లేవీయకాండము 2 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదంభోజనార్పణ 1 “ ‘ఎవరైనా యెహోవాకు భోజనార్పణ తెచ్చినప్పుడు, అది నాణ్యమైన పిండితో చేసినదై ఉండాలి. వారు దాని మీద ఒలీవనూనె పోసి, దానిపై ధూపం వేసి, 2 దానిని యాజకులైన అహరోను కుమారుల దగ్గరకు తీసుకురావాలి. యాజకుడు ఒక పిడికెడు పిండి, నూనె, ధూపమంతటితో పాటు తీసుకుని బలిపీఠం మీద దానిని ఒక జ్ఞాపకార్థ భాగంగా, యెహోవాకు ఇష్టమైన సువాసనగల హోమబలిగా దహించాలి. 3 భోజనార్పణలో మిగిలింది అహరోనుకు అతని కుమారులకు చెందుతుంది; యెహోవాకు అర్పించే హోమబలులలో ఇది అతిపరిశుద్ధమైనది. 4 “ ‘ఒకవేళ మీరు పొయ్యిలో కాల్చిన భోజనార్పణ తెస్తే, అది నాణ్యమైన పిండితో చేసినదై ఉండాలి: నూనె కలిపి చేసిన పులియని మందమైన రొట్టెలు లేదా నూనె రాసి చేసిన పులియని రొట్టెలు. 5 ఒకవేళ మీ భోజనార్పణ పెనం మీద కాల్చినదైతే, అది నాణ్యమైన పిండిలో నూనె కలిపి, పులుపు లేకుండ చేయబడాలి. 6 దానిని ముక్కలుగా చేసి, నూనె పోయాలి; అది భోజనార్పణ. 7 ఒకవేళ మీ భోజనార్పణ వంటపాత్రలో వండినదైతే, దానిని నాణ్యమైన పిండిలో కొంచెం నూనె కలిపి చేయాలి. 8 వీటితో చేయబడిన భోజనార్పణను యెహోవా దగ్గరకు తీసుకురావాలి; దానిని బలిపీఠం దగ్గరకు తీసుకెళ్లేలా యాజకునికి అప్పగించాలి. 9 యాజకుడు ఆ భోజనార్పణలో నుండి జ్ఞాపకార్థ భాగాన్ని తీసి బలిపీఠం మీద దానిని యెహోవాకు ఇష్టమైన సువాసనగల హోమబలిగా కాల్చుతాడు. 10 భోజనార్పణలో మిగిలింది అహరోనుకు అతని కుమారులకు చెందుతుంది; యెహోవాకు అర్పించే హోమబలులలో ఇది అతిపరిశుద్ధమైనది. 11 “ ‘యెహోవాకు అర్పించే ప్రతి భోజనార్పణ పులిసిన పదార్థం లేకుండా ఉండాలి, ఎందుకంటే యెహోవాకు అర్పించే హోమబలిలో మీరు పులిసిన దానిని లేదా తేనెను దహించకూడదు. 12 వాటిని ప్రథమ ఫలంగా యెహోవాకు అర్పించవచ్చు కాని, బలిపీఠం మీద ఇష్టమైన సువాసనగల దానిగా వాటిని అర్పించకూడదు. 13 మీ భోజనార్పణలను అన్నిటికి ఉప్పు కలపండి. మీ దేవుని నిబంధన ఉప్పు లేకుండా మీ భోజనార్పణలు ఉండకూడదు; మీ అర్పణలన్నిటికీ ఉప్పు కలపండి. 14 “ ‘మీరు ప్రథమ ఫలాల భోజనార్పణ యెహోవా దగ్గరకు తీసుకువస్తే, క్రొత్త ధాన్యాన్ని దంచి అగ్నిలో వేయించి అర్పించాలి. 15 దాని మీద నూనె పోయాలి, ధూపం వేయాలి; అది భోజనార్పణ. 16 యాజకుడు జ్ఞాపకార్థ భాగమైన నలుగగొట్టిన ధాన్యాన్ని, నూనెను, ధూపంతో కలిపి యెహోవాకు హోమబలిగా దహించాలి. |
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం™
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Biblica® Open Telugu Contemporary Version™
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Biblica, Inc.