకుడైన యాయీరు ఇంటి నుండి ఒకడు వచ్చాడు, యాయీరుతో, “నీ కుమార్తె చనిపోయింది, ఇక బోధకునికి శ్రమ కలిగించవద్దు” అని చెప్పాడు.

50 వారి మాటలను విని, యేసు యాయీరుతో, “భయపడకు, నమ్మకం మాత్రం ఉంచు, నీ కుమార్తె స్వస్థపడుతుంది” అని చెప్పారు.

51 ఆయన యాయీరు ఇల్లు చేరిన తర్వాత, పేతురు, యోహాను, యాకోబు ఆ బాలిక తల్లిదండ్రులును తప్ప మరి ఎవరిని లోనికి రానివ్వలేదు.

52 ఆ సమయంలో, ప్రజలందరు ఆమె కోసం ఏడుస్తూ రోదిస్తున్నారు. అప్పుడు యేసు, “ఏడ్పు ఆపండి! ఈమె చనిపోలేదు కానీ నిద్రపోతుంది” అన్నారు.

53 ఆమె చనిపోయిందని తెలిసి, వారు ఆయనను ఎగతాళి చేశారు.

54 అయితే ఆయన ఆమె చేయి పట్టుకుని ఆమెతో, “చిన్నదానా, లే!” అన్నారు.

55 అప్పుడు ఆమెకు ప్రాణం తిరిగి వచ్చింది, ఆమె వెంటనే లేచి నిలబడింది. అప్పుడు ఆయన, “ఆమెకు తినడానికి ఏమైన ఇవ్వండి” అని వారితో చెప్పారు.

56 ఆమె తల్లిదండ్రులు అది చూసి ఆశ్చర్యపడ్డారు, అయితే ఆయన జరిగింది ఎవరికీ చెప్పకూడదు అని వారిని ఆదేశించారు.

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం™

ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

Biblica® Open Telugu Contemporary Version™

Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

Biblica, Inc.
Lean sinn:



Sanasan