Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

లూకా సువార్త 18 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం


పట్టు విడువని విధవరాలి ఉపమానం

1 ఒక రోజు యేసు విసుగక ప్రార్థన చేస్తూ ఉండాలి అనే విషయాన్ని ఉపమానరీతిగా చెప్పారు:

2 “ఒక పట్టణంలో ఒక న్యాయాధిపతి ఉన్నాడు. అతనికి దేవుని భయం లేదు, మనుష్యులను లెక్క చేసేవాడు కాడు.

3 ఆ పట్టణంలో ఒక విధవరాలు అతని దగ్గరకు తరచుగా వస్తూ, ‘నా విరోధి విషయంలో నాకు న్యాయం తీర్చండి’ అని అడుగుతూ ఉండేది.

4 “అతడు కొంతకాలం వరకు ఆమె మాటలను తిరస్కరించాడు కానీ, అతడు తనలో తాను, ‘నేను దేవునికి భయపడకపోయినా లేదా మనుష్యులను లక్ష్యపెట్టక పోయినా,

5 ఈ విధవరాలు, “నాకు న్యాయం చేయండి” అని నన్ను తరచుగా తొందర పెడుతుంది, కాబట్టి ఆమె మాటిమాటికి వచ్చి నన్ను విసిగించకుండా, నేను ఆమెకు న్యాయం చేస్తాను’ అని అనుకున్నాడు.”

6 కాబట్టి ప్రభువు దాని గురించి, “అన్యాయస్థుడైన న్యాయాధిపతి ఏమన్నాడో వినండి.

7 దేవుడు తాను ఏర్పరచుకున్నవారు, దివారాత్రులు తనకు మొరపెడుతున్న వారికి న్యాయం చేయరా? వారికి న్యాయం చేయడంలో ఆలస్యం చేస్తారా?

8 నేను చెప్పేది ఏంటంటే, ఆయన వారికి న్యాయం జరిగేలా చేస్తారు, అది కూడా అతిత్వరలో చేస్తారు. అయినా మనుష్యకుమారుడు వచ్చినప్పుడు, ఆయనకు భూమి మీద వారిలో విశ్వాసం కనిపిస్తుందా?” అని అడిగారు.


పన్ను వసూలు చేసేవాడు పరిసయ్యుని ఉపమానం

9 తమ స్వనీతిని ఆధారం చేసుకుని ఇతరులను చిన్న చూపు చూసేవారితో యేసు ఈ ఉపమానం చెప్పారు:

10 “ఇద్దరు ప్రార్థన చేయడానికి దేవాలయానికి వెళ్లారు. వారిలో ఒకడు పరిసయ్యుడు మరొకడు పన్నులు వసూలు చేసేవాడు.

11 పరిసయ్యుడు నిలబడి తన గురించి ఇలా ప్రార్థించాడు: ‘దేవా, నేను దొంగలు, అన్యాయస్థులు వ్యభిచారుల వంటి ఇతరుల్లా కాని, ఈ పన్నులు వసూలు చేసేవాని వలె కాని లేనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను.

12 నేను వారానికి రెండు సార్లు ఉపవాసం ఉంటాను, నా సంపాదనలో పదవ భాగం ఇస్తాను.’

13 “అయితే పన్నులు వసూలు చేసేవాడు దూరంగా నిలబడి, తలను పైకెత్తి చూడడానికి కూడా ధైర్యం చాలక, రొమ్ము కొట్టుకొంటూ, ‘దేవా, నేను పాపిని, నన్ను కరుణించు’ అని వేడుకొన్నాడు.

14 “నేను మీతో చెప్పేది ఏంటంటే, పరిసయ్యుని కంటే పన్నులు వసూలు చేసేవాడే దేవుని ఎదుట నీతిమంతునిగా తీర్చబడి తన ఇంటికి వెళ్లాడు. ఎందుకంటే తమను తాము హెచ్చించుకొనేవారు తగ్గించబడతారు. తమను తాము తగ్గించుకునేవారు హెచ్చింపబడతారు.”


యేసు చిన్న పిల్లలు

15 కొందరు తల్లితండ్రులు తమ పసిపిల్లలపై యేసు తన చేతులుంచి వారిని ఆశీర్వదించాలని ఆయన దగ్గరకు తీసుకుని వస్తున్నారు. అయితే ఆయన శిష్యులు అది చూసి వారిని గద్దించారు.

16 కానీ యేసు పిల్లలను తన దగ్గరకు పిలిచి తన శిష్యులతో, “చిన్న పిల్లలను నా దగ్గరకు రానివ్వండి, వారిని ఆటంకపరచకండి, ఎందుకంటే దేవుని రాజ్యం ఇలాంటి వారిదే” అని చెప్పారు.

17 “ఎవరైనా చిన్నపిల్లల్లా దేవుని రాజ్యాన్ని స్వీకరించకపోతే, ఎన్నటికి దానిలో ప్రవేశించరని నేను మీతో ఖచ్చితంగా చెప్తున్నాను” అని అన్నారు.


ధనం దేవుని రాజ్యం

18 ఒక అధికారి యేసుతో, “మంచి బోధకుడా, నిత్యజీవం పొందుకోవాలంటే నేనేమి చేయాలి?” అని అడిగాడు.

19 అందుకు యేసు, “నీవు నన్ను ఎందుకు మంచివాడనని పిలుస్తున్నావు? దేవుడు తప్ప మంచివారు ఎవ్వరూ లేరు.

20 మీకు ఆజ్ఞలు తెలుసు: ‘వ్యభిచారం చేయకూడదు, హత్య చేయకూడదు, దొంగతనం చేయకూడదు, అబద్ధసాక్ష్యం చెప్పకూడదు, మీ తండ్రిని తల్లిని గౌరవించాలి’ ” అని అన్నారు.

21 అందుకు ఆ అధికారి, “చిన్నప్పటి నుండి నేను వీటిని పాటిస్తూనే ఉన్నాను” అన్నాడు.

22 యేసు అతడు చెప్పింది విని వానితో, “అయినా నీలో ఒక కొరత ఉంది. నీకున్న ఆస్తి అంతా అమ్మి పేదవారికి పంచిపెట్టు, అప్పుడు పరలోకంలో నీవు ధనం కలిగి ఉంటావు. తర్వాత వచ్చి, నన్ను వెంబడించు” అని చెప్పారు.

23 అయితే ఆ మాట విని, విచారంగా వెళ్లిపోయాడు, ఎందుకంటే అతడు గొప్ప ఆస్తిగలవాడు.

24-25 యేసు అతన్ని చూసి అతనితో, “ఒక ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించడం కంటే ఒంటె సూది రంధ్రం గుండా దూరడం సులభం” అని చెప్పారు.

26 ఇది విన్న వారు, “అయితే మరి ఎవరు రక్షణ పొందగలరు?” అని అడిగారు.

27 అందుకు యేసు, “మనుష్యులకు అసాధ్యమైనవి దేవునికి సాధ్యం” అని జవాబిచ్చాడు.

28 పేతురు ఆయనతో, “మేము మాకు కలిగిన వాటన్నిటిని విడిచి నిన్ను వెంబడించాము” అన్నాడు.

29-30 అందుకు యేసు వారితో, “నేను మీతో నిజంగా చెప్తున్నాను, దేవుని రాజ్యం కోసం తన ఇంటిని, భార్యను, సహోదరులను, సహోదరీలను, తల్లిదండ్రులను, పిల్లలను విడిచిపెట్టిన వారు ఈ యుగంలో చాలారెట్లు పొందుకోవడమే కాక, రానున్న యుగంలో నిత్యజీవాన్ని కూడా తప్పక పొందుకొంటాడు” అని వారితో అన్నారు.


మూడవసారి తన మరణాన్ని గురించి ముందే చెప్తున్న యేసు

31 యేసు తన పన్నెండుమంది శిష్యులను ప్రక్కకు తీసుకెళ్లి, “రండి, మనం యెరూషలేముకు వెళ్తున్నాం, మనుష్యకుమారుని గురించి ప్రవక్తలు వ్రాసిన మాటలన్నీ నెరవేరుతాయి.

32 వారు ఆయనను యూదేతరుల చేతికి అప్పగిస్తారు. వారు ఆయనను అపహసించి, ఆయన మీద ఉమ్మివేసి ఆయనను అవమానపరుస్తారు.

33 వారు ఆయనను కొరడాలతో కొట్టి చంపేస్తారు. కానీ మూడవ రోజున ఆయన తిరిగి లేస్తాడు” అని చెప్పారు.

34 ఆయన చెప్పిన ఈ మాటల్లో శిష్యులు ఏది గ్రహించలేదు. దాని అర్థం వారికి మరుగు చేయబడింది కాబట్టి ఆయన దేని గురించి మాట్లాడుతున్నాడో వారికి తెలియలేదు.


గ్రుడ్డి భిక్షగానికి చూపునిచ్చిన యేసు

35 యేసు యెరికో పట్టణ సమీపంలో ఉన్నపుడు, ఒక గ్రుడ్డివాడు దారి ప్రక్కన కూర్చుని భిక్షం అడుక్కుంటూ ఉన్నాడు.

36 జనసమూహం వెళ్తుందని వాడు విని, “ఆ సందడేంటి?” అని అడిగాడు.

37 “నజరేతువాడైన యేసు ఈ దారిలో వెళ్తున్నాడు” అని వారు జవాబిచ్చారు.

38 అందుకతడు బిగ్గరగా, “యేసు, దావీదు కుమారుడా, నన్ను కరుణించు!” అని కేకలు వేశాడు.

39 ఆ దారిలో వెళ్లేవారు వాన్ని గద్దించారు, నిశ్శబ్దంగా ఉండమని వానికి చెప్పారు. కాని వాడు, “దావీదు కుమారుడా, నన్ను కరుణించు!” అని ఇంకా బిగ్గరగా కేకలు వేశాడు.

40 తర్వాత యేసు నిలబడి, వానిని తన దగ్గరకు తీసుకుని రమ్మన్నాడు. వాడు ఆయన దగ్గరకు వచ్చినప్పుడు యేసు వానితో,

41 “నేను నీకు ఏమి చేయాలని కోరుతున్నావు?” అని అడిగారు. “ప్రభువా, నాకు చూపు కావాలి!” అని వాడు అన్నాడు.

42 యేసు వానితో, “నీవు చూపును పొందుకో; నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచింది!” అన్నారు.

43 వెంటనే వాడు చూపు పొందుకొని, దేవుని స్తుతిస్తూ యేసును వెంబడించాడు. ప్రజలందరు ఇది చూసి, వారు కూడా దేవునిని స్తుతించారు.

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం™

ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

Biblica® Open Telugu Contemporary Version™

Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

Biblica, Inc.
Lean sinn:



Sanasan