Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

లేవీయకాండము 3 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం


సమాధానబలి

1 “ ‘ఒకవేళ మీ అర్పణ సమాధానబలి అయితే, పశువుల్లో మగదానిని గాని, ఆడదానిని గాని, ఏ లోపం లేని దానిని యెహోవా సన్నిధికి తీసుకురావాలి.

2 మీరు అర్పించిన పశువు మీద చేయి ఉంచి, సమావేశ గుడారపు ద్వారం దగ్గర దానిని వధించాలి. యాజకులైన అహరోను కుమారులు దాని రక్తాన్ని బలిపీఠం చుట్టూరా చిలకరించాలి.

3 సమాధానబలి అర్పణ నుండి మీరు యెహోవాకు హోమబలిని తీసుకురావాలి: లోపలి అవయవాలు, వాటికి ఉన్న సమస్త క్రొవ్వు,

4 రెండు మూత్రపిండాలు, నడుము దగ్గర వాటి మీద ఉన్న క్రొవ్వు, మీరు మూత్రపిండాలతో పాటు తొలగించే కాలేయం మీది క్రొవ్వు అర్పించాలి.

5 అహరోను కుమారులు బలిపీఠం మీద నిప్పుపై పేర్చిన కట్టెల మీద ఉన్న దహనబలితో పాటు వీటిని దహించాలి; అది యెహోవాకు ఇష్టమైన సువాసనగల హోమబలి.

6 “ ‘ఒకవేళ మీరు మంద నుండి ఒక పశువును సమాధానబలిగా యెహోవాకు అర్పిస్తే, మగదైనా ఆడదైనా మీరు లోపం లేనిదే అర్పించాలి.

7 ఒకవేళ మీరు గొర్రెపిల్లను అర్పిస్తే, దానిని యెహోవా సన్నిధికి తీసుకురావాలి.

8 మీరు దాని తలపై చేయి ఉంచి సమావేశ గుడారం ముందు దానిని వధించాలి. అప్పుడు అహరోను కుమారులు బలిపీఠం చుట్టూరా దాని రక్తం చల్లాలి.

9 సమాధానబలి నుండి మీరు యెహోవాకు హోమబలిని తీసుకురావాలి: ఆ బలి పశువు క్రొవ్వునూ, వెన్నెముక చివర వరకు ఉండే క్రొవ్వు పట్టిన తోకంతటిని, దాని అంతర్భాగాలకు పట్టి ఉన్న క్రొవ్వునూ, వాటి దగ్గరలో కనిపించే క్రొవ్వునూ పూర్తిగా తీసుకురావాలి,

10 రెండు మూత్రపిండాలు, నడుము దగ్గర వాటి మీద ఉన్న క్రొవ్వు, మూత్రపిండాలతో పాటు తొలగించే కాలేయం మీది క్రొవ్వు అర్పించాలి.

11 యాజకుడు వాటిని బలిపీఠం మీద యెహోవాకు హోమబలిగా దహించాలి.

12 “ ‘ఒకవేళ మీరు మేకను అర్పించాలంటే, దానిని యెహోవా సన్నిధికి తీసుకురావాలి.

13 మీరు దాని తలమీద చేయి పెట్టి సమావేశ గుడారం ముందు దానిని వధించాలి. అప్పుడు అహరోను కుమారులు బలిపీఠం చుట్టూరా దాని రక్తం చల్లాలి.

14 మీరు అర్పించే దాని నుండి హోమబలి యెహోవా ఎదుట సమర్పించాలి: లోపలి అవయవాలు వాటి మీద ఉన్న కొవ్వంతా.

15 రెండు మూత్రపిండాలు నడుము దగ్గర వాటి మీద ఉన్న క్రొవ్వు, మూత్రపిండాలతో పాటు తొలగించే కాలేయం మీది క్రొవ్వు అర్పించాలి.

16 యాజకుడు వాటిని హోమబలిగా యెహోవాకు ఇష్టమైన సువాసనగల అర్పణగా బలిపీఠం మీద కాల్చివేయాలి. కొవ్వంతా యెహోవాదే.

17 “ ‘మీరెక్కడ ఉన్నాసరే క్రొవ్వును గాని రక్తాన్ని గాని అసలు తినకూడదు. ఇది మీ రాబోయే తరాలకు నిత్య కట్టుబాటుగా ఉంటుంది.’ ”

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం™

ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

Biblica® Open Telugu Contemporary Version™

Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

Biblica, Inc.
Lean sinn:



Sanasan